Gold Purity: బంగారం కొనేముందు తప్పక చెక్ చేయాల్సిన విషయాలివే, అయితేనే నాణ్యమైన బంగారం కొనగలరు
Gold Purity: బంగారం కొనుగోలు చేసేటప్పుడు బంగారం స్వచ్ఛతను క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సిందే. నాణ్యమైన, స్వచ్ఛమైన బంగారం కొనాలంటే కొన్ని విషయాలు తెల్సి ఉండాలి. అవేంటో చూడండి.
దీపావళి సమీపిస్తోంది. దేశవ్యాప్తంగా దీపాల పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ పండగలో భాగమైన ధన త్రయోదశి రోజున, లక్ష్మీ పూజలకు బంగారం కొనడం చాలా శుభప్రదమని నమ్ముతారు. కాబట్టి బంగారం కొనుగోలు చేయడానికి కాస్త ఎక్కువే ఆసక్తి చూపుతారు. అయితే కొన్ని చోట్ల బంగారం నాణ్యత, స్వచ్ఛత విషయంలోనూ మోసం చేసే అవకాశాలున్నాయి. వ్యాపారులు తక్కువ స్వచ్ఛత కలిగిన బంగారం అధిక నాణ్యత కలిగి ఉందని చెప్పి ధర పెంచి మోసం చేయవచ్చు. అందుకే బంగారం స్వచ్ఛతను పరీక్షించి ఇలాంటి మోసాల బారిన పడకుండా చూసుకోవచ్చు. మీరు కొనుగోలు చేస్తున్న బంగారానికి స్వచ్ఛత, సరైన హాల్ మార్కింగ్ ఉందని ఎలా ధృవీకరించాలో మీరు తెలుసుకోవచ్చు.

బీఐఎస్ హాల్మార్క్:
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) హాల్ మార్కింగ్ అత్యంత విశ్వసనీయమైన గోల్డ్ సర్టిఫికేషన్. ఇది బంగారం స్వచ్ఛతను నిర్ధారిస్తుంది. ఈ హాల్ మార్క్ బంగారం స్వచ్ఛతను క్యారెట్లలో (ఉదాహరణకు, 22 కె 916 91.6% స్వచ్ఛమైన బంగారాన్ని) సూచిస్తుంది. కాబట్టి మీరు కొంటున్న ఆభరణం మీద ఈ హాల్ మార్క్ ఉందే లేదో తప్పక చూడండి.
HUID నెంబరు చెక్ చేయండి:
హాల్ మార్క్ చేసిన బంగారు ఆభరణాలకు ఒక ప్రత్యేక హాల్ మార్క్డ్ యూనిక్ ఐడెంటిఫికేషన్ (HUID) నెంబరు కేటాయిస్తారు. ఇది ప్రతీ ఆభరణానికి భిన్నంగా ఉంటుంది. ఇది బంగారాన్ని ధృవీకరించడంలో సహాయపడుతుంది. ఈ నెంబరు సాయంతో BIS కేర్ యాప్ ఉపయోగించి బంగారాన్ని దాని స్వచ్ఛతను దృవీకరించుకోవచ్చు. ఇది ఆభరణాల స్వచ్ఛత, రిజిస్ట్రేషన్, హాల్ మార్కింగ్ సెంటర్ గురించిన సమాచారాన్ని వెల్లడిస్తుంది.
BIS కేర్ యాప్ వాడండి:
మీ ఫోన్‌లో ఉండే యాప్ స్టోర్ నుంచి BIS కేర్ యాప్ ని డౌన్ లోడ్ చేసుకోండి. ఈ సాఫ్ట్ వేర్ HUID వివరాలతో మీరు కొనుగోలు చేస్తున్న బంగారం వివరాలు నిజమో కాదో తెలుసుకోవడానికి మీరు సమాచారం ఇస్తుంది. ఇందులో నగల వ్యాపారి, హాల్ మార్కింగ్ కేంద్రానికి సంబంధించిన అన్ని ముఖ్యమైన వివరాల సమాచారం ఉంటుంది.
బంగారం స్వచ్ఛత:
బంగారు ఆభరణాలు వివిధ స్వచ్ఛతల్లో లభిస్తాయి. బంగారం స్వచ్ఛతను సాధారణంగా క్యారెట్లలో కొలుస్తారు. సాధారణంగా 14K, 18K, 22K, 24K రకాలు అందుబాటులో ఉన్నాయి. ఆభరణాలలో 22K బంగారం ప్రాచుర్యం పొందింది. అయితే, నాణేలు మరియు బిస్కెట్ లకు 24 క్యారెట్ల బంగారానికి ప్రాధాన్యత ఇస్తారు. ఇది వందశాతం స్వచ్ఛమైన బంగారం.
అయస్కాంత పరీక్ష:
తక్షణమే బంగారం స్వచ్ఛతను చెక్ చేయడానికి అయస్కాంతాన్ని ఉపయోగించవచ్చు. నిజమైన బంగారం అయస్కాంతాలకు ప్రతిస్పందించదు. మీరు కొనుగోలు చేసే బంగారం అయస్కాంతానికి అంటుకుంటే అది స్వచ్ఛంగా లేదని అర్థం. అతుక్కోకపోతే అది నిజమైన బంగారం అని అర్థం.
బంగారం బరువు, క్యారెట్ విలువ, హాల్ మార్క్ సర్టిఫికేషన్‌తో సహా పూర్తి బిల్లును నగల వ్యాపారి లేదా షాపు నుండి తప్పకుండా తీసుకోండి. ఇది భవిష్యత్తులో బంగారాన్ని అమ్మాలనుకుంటే మీకు సహాయపడుతుంది.
టాపిక్