Health devices: ప్రతి ఇంట్లో ఉండాల్సిన ఆరోగ్య పరికరాలు.. అత్యవసరాల్లో మిమ్మల్ని కాపాడతాయి-must have health devices everyone must own at home ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Health Devices: ప్రతి ఇంట్లో ఉండాల్సిన ఆరోగ్య పరికరాలు.. అత్యవసరాల్లో మిమ్మల్ని కాపాడతాయి

Health devices: ప్రతి ఇంట్లో ఉండాల్సిన ఆరోగ్య పరికరాలు.. అత్యవసరాల్లో మిమ్మల్ని కాపాడతాయి

Koutik Pranaya Sree HT Telugu
Jul 05, 2024 10:30 AM IST

Health devices: ఆరోగ్యం విషయంలో అత్యవసర పరిస్థితుల్లో పనికొచ్చే కొన్ని పరికరాలున్నాయి. ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన హెల్త్ డివైసెస్ ఏంటో చూడండి.

ప్రతి ఇంట్లో ఉండాల్సిన హెల్త్ డివైసెస్
ప్రతి ఇంట్లో ఉండాల్సిన హెల్త్ డివైసెస్ (freepik)

ఆరోగ్యానికి సంబంధించి అత్యవసర పరిస్థితులు ఎప్పుడైనా రావచ్చు. కొన్ని హెల్త్ డివైసెస్ ఇంట్లో ఉండటం వల్ల అలాంటి సమయాల్లో ఉపయోగపడతాయి. వీటిని ప్రతి ఇంట్లో ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చూడాలి. వీటివల్ల క్రమంగా మన ఆరోగ్యాన్ని పరీక్షించుకునే వెసులుబాటూ ఉంటుంది. అలాంటి పరికరాలేంటో చూసేయండి.

ప్రతి ఇంట్లో ఉండాల్సిన హెల్త్ డివైసెస్:

1. బ్లడ్ ప్రెజర్ మానిటర్:

బీపీ పరీక్షించుకునేందుకు ఇంట్లోనే బ్లడ్ ప్రెజర్ మానిటర్ ఉండాలి. బీపీ మెషీన్ వల్ల ఎప్పటికప్పుడు బీపీ చెక్ చేసుకోగలుగుతాం. దానికి తగ్గట్లు సత్వర వైద్య చికిత్స తీసుకోగలుగుతాం. అధిక రక్తపోటును నిర్లక్ష్యం చేస్తే గుండెపోటు లాంటి తీవ్ర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

2. గ్లుకోమీటర్:

డయాబెటిస్ ఉన్నవాళ్లు వాళ్ల దగ్గర తప్పకుండా గ్లుకోమీటర్ ఉంచుకోవాల్సిందే. రక్తంలో గ్లుకోజ్ స్థాయుల్ని ఇది లెక్కిస్తుంది. ఎప్పటికప్పుడు షుగర్ స్థాయులు చెక్ చేసుకోగలుగుతారు. ఏం తినాలి? ఎప్పుడు తినాలి? ఏం తింటే షుగర్ స్థాయుల్లో మార్పులు వస్తున్నాయో సులభంగా తెల్సుకోగలరు. దానివల్ల రక్తంలో చక్కెర స్థాయులు ఒకేసారి పెరిగి ఏ ఇబ్బందులు రాకుండా చూసుకోవచ్చు.

3. వేయింగ్ మెషీన్:

సరైన బరువులో ఉండడం ఆరోగ్యకరమైన జీవనశైలికి సూచన. ఎప్పటికప్పుడు బరువు చూస్కుంటూ ఉండటం వల్ల మన ఆహారం మీద, అలవాట్ల మీద నియంత్రంణ ఉంటుంది.

4. థర్మా మీటర్:

ఇంట్లో తప్పకుండా ఉండాల్సిన ఆరోగ్య పరికరాల్లో థర్మామీటర్ ఒకటి. చిన్న పిల్లలు ఉంటే దీని అవసరం మరింత ఎక్కువుంటుంది. జ్వరం ఎంతుందో తెల్సుకోడానికి దీన్ని వాడతాం. రీడింగ్ ఎక్కువనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుణ్ని సంప్రదించవచ్చు.

5. స్టీమర్ లేదా నెబ్యులైజర్:

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జలుబు, శ్వాసకోశ ఇబ్బందుల నుంచి ఉపశమనం కోసం నెబ్యులైజర్ లేదా స్టీమర్ వాడతారు. ఆవిరి పట్టాలంటే ఒక పాత్రలో నీళ్లు వేడి చేస్తాం కదా. బదులుగా ఏ పనీ లేకుండా ఈ స్టీమర్ లేదా నెబ్యులైజర్ ద్వారా ఆవిరి పీల్చుకోవడం మరింత సులభం. చాలా తొందరగా ఉపశమనం ఉంటుంది.

6. మసాజర్:

ఇది అత్యవసరాల్లో పనికిరాకపోవచ్చు. కానీ రోజూవారీ ఒత్తిడి నుంచి సాంత్వననిస్తుంది. ఒత్తిడి, ఆందోళన ప్రభావం పూర్తి ఆరోగ్యం మీద ఉంటుంది. మసాజర్ వాడటం వల్ల రక్త సరఫరా మెరుగుపడుతుంది. కండరాలకు మర్దనా అవుతుంది. నొప్పుల నుంచి కాస్త ఉపశమనం ఉంటుంది.

7. యాక్టివిటీ ట్రాకర్:

అంటే ఫిట్ నెస్ ట్రాకర్లు. ప్రతి ఒక్కరి దగ్గర ఈ మధ్య ఈ ఫిట్‌నెస్ లేదా యాక్టివిటీ ట్రాకర్లు కనిపిస్తున్నాయ. రోజూ ఎన్ని అడుగులు వేస్తున్నాం, ఎంత దూరం నడుస్తున్నాం, ఎన్ని కేలరీలు కరిగించాం.. లాంటి వివరాలన్నీ దీంతో తెల్సుకోవచ్చు. కాబట్టి ఒకటి ప్రతి ఒక్కరి దగ్గరా ఉండాల్సిందే. దీనివల్ల జీవన శైలిలో మార్పు వస్తుంది.

ఈ హెల్త్ డివైసులన్నీ అత్యవసరాల్లో పనికి రావడమే కాకుండా రోజూవారీ జీవనశైలిని మెరుగుపరుస్తాయి. వీటివల్ల సరైన సమయంలో చికిత్స తీసుకోవచ్చు. వీటిలో కొన్నింటి ధర నామమాత్రంగా ఉంటుంది. కొన్నింటి ధరే కాస్త ఎక్కువుండొచ్చు. అవసరాన్ని బట్టీ ఒక్కోటి కొని పెట్టుకోవడం చాలా ఉత్తమం.

Whats_app_banner