Makeup: మేకప్ వేసుకోవడం రాదా? ఇవి తెచ్చి పెట్టుకుంటే చాలు చాలా సింపుల్-must have essentials for doing basic and simple makeup ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Makeup: మేకప్ వేసుకోవడం రాదా? ఇవి తెచ్చి పెట్టుకుంటే చాలు చాలా సింపుల్

Makeup: మేకప్ వేసుకోవడం రాదా? ఇవి తెచ్చి పెట్టుకుంటే చాలు చాలా సింపుల్

Koutik Pranaya Sree HT Telugu
Published Oct 28, 2024 12:30 PM IST

Makeup: మేకప్ వేసుకోవడం మొదలు పెట్టాలి అనుకుంటే కొన్ని తప్పకుండా ఉండాల్సిన ఉత్పత్తులు ఉన్నాయి. వాటిని మీ దగ్గర ఉంచుకుంటే చాలు మంచి లుక్‌తో మెరిపించొచ్చు. అవేంటో చూసేయండి.

మేకప్
మేకప్ (freepik)

ఈ మధ్య ఏ ఫంక్షన్ వెళ్లినా ప్రతి ఒక్కరు కాస్తో కూస్తో మేకప్ వేసుకునే కనిపిస్తున్నారు. మీకు కూడా మేకప్ వేసుకోవడం మొదలు పెట్టాలి అనిపిస్తోందా? కానీ ఎలాంటి ఉత్పత్తులు అవసరమవుతాయో తెలియట్లేదా? అయితే బేసిక్, సింపుల్ మేకప్ కోసం ఏమేం అవసరమవుతాయో వాటి ఉపయోగం ఏంటో వివరంగా తెల్సుకోండి.

1. మాయిశ్చరైజర్:

మీరు ఇదివరకే ఏదైనా వాడుతుంటే దాన్నే మేకప్ కోసం కూడా వాడొచ్చు. మేకప్ కన్నా ముందు మాయిశ్చరైజర్ రాసుకోవడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. మేకప్ పేలినట్లు తెల్లగా కనిపించకుండా సాయపడుతుంది.

2. ప్రైమర్:

మేకప్ ఎక్కువగా సేపు ఉండేలా చేసేది ప్రైమర్. ఫౌండేషన్ కన్నా ముందు, మాయిశ్చరైజర్ తర్వాత దీన్ని రాసుకోవాలి. చర్మం మీదున్న సన్నం రంధ్రాలు, గీతలు ఏవైనా ఉంటే వాటిని ఇది కనిపించకుండా చేస్తుంది. మీరు రోజూవారీ మేకప్ కోసం ప్రైమర్ వాడక్కర్లేదు. మేకప్ ఎక్కువసేపు చెక్కు చెదరకుండా ఉండాలంటే ప్రత్యేకమైన రోజులకు మాత్రం ప్రైమర్ పరిమితం చేయొచ్చు.

3. ఫౌండేషన్:

మాయిశ్చరైజర్, ప్రైమర్ రాసుకోకుండా ఫౌండేషన్ రాసుకోవచ్చు. కాకపోతే కొన్ని ఫౌండేషన్ రకాలకు మాత్రమే మాయిశ్చరైజర్ గుణాలు ఉంటాయి. అలాంటప్పుడు నేరుగా రాసుకున్నా పరవాలేదు. లిక్విడ్, క్రీం, పౌడర్, స్టిక్ ఇలా చాలా రకాల్లో దొరుకుతుంది. మీ చర్మానికి నప్పే ఫౌండేషన్ రంగు, రకం ఎంచుకోవాలి. మేకప్ ఫౌండేషన్ లేకుండా వేయడం కష్టం. లేదంటే మంచి ఫినిషింగ్ లుక్ రాదు.

4. కన్సీలర్:

మీ ముఖం మీద ఎలాంటి మచ్చలు, మొటిమలు, నల్లటి వలయాలు లేకపోతే కన్సీలర్ వాడక్కర్లేదు. కానీ అలాంటి వాటిని కనబడకుండా చేయాలంటే మాత్రం కన్సీలర్ కావాలి. ఇది ఫౌండేషన్ కాస్త చిక్కగా ఉండే ఎక్కువ కవరేజీ ఇస్తుంది. అవసరం ఉన్న చోట రాసుకుని ఫౌండేషన్‌తో కలిసిపోయేలా బ్రష్ లేదా చేతివేళ్లతో కలిసేతా రాసుకోవాలి.

5. సెట్టింగ్ పౌడర్:

కన్సీలర్ రాసుకున్నాక చివరగా సెట్టింగ్ పౌడర్ రాసుకోవాలి. దీనివల్ల మీరు రాసుకున్న క్రీములన్నీ చెక్కుచెదరకుండా సెట్ అయిపోతాయి. చర్మం జిడ్డుగా మెరవకుండా కూడా ఇది సాయపడుతుంది. దీంట్లో కూడా టింటెడ్, మ్యాటె, ల్యూమినస్.. ఇలా చాలా రకాలుంటాయి. మీ అవసరాన్ని బట్టి ఎంచుకోవడమే.

6. కంటి మేకప్:

కళ్లకు వేసే మేకప్ వల్ల లుక్ పూర్తిగా మారిపోతుంది. మీరిప్పుడే మేకప్ మొదలెడుతున్నారు కాబట్టి సింపుల్ గా ఒక మస్కారా, ఐ లైనర్ ఎంచుకోండి చాలు. మేకప్ అలవాటయ్యాక ఐషాడో వాడటం మొదలుపెట్టొచ్చు.

అలాగే పెదాల మేకప్ కోసం లిప్‌స్టిక్, లిప్ గ్లాస్ అవసరం. పైన చెప్పినవన్నీ మీరు మేకప్ వేసుకోవాలనుకుంటే తప్పనిసరిగా అవసరమయ్యేవే. వీటితో పాటే బ్లష్, హైలైటర్, మేకప్ స్ప్రే, కాంటౌర్ స్టిక్స్ లేదా క్రీం అవసరమవుతాయి. అలాగే ఒక్కో ఉత్పత్తి పెట్టుకోడానికి ఒక్కో రకమైన బ్రష్ కూడా అవసరం అవుతుంది. ముందుగా మీరు బేసిక్ బ్రష్ తో మొదలుపెట్టి తర్వాత అవసరమైనవి కొనుక్కోండి.

 

Whats_app_banner