Winter Skin Care: చలికాలంలో చర్మం బాగుండాలంటే తప్పక తీసుకోవాల్సిన 6 జాగ్రత్తలు ఇవి
Winter Skin Care: చలికాలంలో చర్మ సమస్యలు ఎక్కువవుతాయి. చర్మం బాగా పొడిబారుతుంది. దీంతో పాటు మరిన్ని ఇబ్బందులు అధికం అవుతాయి. అందుకే చలికాలంలో కొన్ని జాగ్రత్తలు తప్పకుంటా పాటించాలి. వీటి ద్వారా చర్మానికి రక్షణ కలుగుతుంది.
శీతాకాలం మరికొన్ని రోజుల్లో అడుగుపెట్టనుంది. ఇప్పటికే వాతావరణం చల్లగా మారుతోంది. చలికాలంలో చర్మానికి పెద్ద సవాలుగా ఉంటుంది. ఈ సీజన్‍లో చర్మ సమస్యలు ఎక్కువగా తలెత్తుతాయి. ముఖ్యంగా చర్మం పొడిబారుతుంది. దురద, మొటిమలు లాంటి సమస్యలు పెరుగుతాయి. అయితే, కొన్ని రకాల జాగ్రత్తలు పాటించడం వల్ల శీతాకాలంలో చర్మానికి రక్షణ కలుగుతుంది. చర్మ సమస్యలు తగ్గేందుకు ఈ టిప్స్ తోడ్పడతాయి. అవేంటంటే..
సరైన మాయిశ్చరైజర్స్
చలికాలంలో అతిపెద్ద ప్రాబ్లం చర్మం పొడిబారడం. అందుకే చర్మం హైడ్రేటెడ్‍గా ఉండేలా మాయిశ్చరైజర్స్ వాడాలి. ఇవి పూసుకోవడం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది. ఆయిల్ బేస్డ్ మాయిశ్చరైజర్లు, లోషన్లు వాడాలి. ఇవి చర్మంపై రక్షణ పొరను ఏర్పాటు చేసి తేమను ఇవి లాక్ చేస్తాయి. పొడిబారే సమస్యను తగ్గిస్తాయి. నిద్రించే ముందు కూడా ఇవి రాసుకోవడం మంచిది. ఈ కాలంలో సహజమైన నూనెలను కూడా చర్మానికి రాసుకోవడం మేలు. అలాగే, మీ చర్మాన్ని బట్టి సరైన ప్రొడక్టులు ఎంపిక చేసుకోవడం కూడా ముఖ్యం.
హీటర్ వాడితే ఈ జాగ్రత్తలు
చలికాలంలో వెచ్చగా అనిపించాలని ఇళ్లలో రూమ్ హీటర్ల వాడకం ఇటీవల ఎక్కువ అయింది. అయితే, వీటి ప్రభావం చర్మంపై కూడా ఉంటుంది. అందుకే టెంపరేచర్‌గా అవసరానికి మించి ఎక్కువగా పెట్టుకోకూడదు. అలాగే, హీటర్ దగ్గరగా కూర్చుంటే చర్మం తొందరగా పొడిబారుతుంది. అలాగే, రూమ్ హీటర్ వాడితే గదిలో ఓ పెద్ద గిన్నెలో నీరు పెట్టి ఉంచాలి. దీనివల్ల గాలిలో తేమ శాతం పెరిగి చర్మానికి హాని కలగకుండా ఉంటుంది. లేకపోతే హ్యుమిడిఫయర్ వాడొచ్చు. అవసరం లేనప్పుడు హీటర్ వాడకపోతేనే చర్మానికి మంచిది.
మృధువుగా క్లెన్సింగ్
చలికాలంలో చర్మానికి క్లెన్సింగ్ చాలా జాగ్రత్తగా మృధువుగా చేసుకోవాలి. ఒకవేళ కఠినంగా చేస్తే చర్మంలోని నేచురల్ ఆయిల్స్ వెళ్లిపోయి.. పొడిగా అవుతుంది. అలాగే, ఆ కాలలో హైడ్రేటింగ్ క్లెన్సర్స్ వాడాలి. వీటి వల్ల చర్మం పొడిగా అనిపించదు. హైలురోనిక్ యాసిడ్, గ్లిసెర్టన్ ఉన్న క్లెన్సర్లు మేలు.
నీరు తగినంత తాగాల్సిందే
చలికాలమైనా అందరూ నీరు తగినంత తాగాల్సిందే. వాతావరణం చల్లగా ఉన్న కారణంగా చాలా మంది నీటిని ఎక్కువగా తీసుకోరు. ఇది కూడా చర్మానికి చేటు చేస్తుంది. నీరు తక్కువగా తాగితే చర్మంలో తేమ నిలువకుండా పొడిగా మారుతుంది. అందుకే చర్మం బాగుడాలంటే చలికాలంలోనూ తగినంత నీరు తాగాల్సిందే.
ఈ పోషకాలు ఉండే ఆహారం
చలికాలంలో పోషకాహారం తీసుకోవడం వల్ల కూడా చర్మానికి రక్షణ కలుగుతుంది. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండే ఆహారాలు ఈ కాలంలో తినాలి. వాటిలోని పోషకాలు చర్మానికి మేలు చేసి, మెరుపుతో ఉండేలా తోడ్పడతాయి.
సన్‍స్క్రీన్ కూడా..
వేసవిలో మాత్రమే సన్‍స్క్రీన్ అవసరమని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే, చలికాలంలో కూడా సన్‍స్క్రీన్ వాడడం చాలా ముఖ్యం. యూవీ కిరణాలు శీతాకాలంలోనూ ప్రభావం చూపిస్తాయి. వీటి వల్ల చర్మ సమస్యలు మరింత ఎక్కువ అవుతాయి. అందుకే చలికాలంలోనూ కూడా సన్‍స్క్రీన్ రాసుకుంటే మంచిది. సూర్యుడి నుంచి చర్మానికి కలిగే డ్యామేజ్‍ను సన్‍స్క్రీన్ రక్షిస్తుంది.