Mushroom Fry: పుట్టగొడుగుల వేపుడు ఇలా చేశారంటే రుచి అదిరిపోతుంది, అన్నం చపాతీల్లోకి తినవచ్చు-mushroom fry recipe in telugu know how to make this curry ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mushroom Fry: పుట్టగొడుగుల వేపుడు ఇలా చేశారంటే రుచి అదిరిపోతుంది, అన్నం చపాతీల్లోకి తినవచ్చు

Mushroom Fry: పుట్టగొడుగుల వేపుడు ఇలా చేశారంటే రుచి అదిరిపోతుంది, అన్నం చపాతీల్లోకి తినవచ్చు

Haritha Chappa HT Telugu
Jan 30, 2025 11:34 AM IST

Mushroom Fry: పుట్టగొడుగులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని అప్పుడప్పుడు ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇక్కడ మేము పుట్టగొడుగుల వేపుడు రెసిపీ ఇచ్చాము.

పుట్టగొడుగుల వేపుడు రెసిపీ
పుట్టగొడుగుల వేపుడు రెసిపీ (Youtube)

పుట్టగొడుగుల్లో మన ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఎన్నో ఉన్నాయి. వారానికి ఒక్కసారైనా వీటితో రకరకాల వంటలు తినడం ముఖ్యం. పుట్టగొడుగుల బిర్యాని, పుట్టగొడుగుల కూర, పుట్టగొడుగుల ఇగురు. పుట్టగొడుగుల వేపుడు ఇలా ఏది చేసినా ఇది రుచిగా ఉంటుంది. ఇక్కడ మేము పుట్టగొడుగుల వేపుడు రెసిపీ ఇచ్చాము. దీన్ని అన్నంలోనే కాదు చపాతీలతో తిన్నా రుచిగా ఉంటుంది. దీని రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

yearly horoscope entry point

పుట్టగొడుగుల వేపుడు రెసిపీకి కావలసిన పదార్థాలు

పుట్టగొడుగులు - 200 గ్రాములు

పసుపు - అర స్పూను

నీళ్లు - తగినన్ని

ఉప్పు - రుచికి సరిపడా

ఉల్లిపాయలు - రెండు

నూనే - రెండు స్పూన్లు

దాల్చిన చెక్క - చిన్న ముక్క

లవంగాలు - మూడు

అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను

కరివేపాకులు - గుప్పెడు

పచ్చిమిర్చి - మూడు

కారం - రెండు స్పూన్లు

ధనియాల పొడి - ఒక స్పూను

జీలకర్ర పొడి - అర స్పూను

మిరియాల పొడి - పావు స్పూను

గరం మసాలా - అర స్పూను

కొత్తిమీర తరుగు - ఒక స్పూను

పుట్టగొడుగుల వేపుడు రెసిపీ

1. పుట్టగొడుగుల కూర లేదా వేపుడు వండేందుకు ముందుగా పుట్టగొడుగులను పరిశుభ్రంగా కడుక్కోవాలి.

2. ఇందుకోసం ఒక గిన్నెలో నీళ్లు వేసి ఉప్పు వేసి స్టవ్ మీద పెట్టి మరిగించాలి.

3. అవి బాగా మరిగాక స్టవ్ ఆఫ్ చేయాలి. అలా మరిగిన నీటిలోనే పసుపు వేసి పుట్టగొడుగులను కూడా వేసి రెండు నిమిషాలు ఉంచాలి.

4. ఆ తర్వాత చేత్తోనే వాటిని శుభ్రంగా చేసుకోవాలి.

5. ఒక్కో పుట్టగొడుగును నిలువుగా నాలుగు ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి.

6. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

7. ఆ నూనెలో దాల్చిన చెక్క, లవంగాలు, పసుపు వేసి వేయించాలి.

8. అందులోనే ఉల్లిపాయలు తరుగును వేసి బాగా వేయించుకోవాలి.

9. ఉల్లిపాయలు పచ్చివాసన పోయేదాకా వేయించి అల్లం వెల్లుల్లి పేస్టును కూడా వేసి బాగా కలుపుకోవాలి.

10. ఇప్పుడు ఇందులో ముందుగా తరిగి పెట్టుకున్న పుట్టగొడుగులను వేసి బాగా కలపాలి.

11. పుట్టగొడుగుల్లోంచి కాస్త నీరు దిగుతుంది. ఆ నీరు ఇంకిపోయేదాకా మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి.

12. నీరు ఇంకిపోయాక గుప్పెడు కరివేపాకులు, పచ్చిమిర్చి తరుగు వేసి బాగా కలుపుకోవాలి.

13. తర్వాత కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలపాలి.

14. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి.

15. మూత పెట్టి ఇది దగ్గరగా వేపుడు లాగా అయ్యే వరకు వేయించుకోవాలి.

16. చివరిలో కొత్తిమీర తరుగును చల్లి స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతే టేస్టీ పుట్టగొడుగుల వేపుడు రెడీ అయిపోతుంది.

పుట్టగొడుగుల వేపుడు మరి డ్రైగా రాదు కాస్త ముద్దగా వస్తుంది. దీన్ని అన్నంలో కలుపుకుని తిన్నా చపాతీ, రోటీలతో తిన్నా అదిరిపోతుంది. ఒక్కసారి ఇక్కడ మేము చెప్పిన పద్ధతిలో మీరు వండుకొని చూడండి. కచ్చితంగా ఈ రెసిపీ మీకు నచ్చుతుంది.

పుట్టగొడుగులు మన అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. వీటిలో సెలీనియం, విటమిన్ డి, రిబోఫ్లావిన్, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి. పుట్ట గొడుగులు ఎన్ని తిన్నా కూడా బరువు పెరగరు. అలాగే తీవ్రమైన వ్యాధుల బారిన పడకుండా మన శరీరాన్ని కాపాడడంలో ఇవి ముందుంటాయి. పుట్టగొడుగులు తరచూ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇక్కడ మేము చెప్పిన పద్ధతిలో పుట్టగొడుగుల వేపుడు చేసుకుని చూడండి. మీకు కచ్చితంగా నచ్చుతుంది.

Whats_app_banner