Munakkada Ulli Karam: ఉల్లికారం పెట్టి మునక్కాడ కూర వండి చూడండి, దీని ముందు చికెన్ కర్రీ కూడా పనికి రాదు
Munakkada Ulli Karam: ఆంధ్రా వంటకాలలో మునక్కాడ ఉల్లికారం ఒకటి. దీని రుచి మామూలుగా ఉండదు. చికెన్ కూర కన్నా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి వండుకుని చూడండి, మీకే తెలుస్తుంది దీని రుచి.
Munakkada Ulli Karam: ఉల్లికారం పెట్టి వండిన కూరలు చాలా రుచిగా ఉంటాయి. కానీ ఏ కూరగాయలను ఉల్లికారం పెట్టి వండితే బావుంటాయో మాత్రం చాలా మందికి తెలియదు. మునక్కాడ ఉల్లికారం కర్రీ వండుకుని చూడండి, దాని రుచి ముందు మీకు ఏ కూరలైనా దిగదుడుపే. ఈ కూర వండడం కూడా చాలా సులువు. త్వరగా ఉడికేస్తుంది కూడా. వేడి వేడి అన్నంలో ఈ కూర కలుపుకుని చూడండి. మీకు ఎంతో నచ్చుతుంది.
మునక్కాడ ఉల్లికారం రెసిపీకి కావాల్సిన పదార్థాలు
మునక్కాడ ముక్కలు - పది
ఉల్లి పాయ - రెండు
ఎండు మిర్చి - ఎనిమిది
చింతపండు - ఉసిరికాయ సైజులో
నీరు - తగినంత
జీలకర్ర - ఒక స్పూను
నూనె - తగినంత
ధనియాలు - ఒక స్పూను
శెనగపప్పు - అరస్పూను
ఆవాలు - అరస్పూను
కరివేపాకులు - గుప్పెడు
ఉప్పు - రుచికి సరిపడా
పసుపు - అర స్పూను
మునక్కాడ ఉల్లికారం రెసిపీ
1. మునక్కాడలను ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి.
2. చింతపండును గోరువెచ్చటి నీటిలో నానబెట్టుకోవాలి.
3. ఉల్లిపాయలను మిక్సీ జార్లో వేసి రుబ్బుకుని పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి ధనియాలు, అరస్పూను జీలకర్ర, ఎండు మిర్చి వేసి వేయించాలి.
5. వాటిని మిక్సీలో వేసి పొడిలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
6. ఇప్పుడు అదే కళాయిలో నూనె వేయాలి.
7. నూనె వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి.
8. తరువాత కరివేపాకులు, పసుపు, ముందుగా రుబ్బుకున్న ఉల్లి పేస్టు వేసి వేయించుకోవాలి.
9. బంగారు రంగులోకి వచ్చే ఆ మిశ్రమాన్ని వేయించాలి.
10. ఆ మిశ్రమంలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాడలను వేసి వేయించుకోవాలి.
11. తరువాత చింతపండు నానబెట్టిన నీటిని గుజ్జులా చేసి కలుపుకోవాలి.
12. ఆ మొత్తం మిశ్రమాన్ని చిన్న మంట మీద ఉడకనివ్వాలి.
13. అవి ఉడుకుతున్నప్పుడు ముందు చేసి పెట్టుకున్న పొడిని వేసి కలుపుకోవాలి.
14. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి.
15. చిన్న మంట మీద ఇగురులా వచ్చే వరకు ఈ కూరను ఉడికించుకోవాలి. ఇగురులా అయ్యాక స్టవ్ కట్టేయాలి. అంతే టేస్టీ మునక్కాడ ఉల్లికారం రెడీ అయినట్టే.
మునగ చేసే మేలు ఇంతా అంతా కాదు. మునగ ఆకులు, కాండం, మునక్కాడలు అన్నీ మన ఆరోగ్యానికి మేలే చేస్తాయి. మాంసం తినకుండానే దానిలోని పోషకాలను మునక్కాడల తినడం ద్వారా పొందవచ్చు. ఎన్నో శారీరక రుగ్మతలకు మునక్కాడల్లోని పోషకాలు చెక్ పెడతాయి. మునక్కాడలు తినడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుంది. అలాగే అధిక రక్తపోటు కూడా తగ్గుతుంది. చర్మం మెరవడానికి మునగ ఆకులు, మునక్కాడలు ఎంతో సహాయపడతాయి.
టాపిక్