Munagaku Rice: మునగాకు రైస్ రెసిపీ, డయాబెటిక్ పేషెంట్లకు అద్భుతమైన ఔషధం ఇది-munagaku rice recipe in telugu it is an excellent remedy for diabetic patients ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Munagaku Rice: మునగాకు రైస్ రెసిపీ, డయాబెటిక్ పేషెంట్లకు అద్భుతమైన ఔషధం ఇది

Munagaku Rice: మునగాకు రైస్ రెసిపీ, డయాబెటిక్ పేషెంట్లకు అద్భుతమైన ఔషధం ఇది

Haritha Chappa HT Telugu
Nov 18, 2024 05:30 PM IST

Munagaku Rice: డయాబెటిక్ పేషెంట్లు అన్నం తక్కువగా తినాలి. అయితే అప్పుడప్పుడు ఇలా మునగాకు రైస్ చేసుకొని తింటే వారి ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. దీని రెసిపీ కూడా చాలా సులువు.

మునగాకుల రైస్ రెసిపీ
మునగాకుల రైస్ రెసిపీ

మునగాకును సూపర్ ఫుడ్ గా చెబుతారు. డయాబెటిక్ పేషెంట్లు కచ్చితంగా తినాల్సిన వాటిలో మునగాకు ఒకటి. అయితే తెల్ల అన్నాన్ని మాత్రం తగ్గించమని మధుమేహ రోగులకు వివరిస్తారు వైద్యులు. రోజులో ఒకసారి తెల్ల అన్నాన్ని తినే డయాబెటిక్ రోగులు ఎంతోమంది. అలా తినేటప్పుడు దాన్నే మునగాకు రైస్ గా చేసుకొని అప్పుడప్పుడు తినండి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను కూడా అదుపులో ఉంచుతుంది. తెల్ల అన్నం తిన్నా కూడా మునగాకు వల్ల ఆ చెడు ప్రభావం పడకుండా ఉంటుంది. మునగాకు రైస్ రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

మునగాకు రైస్ రెసిపీ కావాల్సిన పదార్థాలు

మునగాకులు - ఒక కప్పు

వెల్లుల్లి రెబ్బలు - ఆరు

జీలకర్ర - ఒక స్పూను

ఎండుమిర్చి - నాలుగు

నువ్వులు - ఒక స్పూను

ధనియాలు - ఒక స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

అన్నం - ఒక కప్పు

మిరియాల పొడి - ఒక స్పూను

ఆవాలు - ఒక స్పూను

పచ్చిశనగపప్పు - ఒక స్పూను

మినప్పప్పు - ఒక స్పూను

జీడిపప్పులు - గుప్పెడు

మునగాకు రైస్ రెసిపీ

1. స్టవ్ మీద కళాయి పెట్టి రెండు ఎండుమిర్చి, ధనియాలు, నువ్వులు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, మునగాకులు వేసి వేయించుకోవాలి.

2. ఈ మొత్తాన్ని చల్లార్చి మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. అంతే మునగాకు పొడి రెడీ అయినట్టే.

3. ఇప్పుడు స్టవ్ మీద మరొక కళాయి పెట్టి నూనె వేయాలి.

4. ఆ నూనెలో ఆవాలు వేసి చిటపటలాడించాలి.

5. తర్వాత సెనగపప్పు, మినప్పప్పు, రెండు ఎండుమిర్చి, తరిగిన వెల్లుల్లి వేసి బాగా వేపుకోవాలి.

6. జీడిపప్పులను కూడా వేసి వేయించుకోవాలి.

7. అందులోనే ముందుగా వండి పెట్టుకున్న అన్నాన్ని వేసి కలపాలి.

8. మునగాకు పొడిని, రుచికి సరిపడా ఉప్పును వేసి ఈ మొత్తం మిశ్రమాన్ని పులిహోర లాగా కలుపుకోవాలి.

9. అంతే టేస్టీ మునగాకు రైస్ రెడీ అయినట్టే. ఇది చాలా రుచిగా ఉంటుంది.

మునగాకు ఉపయోగాలు

మునగాకులు తినడం వల్ల డయాబెటిస్ రోగులకే కాదు, సాధారణ వ్యక్తులకు కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మునగ ఆకుల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. కాబట్టి రోగనిరోధక శక్తి చాలా పెరుగుతుంది. జుట్టు రాలడానికి కీళ్ల నొప్పులు, ఉబ్బసం వ్యాధులతో బాధపడేవారు మునగాకును తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి. బరువు తగ్గాలనుకునే వారు కూడా తరచూ మునగాకులను తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మునక్కాయలాగే మునగాకుల్లో కూడా యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి కాలేయాన్ని రక్షిస్తాయి. మూత్రపిండాల వ్యాధులతో బాధపడే వారు కూడా మునగాకులను, మునక్కాయలను తినడం అలవాటు చేసుకుంటే ఎంతో మంచిది. ప్రకృతి ఇచ్చిన సంపదల్లో మునగాకు కూడా ఒకటి. కాకపోతే ఈ విషయాన్ని మనుషులు చాలా ఆలస్యంగా గుర్తించారు.

Whats_app_banner