Munagaku pachadi: మునగాకు పచ్చడి ఆరోగ్యానికి అమృతంలాంటిది, రెసిపీ ఇలా ఫాలో అయిపోండి-munagaku pachadi recipe in telugu know how to make this chutney ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Munagaku Pachadi: మునగాకు పచ్చడి ఆరోగ్యానికి అమృతంలాంటిది, రెసిపీ ఇలా ఫాలో అయిపోండి

Munagaku pachadi: మునగాకు పచ్చడి ఆరోగ్యానికి అమృతంలాంటిది, రెసిపీ ఇలా ఫాలో అయిపోండి

Haritha Chappa HT Telugu

Munagaku pachadi: మునక్కాడలే కాదు మునగాకులో కూడా ఎన్నో పోషకాలు ఉంటాయి. మునగాకు పచ్చడిని స్పైసీగా చేసుకుంటే రుచి అదిరిపోతుంది.

మునగాకు పచ్చడి రెసిపీ

మునక్కాడ కూర ఎక్కువ మంది తింటూ ఉంటారు. కానీ మునగాకులు మాత్రం పెద్దగా తినరు. మునగాకులతో చేసే వంటకాలు రుచిగానే ఉంటాయి. దీనిని పచ్చడిగా, వేపుడుగా, పప్పులో జతగా వేసుకొని తినవచ్చు. మునగాకుని ఎలా తిన్నా ఆరోగ్యానికి మంచిదే. ఇది మన ఆరోగ్యానికి దివ్యౌషధం అని చెప్పుకోవాలి. మిగతా పచ్చళ్లతో పోలిస్తే మునగాకు పచ్చడి తినడం వల్ల మన శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి. డయాబెటిస్ ఉన్నవారు కచ్చితంగా తినాల్సిన పదార్థాలలో మునగాకు పచ్చడి ఒకటి. దీని రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

మునగాకు పచ్చడి రెసిపీకి కావలసిన పదార్థాలు

మునగాకు - రెండు కప్పులు

వెల్లుల్లి రెబ్బలు - ఎనిమిది

పచ్చిమిర్చి - ఎనిమిది

ఉప్పు - రుచికి సరిపడా

పసుపు - పావు స్పూను

చింతపండు - నిమ్మకాయ సైజులో

మెంతులు - అర స్పూను

జీలకర్ర - అర స్పూను

టమోటోలు - రెండు

ఎండుమిర్చి - రెండు

మినప్పప్పు - ఒక స్పూను

ఆవాలు - ఒక స్పూను

జీలకర్ర - ఒక స్పూను

నూనె - తగినంత

కరివేపాకులు - గుప్పెడు

మునగాకు పచ్చడి రెసిపీ

1. మునగాకులను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి.

2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి ఆయిల్ వేయండి.

3. అందులో పచ్చిమిర్చిని వేయించి తీసి పెట్టుకోండి.

4. మిగిలిన నూనెలో మునగాకును వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి.

5. రెండు మూడు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది.

6. మునగాకులు వేగిన తర్వాత మెంతులు, జీలకర్ర కూడా వేసి వేయించండి.

7. ఆ తర్వాత టమోటో ముక్కలు, ఉప్పు, పసుపు వేసి బాగా వేయించండి.

8. టమాటోలు మెత్తగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేయండి.

9. ఈ మిశ్రమం మొత్తం చల్లారనివ్వాలి.

10. ఇప్పుడు మిక్సీ జార్లో ఈ మునగాకు మిశ్రమాన్ని చింతపండు, వెల్లుల్లి రెబ్బలు ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసి మెత్తగా రుబ్బుకోవాలి.

11. ఈ మొత్తం మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.

12. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

13. అందులో జీలకర్ర, ఎండుమిర్చి, ఆవాలు, మినప్పప్పు వేసి వేయించుకోవాలి. కరివేపాకులను కూడా వేయాలి.

14. ఇవన్నీ వేగాక మునగాకు మిశ్రమంపై చల్లుకోవాలి.

15. అంతే టేస్టీ మునగాకు స్పైసీ పచ్చడి రెడీ అయిపోయినట్టే.

16. దీన్ని వేడి వేడి అన్నంలో తింటే రుచి అదిరిపోతుంది.

మిగతా పచ్చళ్లతో పోలిస్తే మునగాకు పచ్చడికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఇది రుచిగా ఉండటమే కాదు మన ఆరోగ్యానికి కావలసిన అన్ని పోషకాలను కలిగి ఉంటుంది. డయాబెటిస్ తో బాధపడుతున్నవారు, అధిక రక్తపోటు ఉన్నవారు కచ్చితంగా మునగాకు పచ్చడి తినాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి దీన్ని మీరు తిని చూడండి, కచ్చితంగా ఇది నచ్చుతుంది. ఆరోగ్యం కోసం తినాల్సిన వాటిలో మునగాకు పచ్చడి మొదటి స్థానంలో ఉంటుంది. కేవలం పచ్చడి రూపంలోనే కాదు పప్పులో మునగాకును వేసి వండుకోవడం, పెసరపప్పు మునగాకు కలిపి వేపుడు చేసుకోవడం వంటివి కూడా చేయండి. ఎలాగైనా మునగాకును ఆహారంలో భాగం చేసుకోవడం ముఖ్యం.