Moringa Laddu: మునగాకు లడ్డు రెసిపీ, రోజుకు ఒకటి తింటే చాలు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు
Moringa Laddu: మునగాకు సూపర్ ఫుడ్‌లో భాగంగా మారింది. మునగాకుతో లడ్డు చేసుకుని ప్రతిరోజూ తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. పైగా చర్మం అందంగా మెరుస్తుంది కూడా. మునగాకు లడ్డు రెసిపీ ఇక్కడ ఇచ్చాము.
మునగాకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని ఆహారంలో భాగం చేసుకున్న వారి సంఖ్య పెరుగుతోంది. అలాగే దీంతో కొన్ని రకాల స్వీట్లు కూడా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ మేము మునగాకు లడ్డు రెసిపీ ఇచ్చాము. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా మహిళలు దీన్ని తినడం వల్ల చర్మం, జుట్టు, గోళ్ళను కాపాడుకున్న వారవుతారు. పిల్లలకు ప్రతిరోజూ ఒక మునగాకు లడ్డూ తినిపిస్తే వారికి జలుబు, జ్వరం వంటివి త్వరగా రాకుండా ఉంటాయి. ఈ మునగాకు లడ్డు ఎలా చేయాలో తెలుసుకోండి.
మునగాకు లడ్డు రెసిపీకి కావలసిన పదార్థాలు
పిస్తాలు - పావు కప్పు
కొబ్బరి తురుము - అరకప్పు
యాలకుల పొడి - అర స్పూను
కిస్మిస్లు - ముప్పావు కప్పు
మునగాకులు - ఒక కప్పు
గుమ్మడి గింజలు - పావు కప్పు
మునగాకు లడ్డు రెసిపీ
1. స్టవ్ మీద కళాయి పెట్టి మునగాకులను వేసి వేయించాలి.
2. అవి తేమ లేకుండా పొడిపొడిగా అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు అదే కళాయిలో పిస్తాలు, గుమ్మడి గింజలు, కొబ్బరి తురుము కూడా వేసి వేయించుకోవాలి.
4. ఆ తరువాత కిస్మిస్‌ని కూడా వేయించాలి.
5. స్టవ్ ఆఫ్ చేసి మిక్సీలో మునగాకులను వేసి పొడి చేసుకోవాలి.
6. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మునగాకుల పొడిని వేయాలి.
7. ఆ పొడిలోనే యాలకుల పొడిని కూడా వేయాలి.
9. ఇప్పుడు మిక్సీలో పిస్తాలు, గుమ్మడి గింజలు, కిస్మిస్లు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కూడా మునగాకు పొడిలో కలుపుకోవాలి.
10. అలాగే కొబ్బరి తురుమును కూడా వేసుకోవాలి.
11. మీకు నచ్చితే నెయ్యిని కూడా వేసుకోవచ్చు.
12. వీటన్నింటినీ కలిపి లడ్డూల్లా చుట్టుకోవాలి. ప్రతిరోజూ ఒక లడ్డును తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
మునగాకుల్లో పోషకాలు
మునగాకులను తినడం వల్ల విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ బి వంటి ముఖ్యమైన పోషకాలు శరీరానికి అందుతాయి. అలాగే జింక్, ఐరన్, కాపర్, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్ వంటివి కూడా మన శరీరానికి చేరుతాయి. ముఖ్యంగా మహిళలు ప్రతిరోజూ మునగాకు లడ్డును తినడం వల్ల వారి చర్మం మెరిసిపోతుంది. జుట్టు పెరుగుతుంది. గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కాబట్టి నెల రోజులు పాటు రోజుకో మునగాకు లడ్డు తిని చూడండి. నెల రోజుల తర్వాత మీ చర్మంలో, జుట్టులో, గోళ్ళలో మార్పును గమనించండి. అలాగే పిల్లలకు ఈ మునగాకు లడ్డూను తినిపించడం వల్ల వారి రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. వారికి సీజనల్ జ్వరాలు, జలుబు, దగ్గు వంటివి రాకుండా ఉంటాయి.