మొహర్రం 2025: ఇస్లామిక్ క్యాలెండర్‌లో అత్యంత పవిత్రమైన నెలల్లో ఒకటైన మొహర్రంను ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఎంతో భక్తిశ్రద్ధలతో పాటిస్తారు. ఈ నెలకు ముస్లిం సమాజంలో లోతైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. మొహర్రం, ఇస్లామిక్ క్యాలెండర్‌లోని మొదటి నెల. దీని తర్వాత సఫర్, రబీ అల్-థాని, జుమాదా అల్-అవ్వల్, జుమాదా అత్-థానియా, రజబ్, షాబాన్, రంజాన్, షవ్వాల్, ధుల్ ఖదా, ధుల్ హిజ్జా నెలలు వస్తాయి.
మొహర్రం నెల పదో రోజును ఆషూరా అని పిలుస్తారు. ఈ ఏడాది జూన్ 26న నెలవంక కనిపించడంతో, జూన్ 27న మొహర్రం నెల ప్రారంభమైంది. దీని ప్రకారం, జూలై 6న ఆషూరా పాటించనున్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న షియా, సున్నీ ముస్లింలకు ఆషూరా చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. ప్రవక్త మోసెస్ (మూసా), ఇజ్రాయెల్ ప్రజలను ఫరో నిరంకుశత్వం నుండి కాపాడిన రోజుగా సున్నీ ముస్లింలు ఆషూరాను గుర్తు చేసుకుంటారు. షియా ముస్లింలు మాత్రం కర్బలా యుద్ధంలో ప్రవక్త ముహమ్మద్ మనవడు ఇమామ్ హుస్సేన్ అమరవీరుడైన రోజుగా ఆషూరాను స్మరించుకుంటారు.
షియా, సున్నీ ముస్లింలు ఇద్దరూ పవిత్రమైన ఆషూరా రోజున ఉపవాసం పాటిస్తారు. కానీ వారి కారణాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఈ రోజున ఉపవాసం పాటించే పద్ధతులు కూడా వారికి వేర్వేరుగా ఉంటాయి. సున్నీ ముస్లింల విషయానికి వస్తే, ఇస్లామిక్ పూర్వ కాలం నుంచే ఆషూరా ఆచారం ఉంది. అల్లా పట్ల కృతజ్ఞతను తెలియజేయడానికి ఉపవాసం పాటిస్తారు.
ప్రవక్త ముహమ్మద్ కూడా ఆషూరా రోజున ఉపవాసం పాటించారని, తన అనుచరులను కూడా ఉపవాసం ఉండమని కోరారని సున్నీ ముస్లింలు నమ్ముతారు. అందుకే, సున్నీ ముస్లింలు ఈ రోజున ప్రవక్త ముహమ్మద్ బోధనలను పాటిస్తారు.
షియా ముస్లింలు ఆషూరాను లోతైన సంతాపం, దుఃఖంతో పాటిస్తారు. ఎందుకంటే ఈ రోజు ప్రవక్త ముహమ్మద్ మనవడైన ఇమామ్ హుస్సేన్ అమరవీరుడైన రోజు. అన్యాయం, నిరంకుశత్వంపై ప్రతిఘటనకు ప్రతీకగా ఇమామ్ హుస్సేన్ అమరత్వం నిలుస్తుంది. ఆషూరా రోజున, షియా ముస్లింలు ఇమామ్ హుస్సేన్ బాధలతో ఆధ్యాత్మికంగా మమేకం కావడానికి, ఆయనకు నివాళులర్పించడానికి ఉపవాసం పాటిస్తారు.
టాపిక్