Motivational Story: డబ్బుతో వస్తువులను కొనచ్చు కానీ నిజమైన ప్రేమను కొనలేం, విలువలను కాపాడుకోలేం!-motivational story money can buy things but it cant buy true love or protect values ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Motivational Story: డబ్బుతో వస్తువులను కొనచ్చు కానీ నిజమైన ప్రేమను కొనలేం, విలువలను కాపాడుకోలేం!

Motivational Story: డబ్బుతో వస్తువులను కొనచ్చు కానీ నిజమైన ప్రేమను కొనలేం, విలువలను కాపాడుకోలేం!

Ramya Sri Marka HT Telugu

Motivational Story: డబ్బుతో సౌకార్యాలను కొనచ్చు కానీ సౌఖ్యాన్ని కొనలేము. ఓదార్పునిచ్చే వస్తువులను కొనచ్చు కానీ ఓదార్పు, ప్రేమతో కూడిన మాటలను వినలేము. ధనం ఉంటే విలాసాలను అనుభవించవచ్చు కానీ విలువలతో కూడిన జీవితాన్ని పొందలేమని ఈ చిన్న కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు.

డబ్బుతో కొనలేనివి చాలా ఉంటాయని తెలుసుకోండి

డబ్బు లేనిదే లోకమే లేదు నిజమే! కానీ ఈ లోకంలో డబ్బుతో కొనలేనివి చాలా ఉన్నాయని తెలుసుకోండి. డబ్బు ఉంటేనే మనుషులు విలువనిస్తారు, కానీ అదే డబ్బు విలువలతో కూడిన జీవితాన్ని మాత్రం ఇవ్వలేదు. ధనం చేతిలో ఉంటే మనుషులను పెట్టుకుని పని చేయించుకోగలుగుతాం. కానీ వారి మనసుల్లో ప్రేమను మాత్రం పుట్టించలేమం. డబ్బు అంటే ఎన్నో రకాల సౌకర్యాలను అనుభవించవచ్చు కానీ బంధాలు ఇచ్చే సంతోషాన్ని, సౌఖ్యాన్ని సంపాదించుకోలేం. విలాసవంతమైన జీవితాన్ని డబ్బుతో కొనచ్చు కానీ వ దాంతో బంధాల మధ్య ఉండే విలువలను, విలువైన మనుషులను కాపాడుకోలేం. ఈ తండ్రీ కొడుకుల కథ చదివితే ఈ విషయం మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది.

ధనవంతుడైన తండ్రి, తెలివైన కొడుకు..

బాగా ధనవంతుడైన ఒక తండ్రి తాము ఎంత అదృష్లవంతులో తన కొడుకుకు అర్థం అయ్యేలా చెప్పాలనుకుంటారు. వాళ్లు ఎంత సుఖంగా, సంతోషంగా జీవిస్తున్నారో తెలియజేయడమే ఆ తండ్రి ఉద్దేశం. ఇందుకోసం ఆ తండ్రి తన కొడుకును ఒకసారి గ్రామీణ ప్రాంతాల పర్యటనకు తీసుకెళ్లాడు.అక్కడ పేద ప్రజలు ఎలా జీవిస్తారో తన కొడుకుకు చూపించడం, తద్వారా కొడుకు వారి అదృష్టాన్ని తెలుసుకుని తన గొప్పతనాన్ని అభినందించాలి అనేది ఆ తండ్రి ఆశ.

ప్రయాణంలో భాగంగా తండ్రీ కొడుకులు ఒక చిన్న గ్రామానికి చేరుకున్నారు. ఆ ఊర్లో ఉండే ఒక పేద కుటుంబంతో కలిసి పొలంలో రెండు పగళ్లు, ఇంట్లో రెండు రాత్రులు గడిపారు. తర్వాత తిరిగి వారి ఇంటికి ప్రయాణమయ్యారు. ఇంటికి వెళ్తుండగా, తండ్రి కొడుకుని "ఈ ప్రయాణం, పేద కుటుంబంతో కలిసి రెండు రోజులు గడపడం నీకు ఎలా అనిపించింది" అని అడిగాడు.

దానికి ఆ కొడుకు చాలా సంతోషంగా, ఉత్సాహంగా.. “ఇది చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది నాన్న!” అని జవాబిచ్చాడు. అప్పుడు తండ్రి "ఆ పేద ప్రజలు ఎలా జీవిస్తున్నారో గమనించావా, వారు ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారో చూశావా? దీన్ని బట్టి మన సంపద అంతటితో మనం ఎంత అదృష్టవంతులమో నీకు అర్థం అయ్యిందా, ఇది నీకు అర్థం అయ్యేలా చేయడమే ఈ ప్రయాణం వెనకున్న ఉద్దేశ్యం." అని కొడుకుతో అన్నాడు.

ఏది నిజమైన అదృష్టం..

అప్పుడు కొడుకు “అవును!" అని నిట్టూర్పుతో కూడిన నవ్వు నవ్వుతూ అన్నాడు. తర్వాత తండ్రి.. “సరే, చెప్పు ఈ ప్రయాణం నుండి నువ్వు ఏమి నేర్చుకున్నావు?” అని అడిగాడు. దానికి జవాబుగా ఆ కొడుకు ఇలా అన్నాడు. " నాన్న వాళ్ల జీవన విధానంలో నేను చాలా విషయాలను గమనించాను. మన ఇంటికి కాపలాగా ఒకటే కుక్క ఉంది. కానీ వారి ఇంటికి కాపలాగా మూడు నాలుగు కుక్కలున్నాయి. మనకు ఒకటే స్విమ్మింగ్ పూల్ ఉంది. కానీ వారికి నిరంతరం పారే నది ఉంది. మన తోటలో ఫాన్సీ లాంతర్లు ఉన్నాయి. కానీ వారికి మాత్రం రాత్రిపూట వెలిగే చంద్రుడు, నక్షత్రాలు ఉన్నాయి." అన్నాడు. కొడుకు చెప్పిన ఈ విచిత్రమైన సమాధానం మొదట తండ్రికి అర్థం కాలేదు.

తర్వాత కొడుకు.. “మనం మన ఆహారాన్ని కొనుక్కుంటాము, కానీ వాళ్ళు వాళ్ళ ఆహారాన్ని పండించుకుని, ఇంట్లోనే పెంచుకునీ తింటారు. మనల్ని కాపాడుకోవడానికి మన బంగ్లా చుట్టూ పెద్ద పెద్ద గోడలు ఉన్నాయి, కానీ వాళ్ళని కాపాడుకోవడానికి వాళ్ళకి స్నేహితులు, కుటుంబ సభ్యులు ఉన్నారు. మనం మన ఖాళీ సమయాన్ని టీవీలు, ఫోన్లతో గడుపుతాము, కానీ వాళ్ళు తమ ఖాళీ సమయాన్ని కుటుంబం, స్నేహితులతో గడుపుతారు.” అంటూ పర్యటనలో తన అనుభవాన్ని ఇలా వివరంగా చెప్పాడు. చివరిగా “మనం ఎంత పేదవాళ్ళమో ఇప్పుడే నాకు అర్థంమవుతుంది నాన్న, ఇది నాకు తెలిసేలా చేసినందుకు మీకు ధన్యావాదాలు” అన్నాడు. కొడుకు మాటలకు తండ్రి కళ్లు తెరుచుకున్నాయి.

ఈ కథలో నీతి..

ఈ కథలో నీతి ఏంటంటే.. డబ్బుతో ఓదార్పునిచ్చే వస్తువులను, విలాసవంతమైన జీవితాన్ని ఇవ్వగలదు. కానీ స్వచ్ఛమైన ప్రేమ, దయ, కరుణ, స్నేహం, విలువులు, కుటుంబం వంటివి వాటిని ఇవ్వలేవు. నిజానికి ఇవే మనుషులను నిజమైన ధనవంతులుగా చేస్తాయి. వీటిని డబ్బుతో కొనలేము. జీవితంలో ఉన్నవాటిని మర్చిపోయి, లేనివాటిపై దృష్టి పెట్టడం చాలా సులభం. కొన్నిసార్లు జీవితంలో ఏది ముఖ్యమూ, ఏది సంతోషమో గుర్తు చేయడానికి పిల్లల దృక్పథం కూడా అవసరం . కాబట్టి డబ్బే శాశ్వతం అనుకుని దాని మాయలో పడి బంధాలను, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకండి. డబ్బు సంపాదించేది ఆకుటుంబం కోసమే కనుకు వారిని సంతోష పెట్టడమే ముఖ్యమని గుర్తుంచుకోండి.

Ramya Sri Marka

eMail
రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం