ఉదయం నడక మంచిదా? సాయంత్రం నడక మంచిదా? వైద్య నిపుణుల సలహాలు చూడండి-morning vs evening walk doctor shares which one is more efficient ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  ఉదయం నడక మంచిదా? సాయంత్రం నడక మంచిదా? వైద్య నిపుణుల సలహాలు చూడండి

ఉదయం నడక మంచిదా? సాయంత్రం నడక మంచిదా? వైద్య నిపుణుల సలహాలు చూడండి

HT Telugu Desk HT Telugu

నడక (వాకింగ్) ఏ సమయంలో చేయాలి? ఉదయం చేస్తే ఎలాంటి ప్రత్యేక ప్రయోజనాలు ఉంటాయి? సాయంత్రం చేస్తే ఉండే అదనపు ప్రయోజనాలు ఏంటి? వంటి వివరాలను డాక్టర్ సురేందర్ పాల్ ఇక్కడ వివరించారు

మీరు చురుగ్గా ఉండాలంటే నడక తప్పనిసరి (Freepik)

నడక మన రోజువారీ జీవితంలో చాలా ముఖ్యం. దీనివల్ల మనం చురుకుగా ఉంటాం. స్థూలకాయం రాకుండా చూసుకోవచ్చు. ఏ సమయంలో నడిచినా మంచిదే. కానీ, ఎక్కువ కేలరీలు కరిగించాలన్నా, జీర్ణశక్తి పెరగాలన్నా ఏ సమయంలో నడిస్తే మంచిది అని చాలామందికి సందేహం ఉంటుంది. దీనిపై నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.

ఢిల్లీలోని సీకే బిర్లా హాస్పిటల్ ఫిజియోథెరపీ విభాగాధిపతి డాక్టర్ సురేందర్ పాల్ సింగ్ ఉదయం లేదా సాయంత్రం నడకలో ఏది మంచిదో HT లైఫ్‌స్టైల్‌కు వివరించారు.

డాక్టర్ సింగ్ మాట్లాడుతూ, “నడక అనేది చాలా సులభమైన, ప్రభావవంతమైన వ్యాయామం. ఇది బరువు తగ్గడానికి, గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. అలాగే, మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఉదయం, సాయంత్రం నడకలకు ప్రత్యేక లాభాలు ఉన్నాయి. మీరు ఏ సమయంలో నడవాలో మీ జీవనశైలి, సమయం, వ్యక్తిగత ఇష్టాన్ని బట్టి ఉంటుంది” అని చెప్పారు. నడక వల్ల కలిగే ప్రయోజనాలను డాక్టర్ సింగ్ వివరించారు.

ఉదయం సూర్యరశ్మి వల్ల విటమిన్ డి కూడా లభిస్తుంది
ఉదయం సూర్యరశ్మి వల్ల విటమిన్ డి కూడా లభిస్తుంది (Freepik)

ఉదయం నడక:

ఎవరికి మంచిది: రోజును ఉత్సాహంగా ప్రారంభించాలనుకునే వారికి ఉదయం నడక చాలా మంచిది.

లాభాలు:

  • పొద్దున్నే మన శక్తి స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో నడవడం వల్ల జీవక్రియ వేగవంతమై, కొవ్వు కరుగుతుంది.
  • ఇది రోజు మొత్తానికి సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. మానసిక స్పష్టతను, ఏకాగ్రతను పెంచుతుంది.
  • తక్కువ అవాంతరాలు, స్వచ్ఛమైన గాలి, ప్రశాంతమైన వాతావరణం వల్ల క్రమం తప్పకుండా నడవడం సులభం అవుతుంది.
  • ఉదయం సూర్యరశ్మి శరీరానికి విటమిన్ డి అందిస్తుంది. నిద్ర మేల్కొనే చక్రాలను నియంత్రించే సర్కాడియన్ రిథమ్‌ను సరిచేయడంలో సహాయపడుతుంది.

సాయంత్రం నడక రక్తంలో గ్లూకోజు స్థాయిలను మెరుగుపరుస్తుంది
సాయంత్రం నడక రక్తంలో గ్లూకోజు స్థాయిలను మెరుగుపరుస్తుంది (Freepik)

సాయంత్రం నడక:

ఎవరికి మంచిది: ఉదయం తీరిక లేని వారికి లేదా రోజంతా అలసిపోయిన తర్వాత విశ్రాంతి తీసుకోవాలనుకునే వారికి సాయంత్రం నడక మంచిది.

లాభాలు:

  • రాత్రి భోజనం తర్వాత నడవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. కడుపు ఉబ్బరం తగ్గుతుంది.
  • పగటిపూట తీసుకున్న కేలరీలను కరిగించి, బరువును అదుపులో ఉంచడానికి, జీవక్రియ ఆరోగ్యానికి ఇది తోడ్పడుతుంది.
  • సాయంత్రం నడక ఒత్తిడిని తగ్గించి, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. నిద్ర నాణ్యతను పెంచుతుంది.

ఎక్కువ కేలరీలు కరిగించడానికి ఎప్పుడు నడవాలి?

రెండు సమర్థవంతమైనవి: కేలరీలు కరిగించే విషయంలో ఉదయం, సాయంత్రం నడకలు రెండూ ఒకే విధంగా ప్రభావవంతంగా ఉంటాయి. దీనికి నడిచే వేగం, సమయం ముఖ్యం. మీ రోజువారీ దినచర్యకు ఏది సరిపోతుందో దాన్ని ఎంచుకోవచ్చు.

ఉదయం నడకకు స్వల్ప అదనపు ప్రయోజనం: ఉదయం నడక కొవ్వును కరిగించడంలో కొద్దిగా మెరుగైన ఫలితాలు ఇస్తుంది. దీనికి కారణం శక్తి స్థాయిలు ఎక్కువగా ఉండటం, కడుపు ఖాళీగా ఉండటం.

సాయంత్రం నడకకు అదనపు ప్రయోజనం: సాయంత్రం వాకింగ్ కూడా అంతే ప్రభావవంతంగా ఉంటుంది. జీర్ణశక్తిని మెరుగుపరచడం, ఒత్తిడిని తగ్గించడం వంటి అదనపు ప్రయోజనాలను అందిస్తుంది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం నడిచే సమయాన్ని బట్టి శరీర విధులు వేర్వేరుగా లాభపడతాయి. ఉదాహరణకు, రాత్రి భోజనం తర్వాత నడక రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది.

ఉదయం నడక ఖాళీ కడుపుతో కొవ్వును కరిగించడంలో కొద్దిగా మెరుగైన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి, బరువు తగ్గడం మీ లక్ష్యం అయితే, ఉదయం నడకకు వెళ్లవచ్చు. జీవక్రియను మెరుగుపరచడం, రక్తంలో చక్కెరను నియంత్రించడం మీ లక్ష్యం అయితే, సాయంత్రం నడక మంచి ఎంపిక.

(గమనిక: ఈ వ్యాసం కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా ఆరోగ్య సమస్యల గురించి ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి.)

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.