Monsoon Fruit Juices: వర్షాకాలంలో ఆరోగ్యం కోసం.. తప్పకుండా తాగాల్సిన 4 జ్యూసులివే..
Monsoon Fruit Juices: వర్షాకాలంలో ఆరోగ్యం కోసం తప్పకుండా తీసుకోవాల్సిన ఆరోగ్యకరమైన జ్యూసులేంటో తెలుసుకోండి.
వర్షాకాలం అంటేనే పరిసరాలు ఎప్పుడూ తేమగా ఉంటాయి. దోమల బెడద పెరగడంతో పాటు బ్యాక్టీరియాలు, వైరస్‌లు విజృంభిస్తాయి. ఫలితంగా వానాకాలంలో చిన్నా పెద్దా తేడా లేకుండా అంతా ఎక్కువగా వ్యాధుల బారిన పడుతుంటారు. అందుకనే ఈ సీజన్‌లో మనం ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా సమతుల ఆహారం తీసుకోవాలి. దానిలో భాగంగా ఈ కాలంలో కచ్చితంగా తీసుకోవాల్సిన నాలుగు పళ్ల రసాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పళ్ల రసాలు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది కానీ దానిలో చక్కెరను చేర్చకూడదని గుర్తుంచుకోవాలి.
దానిమ్మ రసం :
ఈ కాలంలో ఎక్కువగా దొరికే పళ్లలో దానిమ్మ కూడా ఒకటి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలుంటాయి. ఇవి అన్నవాహిక, పేగుల్లోని వాపుల్ని అరికడతాయి. జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చేస్తాయి. బీపీ, ఆర్థరైటిస్ ఉన్న వారికీ ఇది మేలు చేస్తుంది. అందుకనే రోజూ ఓ రెండు దానిమ్మకాయల్ని జ్యూసర్‌లో వేసి, వడకట్టి రసం తీసి అలానే తాగేయొచ్చు. కావాలనుకుంటే పంచదారకు బదులుగా చాలా కొద్దిగా ఉప్పు కలుపుకుని తాగొచ్చు.
నేరేడు రసం :
నేరేడు పళ్లు వర్షాకాలంలో అతి కొద్ది రోజులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. కాబట్టి దొరికినన్ని రోజులు వీటిని తినడం వల్ల పోషకాలు శరీరానికి అందుతాయి. నేరేడులో ఐరన్ ఫోలేట్, పొటాషియం, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. కడుపులో గ్యాస్ట్రిక్ సమస్యలున్న వారికి ఇది మందులా పని చేస్తుంది. అలాగే వర్షాకాలంలో వచ్చే రోగాల బారిన పడకుండా రక్షణగా ఉంటుంది. వీటిని గింజలు తీసేసి మిక్సీలో వేసి పల్ప్‌తో సహా తాగేయవచ్చు. తీపి కావాలనుకుంటే కోద్దిగా తేనె కలుపుకోవచ్చు.
యాపిల్ జ్యూస్ :
యాపిల్ పండులో సహజంగా పీచుపదార్థం, పెక్టిన్‌లు లభిస్తాయి. ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల ఇది జీర్ణ వ్యవస్థలో ఉన్న ఇబ్బందుల్ని తొలగిస్తుంది. పొట్ట సంబంధిత సమస్యలు అన్నింటికీ యాపిల్ జ్యూస్ పరిష్కారం అని చెప్పవచ్చు. జ్యూస్ చేసుకునేప్పుడు దీనిపైన తొక్క, లోపలున్న గింజల్ని తీసేసి జ్యూసర్‌లో వేసుకోవాలి. అయితే దీన్ని చేసుకున్న వెంటనే తాగేయడం ఉత్తమం. అలా పెట్టి ఉంచడం, ఫ్రీజ్ చేయడం మంచిది కాదు.
బొప్పాయి జ్యూస్ :
బొప్పాయి ఎక్కడైనా చాలా తేలికగా అందుబాటులో ఉండే పండు. దీనిలో విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది. పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల ఆహారం బాగా జీర్ణం కావడానికి సహకరిస్తుంది. దీని తొక్క, గింజలు తీసేసి కాస్త తేనె, నిమ్మరసం, నీరు కలిపి జ్యూస్ చేసుకుని తాగడం ద్వారా వర్షాకాలంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.