మాన్‌సూన్ యాంగ్జైటీకి 5 కారణాలు.. దీన్ని తగ్గించుకోవడానికి 7 ఈజీ చిట్కాలు-monsoon anxiety 5 causes 7 tips to manage effectively ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  మాన్‌సూన్ యాంగ్జైటీకి 5 కారణాలు.. దీన్ని తగ్గించుకోవడానికి 7 ఈజీ చిట్కాలు

మాన్‌సూన్ యాంగ్జైటీకి 5 కారణాలు.. దీన్ని తగ్గించుకోవడానికి 7 ఈజీ చిట్కాలు

HT Telugu Desk HT Telugu

మీకు ఈ వర్షాకాలంలో ఏదో తెలియని దిగులు, టెన్షన్ పట్టుకుందా? అయితే మీరు ఒక్కరే కాదు. చాలామందికి ఈ సీజన్‌లో యాంగ్జైటీ (ఆందోళన) ఎక్కువ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య నుంచి బయటపడటానికి నిపుణులు చెప్పిన చిట్కాలు చూద్దాం పదండి.

వర్షాకాలంలో మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం (Shutterstock)

వర్షాకాలపు మేఘాలు కమ్మేసిన ఆకాశం మన మనసును కూడా భారంగా మార్చేస్తుంది. అంటే మనల్ని దిగులు పరుస్తుంది. మనం అప్పుడప్పుడు కొన్ని కఠినమైన నిజాల గురించి మాట్లాడటానికి ఇష్టపడం. వర్షాకాలాన్ని మనం కవితాత్మకంగా చూస్తాం. గాలి, మట్టి వాసన, వాన చినుకుల గురించి ఎన్నో పాటలు, కవితలు రాసుకుంటాం. కానీ ఇదంతా పైపైన కనిపించే అందమైన చిత్రం మాత్రమే. లోపల మాత్రం, వర్షాకాలం మనకు తెలియకుండానే సీజనల్ యాంగ్జైటీని తెస్తుంది.

ముంబై బాంద్రాలోని హోలీ ఫ్యామిలీ హాస్పిటల్‌లో కన్సల్టెంట్ క్లినికల్ సైకాలజిస్ట్, సైకోథెరపిస్ట్ నరేంద్ర కింగర్ హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌తో మాట్లాడుతూ.. ఈ సీజన్‌లో చాలా మంది ఆందోళనకు గురవుతున్నారని, కొందరికైతే యాంగ్జైటీ అటాక్స్‌ కూడా వస్తున్నాయని చెప్పారు.

"ఈ సీజన్‌లో చాలా మందిలో ఏదో తెలియని అశాంతి, మూడ్ అటుఇటు మారడం, ఒక్కోసారి యాంగ్జైటీ అటాక్స్‌ కూడా పెరుగుతున్నాయి. వర్షాకాలంలో మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించే వాళ్ళ సంఖ్య బాగా పెరుగుతుంది. ఈ ధోరణి వెనుక బలమైన శారీరక, మానసిక కారణాలు ఉన్నాయి" అని ఆయన అన్నారు.

వర్షం పడుతున్న రోజున కిటికీ పక్కన కూర్చుని వేడి వేడి టీ, బజ్జీలు తినడం చాలా బాగుంటుంది కదా. అయినా సరే, సీజన్ తెచ్చిన మార్పుల వల్ల కలిగిన లోటును అది పూర్తిగా పూరించకపోవచ్చు. ఈ ఎమోషనల్ మార్పు వెనుక గల కారణాలను అర్థం చేసుకోవడం, దాని ప్రభావాన్ని తగ్గించడానికి ప్రయత్నించడం వర్షాకాలం వల్ల వచ్చే యాంగ్జైటీని స్పష్టంగా ఎదుర్కోవడానికి సరైన పరిష్కారం. నరేంద్ర కింగర్ వర్షాకాలంలో యాంగ్జైటీ ఎందుకు పెరుగుతుంది, దాన్ని తగ్గించుకోవడానికి ఏం చేయొచ్చో వివరించారు.

వర్షాకాలంలో మనం ఎందుకు టెన్షన్ పడతాం?

1. సూర్యరశ్మి తక్కువవడం, నిద్ర చక్రం దెబ్బతినడం:

సహజమైన సూర్యరశ్మి తక్కువగా తగలడం వల్ల సెరోటోనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఇది మన మూడ్‌ని కంట్రోల్ చేసే ఒక ముఖ్యమైన హార్మోన్.

పగటి వెలుతురు తగ్గడం వల్ల మన నిద్ర చక్రం (సర్కాడియన్ రిథమ్స్) దెబ్బతింటుంది. ఇది నిద్రలేమికి దారితీసి, యాంగ్జైటీని పెంచుతుంది.

2. వాతావరణ పీడనం, శబ్దాల ఒత్తిడి:

వాతావరణ పీడనం మారడం వల్ల మన చెవి లోపలి బ్యాలెన్స్ దెబ్బతిని, ఏదో తెలియని శారీరక అశాంతి కలగవచ్చు.

ఎడతెగని వర్షపు శబ్దాలు, చీకటి ఆకాశం, తేమతో కూడిన వాతావరణం సెన్సరీ స్ట్రెస్ (ఇంద్రియాలకు ఒత్తిడి)ని సృష్టిస్తాయి. ఇది ఇప్పటికే యాంగ్జైటీ ఉన్నవాళ్ళలో లక్షణాలను మరింత పెంచుతుంది.

3. సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ (SAD) - యాంగ్జైటీతో కలిపి:

ఎస్ఏడీ అనేది సాధారణంగా శీతాకాలంలో వస్తుంది అనుకుంటాం, కానీ వర్షాకాలంలో కూడా కనిపిస్తుంది.

ఉష్ణమండల ప్రాంతాల్లో వచ్చే వర్షాకాలపు SADలో అశాంతి, చిరాకు, కోపం వంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇది సాధారణ డిప్రెషన్ లక్షణాల కంటే కాస్త భిన్నం. ఈ సంకేతాలను చాలాసార్లు తప్పుగా అర్థం చేసుకుంటారు లేదా మూడ్ స్వింగ్స్ అని కొట్టిపారేస్తారు.

4 ఒంటరితనం, జీవనశైలిలో మార్పులు:

తరచుగా వర్షాలు పడటం వల్ల బయట వాళ్ళతో కలవడం, శారీరక పనులు తగ్గవచ్చు. ముఖ్యంగా వృద్ధులు లేదా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ఇది ఎక్కువ.

శారీరక కదలిక, సామాజిక జీవితం లేకపోవడం వల్ల ఒంటరితనం, అతిగా ఆలోచించడం వంటి భావాలు పెరుగుతాయి. ఇది యాంగ్జైటీ రుగ్మతలకు దారి తీస్తుంది.

5. బూజు, తేమ, శ్వాస సమస్యలు:

ఇంటి లోపల గాలి సరిగా ఆడకపోవడం, తేమ ఎక్కువగా ఉండటం వల్ల బూజు (mould) పెరుగుతుంది. ఈ బూజు యాంగ్జైటీతో సహా కొన్ని నరాల సంబంధిత లక్షణాలకు కారణమవుతుందని ఇటీవలి అధ్యయనాలు చెబుతున్నాయి.

అలెర్జీలు లేదా ఆస్తమా ఉన్నవాళ్ళకు ఇది మరింత ప్రమాదకరం, ఎందుకంటే శ్వాస ఆడకపోవడం వల్ల పానిక్ అటాక్స్‌ రావొచ్చు లేదా వాటిని ప్రేరేపించవచ్చు.

స్వీయ సంరక్షణ పద్ధతులు అనుసరించడం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు
స్వీయ సంరక్షణ పద్ధతులు అనుసరించడం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు (Shutterstock)

వర్షాకాలంలో యాంగ్జైటీని ఎలా తగ్గించుకోవచ్చు?

1. లైట్ థెరపీకి ప్రాధాన్యత ఇవ్వండి:

సూర్యరశ్మిని అనుకరించడానికి, నిద్ర చక్రం స్థిరీకరించడానికి ఉదయాన్నే డేలైట్-స్పెక్ట్రమ్ ల్యాంపులను వాడండి.

కనీసం 20 నిమిషాల పాటు ఇలా చేయడం వల్ల కూడా శక్తి తిరిగి వచ్చి, మూడ్ డిస్టర్బెన్స్‌లు తగ్గుతాయి.

2. నిద్రను క్రమబద్ధీకరించండి:

నిద్రవేళలు ఇష్టం వచ్చినట్లు మార్చవద్దు. ఒక నిర్దిష్ట సమయానికి నిద్రపోవడం అలవాటు చేసుకోండి. పడుకోవడానికి 1-2 గంటల ముందు స్క్రీన్ (ఫోన్, టీవీ) వాడకాన్ని తగ్గించండి. నిద్రలేమి సమస్య ఎక్కువగా ఉంటే, వైద్యుడిని సంప్రదించి మెలటోనిన్ సప్లిమెంట్లను వాడటం గురించి ఆలోచించండి.

3. ఇంట్లోనే వ్యాయామం చేయండి:

వర్షం పడుతోందని వ్యాయామాలు మానేయవద్దు. కనీసం 15 నిమిషాలు యోగా, రెసిస్టెన్స్ బ్యాండ్ వర్కౌట్స్ లేదా డ్యాన్స్ థెరపీ చేయడం వల్ల ఎండార్ఫిన్‌లు విడుదల అయ్యి, స్ట్రెస్ హార్మోన్ కార్టిసాల్ స్థాయిలు తగ్గుతాయి.

4. కెఫిన్ తగ్గించండి, ఆహారంపై శ్రద్ధ పెట్టండి:

వర్షం పడుతున్నప్పుడు, వెచ్చగా ఉండాలని ఎక్కువగా టీ, కాఫీ తాగుతాం. కానీ కెఫిన్ వల్ల గుండె దడ, అశాంతి పెరగవచ్చు.

దానికి బదులుగా చమోమిల్ లేదా లెమన్ బామ్ వంటి హెర్బల్ టీలు తాగండి. శక్తి స్థాయిలను ఒక్కసారిగా పెంచి, వెంటనే తగ్గించే ప్రాసెస్డ్ షుగర్స్ ఎక్కువగా ఉన్న ఆహారాలను తినకుండా ఉండండి.

5. సెన్సరీ గ్రౌండింగ్ టెక్నిక్‌లు ప్రయత్నించండి:

యాంగ్జైటీ ఉన్నప్పుడు, 5-4-3-2-1 టెక్నిక్ వంటి గ్రౌండింగ్ వ్యాయామాలు మనస్సును తిరిగి కేంద్రీకరించడానికి సహాయపడతాయి.

లావెండర్ లేదా పెప్పర్‌మింట్ వంటి ఎసెన్షియల్ ఆయిల్స్‌ను దగ్గర పెట్టుకోండి. వాటి సువాసన మనసును ప్రశాంతపరుస్తుంది.

6. ఇంటి లోపలి వాతావరణాన్ని పర్యవేక్షించండి:

బూజు పట్టకుండా డీహ్యుమిడిఫైయర్‌లు లేదా యాంటీ-ఫంగల్ ఏజెంట్లను వాడండి. మీ ఇంట్లో గాలి బాగా ఆడేలా చూసుకోండి. ఎయిర్ ఫిల్టర్‌లను తరచుగా శుభ్రం చేయండి. పరిశుభ్రమైన గాలి మెరుగైన మానసిక స్పష్టతకు నేరుగా సహాయపడుతుంది.

తగినంత నిద్ర మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
తగినంత నిద్ర మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది (Pexels.)

7. నిపుణుడిని కలవండి:

లక్షణాలు మరీ తీవ్రమయ్యే వరకు వేచి ఉండకండి. సైకోథెరపీ, ముఖ్యంగా కాగ్నిటివ్-బిహేవియరల్ థెరపీ (CBT), సీజనల్, వాతావరణ సంబంధిత ఆందోళనను తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంది.

(పాఠకులకు గమనిక: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసమే. ఇది నిపుణులైన వైద్య సలహాకు బదులు కాదు. ఏదైనా ఆరోగ్య సమస్య గురించి మీకు ఏవైనా సందేహాలు ఉంటే ఎల్లప్పుడూ మీ డాక్టర్‌ను సంప్రదించండి.)

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.