Money and Happiness: డబ్బుతో సంతోషాన్ని కొనగలమా? అధ్యయనం ఏం చెబుతుందో చదవండి-money and happiness can money buy happiness read what the study says ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Money And Happiness: డబ్బుతో సంతోషాన్ని కొనగలమా? అధ్యయనం ఏం చెబుతుందో చదవండి

Money and Happiness: డబ్బుతో సంతోషాన్ని కొనగలమా? అధ్యయనం ఏం చెబుతుందో చదవండి

Haritha Chappa HT Telugu

Money and Happiness: డబ్బుతో సంతోషాన్ని కొనగలమా అనేది పాత ప్రశ్నే, కానీ ఇప్పుడు దీనిపై కొత్తగా అధ్యయనాలు జరిగాయి.

డబ్బుతోనే ఆనందమా? (pixabay)

Money and Happiness: ప్రజల జీవితంలో డబ్బుకు చాలా ప్రాధాన్యత ఉంది. డబ్బు ఉంటేనే పొట్టనిండా భోజనం తినగలం. నిండైన బట్టలు కట్టుకోగలం. అందుకే చాలామంది డబ్బుతోనే ఆనందాన్ని కొనగలమని అంటారు. డబ్బుకు ఆనందానికి మధ్య ఒక సంకిష్టమైన సంబంధం ఉంది. ఇవి జీవితాలను నిజంగా సంతృప్తికరంగా మారుస్తాయా? లేదా? అని అర్థం చేసుకోవడం కోసం పరిశోధకులు అధ్యయనం చేశారు. ఆ అధ్యయనాలు ఏం చెబుతున్నాయో ఒకసారి తెలుసుకుందాం

ఒక మనిషి ఆదాయం పెరిగితే ఆనందం కూడా పెరుగుతుందని ఇటీవల చేసిన అధ్యయనం తేల్చింది. దాదాపు 33 వేల మందిపై ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. పెరుగుతున్న ఆదాయంతో పాటు వారిలో ఆనందం కూడా పెరుగుతోందని వారు గుర్తించారు. అధిక సంపాదన ఉన్నవారితో పోలిస్తే తక్కువ సంపాదన ఉన్నవారు తక్కువ సంతోషంగా ఉన్నారని ఈ అధ్యయనం కనిపెట్టింది. కాబట్టి ఆదాయం పైనే ఆనందం ఆధారపడి ఉన్నట్టు అధ్యయనం తేల్చింది.

ఆదాయం అధికంగా ఉన్న వ్యక్తుల్లో మానసిక సంతృప్తి అధికంగా ఉన్నట్టు గుర్తించింది అధ్యయనం. వార్షిక వేతనం అధికంగా ఉన్నవారు తాము ఆనందంగా ఉండటమే కాదు, తమ కుటుంబాన్ని ఆనందంగా ఉండేలా చూసుకుంటున్నారు. అధిక జీతాలు...కుటుంబాల్లో సంతోషాన్ని నింపుతున్నాయి. అలాగని కేవలం డబ్బుతోనే ఆనందమని ఈ అధ్యయనం చెప్పడం లేదు. కానీ ఆనందం కావాలంటే డబ్బు కూడా ఉండాలని వివరిస్తోంది.

హార్వర్డ్ స్టడీ ఆఫ్ అడల్ట్ డెవలప్మెంట్ సంస్థ ముందుగానే డబ్బు, ఆనందం మధ్య ఉన్న సంబంధాన్ని చెప్పింది. కేవలం డబ్బుతో మాత్రమే ఆనందాన్ని కొనలేమని, అయితే ఆనందంగా ఉండాలంటే డబ్బు పాత్ర ఎక్కువని చెప్పింది. ముఖ్యంగా మనుషుల మధ్య అనుబంధాలు కూడా ఆనందాన్ని పెంచడంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నట్టు వివరించింది. వ్యక్తులు వారి సామాజిక సంబంధాలు ఆనందాన్ని పెంపొందించడానికి ఉపయోగపడుతున్నట్టు వివరించింది. కొందరికి ప్రయాణాలు చేయడం, సంగీతాన్ని వినడం, నలుగురితో కలిసి గడపడం వంటివి ఎక్కువ ఆనందాన్ని ఇస్తాయి. అయితే ఇవన్నీ కూడా చేయాలంటే చేతిలో ఎంతో కొంత డబ్బులు ఉండాల్సిందే. కాబట్టి ఆనందానికి, డబ్బుకు మధ్య విడదీయరాని సంబంధం ఉంది.

మరొక అధ్యయనం డబ్బును తమ కోసం ఖర్చు చేసే కంటే ఎదుటివారికి ఖర్చు చేయడంలోనే ఎక్కువ మంది వ్యక్తులు ఆనందాన్ని పొందుతున్నట్టు గుర్తించారు. 2008లో కెనడాలోని ఒక వీధిలో ఒక పరిశోధన నిర్వహించారు. అక్కడున్న ప్రజలకు కవర్లో డబ్బులు పెట్టి ఇచ్చారు. అందులో కొంతమందిని తమ కోసమే ఆ డబ్బులు ఖర్చు పెట్టుకోమన్నారు. మరి కొంతమందిని ఆ డబ్బును వేరే వారి కోసం ఖర్చు పెట్టమని చెప్పారు. ఎవరైతే ఇతరుల కోసం ఆ డబ్బును ఖర్చు పెట్టారో వారు అధిక సంతోషంగా ఉన్నట్టు గుర్తించారు.

ఎక్కువ డబ్బును సంపాదించడం మాత్రమే ఆనందానికి దారి అని మాత్రం ఏ అధ్యయనమూ చెప్పడం లేదు. కాకపోతే డబ్బు ఉండడంవల్ల తాము అనుకున్న పనులు చేయగలుగుతారు, కాబట్టి ఆ మానసిక సంతృప్తి మనిషికి లభిస్తుంది. డబ్బుతో పాటు ప్రేమ, అనుబంధాలు, ఇష్టమైన పనులు చేయడం, మానసిక ప్రశాంతత ఇవన్నీ ఉంటేనే ఒక మనిషి ఆనందంగా ఉండగలడు.