Monday motivation: కోపిష్టిగా ఉంటే ఏమీ సాధించలేవు.. మారితే ఉంది మాధుర్యం..-monday motivational story about anger and good behaviour ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Monday Motivation: కోపిష్టిగా ఉంటే ఏమీ సాధించలేవు.. మారితే ఉంది మాధుర్యం..

Monday motivation: కోపిష్టిగా ఉంటే ఏమీ సాధించలేవు.. మారితే ఉంది మాధుర్యం..

Koutik Pranaya Sree HT Telugu
Jul 01, 2024 05:00 AM IST

Monday motivation: కోపంగా ఉండటం, కటువుగా మాట్లాడటం కొంతమంది మనుషులకు స్వతహాగా ఉండే లక్షణాలు. ఆ గుణం వల్ల వాళ్లు ఆనందమయమైన జీవితానికి దూరమవుతారు.

కోపిష్టిగా ఉంటే ఏమీ సాధించలేము
కోపిష్టిగా ఉంటే ఏమీ సాధించలేము (freepik)

ఎదుటి వ్యక్తి కనిపించగానే చిరునవ్వుతో పలకరించేవారు కొందరైతే, నవ్వితే ముత్యాలు రాలతాయేమో అని ముఖం కోపంగా పెట్టేవాళ్లు ఇంకొందరు. రెండో రకం వాళ్ల మాటలు కూడా కాస్త కటువుగానే ఉంటాయి కూడా. ఒక మాటను సౌమ్యంగా చెప్పడం తెలీదు. ఎదుటివ్యక్తి నొచ్చుకుంటారని కూడా చూడకుండా మాట్లాడేస్తారు. అలాగనీ వాళ్లు చెడ్డవాళ్లు కాదు. స్వభావమే అలాంటిది. చాలా మంది వాళ్లకున్న ఈ గుణాన్ని మార్చుకోవాలనుకున్నా, అది సాధ్యం కాక మేమింతే అని అలాగే ఉండిపోతారు. వాళ్ల మనసులో ఉన్న ప్రేమను బయటపెట్టరు. తిన్నారా, ఆరోగ్యం బాగుందా.. లాంటి ప్రశ్నల్లో కూడా ప్రేమ కన్నా ఎక్కువ కఠినత్వమే కనిపిస్తుంది. మొక్కుబడిగా అడుగుతున్నారనిపిస్తుంది. ఇలాంటి స్వభావం ఉండే వారి వల్ల ఎదుటివాళ్లకే కాదు.. వాళ్లకు కూడా మనసులో బాధ ఉంటుంది. మాతో ఎవ్వరు సరిగ్గా మాట్లాడరనే భావన ఉంటుంది.

రంగాపురం గ్రామంలో ఒక స్వామీజీ ఉండేవారు. ఓ రోజు ఆయన దగ్గరకి రమణ అనే యువకుడు వచ్చాడు. రాగానే ఆయన కాళ్లపైనపడి 'అయ్యా! నాకు కోపం చాలా ఎక్కువ. మాటలు కటువుగా ఉంటున్నాయి. దాంతో అందరితోనూ పోట్లాడుతున్నాను. ఇంట్లోనే కాదు, బయటివాళ్లు కూడా నన్ను ద్వేషిస్తున్నారు. నాతో ఎవ్వరూ ప్రేమగా ఉండట్లేదు. నేనేం చేయాలి?' అని అడిగాడు. అప్పుడు స్వామీజీ 'నీ కోపం తగ్గాలంటే నువ్వు మెడలో అసలైన పులిగోరు వేసుకోవాలి. మన పక్కనే ఉన్న అడవిలో ఓ ముసలి పులి ఉంది. దాని దగ్గరకు వెళ్ళి నేను పంపానని చెబితే అది నిన్నేమీ చేయదు. వెళ్లి తెచ్చుకో!' అన్నాడు.

ఆ తర్వాతి ఉదయమే రమణ అడవికెళ్లాడు. బక్కచిక్కిన ముసలి పులిదగ్గరికెళ్లి స్వామీజీ పేరు చెప్పాడు. దాంతో అదేమీ చేయలేదు. కానీ ‘నాకు' వయసైపోయింది కాబట్టి వేటాడలేకపోతున్నాను. కాబట్టి నాకు ప్రతి రోజూ ఆహారం తెచ్చిపెడితే... గోరు ఇస్తాను!' అని చెప్పింది. అప్పటి నుంచీ కేశవ ప్రతిరోజూ దానికి మాంసం, చేపలు తీసుకుపోవడం మొదలుపెట్టాడు. రోజంతా దానితోనే ఉండేవాడు. కళ్లు కూడా లేని, పైకి కూడా లేవలేని దాన్ని చూసి జాలిపడటం మొదలుపెట్టాడు. దాన్ని ప్రేమగా దగ్గరకి తీసుకునేవాడు. ఓ రోజు పులి రమణతో 'నేను చనిపోయే సమయం వచ్చింది. చనిపోయాక నా గోళ్లు తీసుకెళ్లు!' అని చెబుతూ కన్నుమూసింది. రమణ దాని మరణాన్ని చూసి తట్టుకోలేక పోయాడు. స్వామీజీ దగ్గరకొచ్చి ఏడుస్తూ జరిగిందంతా చెప్పాడు. ‘ఒక జంతువు చనిపోయిందనే ఇంతలా ఏడుస్తున్నావు కదా! అదే సానుభూతినీ ప్రేమనీ నీ చుట్టూ ఉన్న మనుషుల మీద చూపించు రమణా...! మనసులోపల ప్రేమా, జాలీ ఉంటే సరిపోదు. దాన్ని చూపాలి. అలా చూపడం మొదలుపెడితే నీ కోపమూ తగుతుంది. నిన్ను అందరూ ప్రేమిస్తారు!' అని చెప్పాడు. అప్పటి నుంచీ కేశవ ఎదుటివాళ్ల ఇబ్బందుల్నీ పట్టించుకుంటూ సౌమ్యంగా మాట్లాడటం నేర్చుకున్నాడు... అందరి బంధువు అనిపించుకున్నాడు!

మీ చుట్టూ కూడా ఇలాంటి వాళ్లుంటే వాళ్లలోని ప్రేమను బయటపెట్టేలా వాళ్లతో మాట్లాడండి. వాళ్లని అర్థం చేసుకోండి. వాళ్లు చెడ్డవాళ్లనీ, కోపిష్టి అని అనుకోకండి. మాట్లాడటం రాని వాళ్లు మాత్రమేనని అర్థం చేసుకోండి. మీకూ ఇలాంటి స్వభావమే ఉంటే కాస్త సౌమ్యంగా ఉండే ప్రయత్నం చేయండి. ప్రపంచం చాలా అందంగా కనిపిస్తుంది.

 

WhatsApp channel