Monday motivation: సంకల్ప బలాన్ని మించిన అదృష్టం ఉంటుందా?
Monday motivation: సంకల్పబలం ఉంటే ఎలాంటి పనైనా పూర్తి చేసేయొచ్చు. ఎలాంటి విజయాలైనా సాధించొచ్చు. అలాంటి స్ఫూర్తివంతమైన కథేంటో చదివేయండి.
ఇంద్రియాలు, మనసు.. మాటలతో లొంగుతాయా? లేదు! ఒక కొత్త పని చేయాలనుకుంటే ఎన్నో ఆటంకాలు. అవన్నీ మనకు మనంగా తలపెట్టుకునేవే. పనుల్లో విజయం సాధించాలంటే.. కోరికొక్కటే ఉంటే సరిపోదు. సంకల్పబలం ఉండాలి. దృఢమైన ఆత్మబలం ఉంటే అదృష్టంతో పనిలేదు. ఏ పని చేసినా కలిసి రావట్లేదనే ప్రసక్తి ఉండదు. ప్రయత్న లోపం ఉంటేనే ఫలితంలో లోపం ఉంటుంది. ప్రయత్నం చేసినా విజయం సాధించట్లేదంటే నువు చేసే ప్రయత్నం తీరు మారాలి, లోపం ఏంటో కనిపెట్టాలి.
సంకల్ప బలానికి దైవం కూడా తలంచుతుందంటారు. ఏపని చేసినా కలిసి రావట్లేదంటే అదృష్టం లేదని కాదు. దురదృష్టం పేరుతో మనల్ని మనం తప్పించుకునే మార్గం అది. మనస్పూర్తిగా తలపెట్టిన పని పూర్తి కావడానికి ప్రకృతి కూడా సాయం చేస్తుంది. ఇది చాలా సందర్భాల్లో మనకే అనుభవంలోకి వస్తుంది కూడా. మనసు పెట్టి చేశాను.. అందుకే సాధించాను అనిపిస్తుంటుంది. ఆ మనసు ప్రతి పనిలో పెట్టాలి. సంకల్పబలంతో ఎంతటి పనినైనా సాధించొచ్చని చెప్పే ఒక కథ ఇది..
ఒక ఆడపక్షి సముద్రం ఒడ్డున గుడ్లు పెడుతుంది. కాసేపయ్యాక అలా ఆహారం కోసం వెళ్లొచ్చే సరికి గుడ్లు కనిపించవు. సముద్ర కెరటాల వల్ల సముద్రంలోకి గుడ్లు కొట్టుకుపోయి ఉంటాయని అర్థమవుతుంది. ఎంతో దు:ఖంతో వేదనతో విలపిస్తుంది. ఎలాగైనా ఆ గుడ్లను వెతికి పట్టుకోవాలనుకుంటుంది. తన ముక్కుతో సముద్రంలో ఉన్న ఒక్కో చుక్కను తీసి ఒడ్డున పోయటం మొదలు పెడుతుంది.
చుట్టూ ఉన్న పక్షులు దాన్ని చూసి హేళన చేస్తాయి. కొన్ని పక్షులు దాని కష్టం చూసి సాయం చేస్తాయి. అలా పక్షులన్నీ గుంపులుగా వచ్చి ఆ పక్షికి సాయం చేయడం మొదలెడతాయి. ప్రతి పక్షి చుక్కా చుక్కా నీరు తీసుకొచ్చి ఒడ్డుమీద పోస్తుంది. నిర్విరామంగా కష్టపడుతున్న పక్షుల కష్టానికి సముద్రుడి గుండె చలిస్తుంది.
వెంటనే ప్రత్యక్షమై తనే పక్షి గుడ్లను పక్షికి ఇచ్చేస్తాడు. ఆ పక్షి పేరు టిట్టిభ పక్షి. పెద్దలు కథల్లో.. ఏదైనా పని చేసేటపుడు టిట్టిభ పక్షికున్నంత సంకల్పబలం ఉండాలని ఈ పక్షితో పోల్చి చెబుతారు.
మనం చేసే పని చూడటానికి అసాధ్యంగా అనిపించొచ్చు. కానీ మనసును అధీనంలో ఉంచుకుని, చిత్తశుద్ధితో పని మొదలు పెడితే విజయం తప్పక వరిస్తుంది. గొప్ప సంకల్ప బలం ఉన్నపుడు అదృష్టంతో పనిలేదు. నుదుటి రాతను కూడా మార్చే శక్తి సంకల్పబలానికి ఉంటుందని గుర్తుంచుకోండి.