Monday Motivation : ఈ క్షణం మాత్రమే నీది.. పోయిన కాలం తిరిగి రాదు-monday motivation the present moment is only yours enjoy that ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Monday Motivation The Present Moment Is Only Yours Enjoy That

Monday Motivation : ఈ క్షణం మాత్రమే నీది.. పోయిన కాలం తిరిగి రాదు

Anand Sai HT Telugu
Mar 25, 2024 05:00 AM IST

Monday Motivation : వందలో 99 మంది గతం గురించి తప్పకుండా బాధపడుతారు. కానీ గడిచిన కాలం తిరిగిరాదు. ఈ క్షణం మాత్రమే నీది.

సమయం విలువైనది
సమయం విలువైనది (Unsplash)

జీవితంలో అందరూ ఎక్కువగా బాధపడేది గడిచిపోయిన క్షణాల గురించి మాత్రమే. అప్పుడు అలా చేసి ఉంటే బాగుండు.. ఆ సమయంలో వారితో బంధం కట్ చేసి ఉంటే జీవితం అద్భుతంగా ఉండేది.. ఇలా రకరకాల ఆలోచనలతో మనిషి తన జీవితాన్ని వృథా చేసుకుంటాడు. కానీ గడిచిన కాలం ఒక్కప్పుడు ప్రస్తుత క్షణామే. ఆ సమయంలో మనం తీసుకునే నిర్ణయాలు జాగ్రత్తగా ఉండాలి.

జీవితంలో మంచి చెడు రెండు ఉంటాయి. అంతా మంచే ఉంటే జీవితం బాగుండదు. అలా అని అంతా చెడు ఉంటే అధ్వానంగా ఉంటుంది. ప్రస్తుతంంలో మన జీవించే విధానంపైనే మన భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. ఇప్పుడున్న ప్రస్తుతం తర్వాతి క్షణం గతమే అవుతుంది. అందుకే ప్రస్తుతంలో నువ్వు జీవించాలి. అప్పుడే ఆనందంగా ఉంటావ్. లేదంటే అన్ని సమస్యలే ఎదురవుతాయి. ఈ విషయం గురించి ఓ చిన్న కథ చెప్పుకుందాం. కథ చిన్నదే కానీ ఆలోచిస్తే ఇందులో చాలా విషయం ఉంటుంది.

ఒక గురువు ఒకసారి తన శిష్యులకు ఈరోజు వాస్తవం, రేపు భ్రమ. కాబట్టి రేపటి వరకు ఏ పనిని వాయిదా వేయకండి.. అని చెబుతాడు. అటుగా వచ్చిన ఒక యోధుడు గురువు మాటలు వింటాడు. కాలం గడిచిపోద్ది.. ఒక రోజు యోధుడిని అతని శత్రువులు బంధించి జైలులో పెట్టారు.

జైలులో పెట్టిన రాత్రి అతడికి నిద్ర పట్టలేదు. ఎందుకంటే మరుసటి రోజు తన శత్రువులు తనను ఎంత బాధపెట్టి, హింసించబోతున్నారో, విచారించబోతున్నారో అనే ఆలోచనతో అతను కలవరపడ్డాడు. అప్పుడు గతంలో గురవు చెప్పిన మాట గుర్తుకు తెచ్చుకుని, రేపు అనేది భ్రమ, ఈరోజు ఒక్కటే వాస్తవం అని మనసుకు సర్ది చెప్పుకొన్నాడు. వెంటనే నిద్రలోకి జారుకున్నాడు.

గురువు చెప్పిన విషయం చిన్నదే కావొచ్చు. కానీ అందులో చాలా అర్థం దాగి ఉంది. మనమంతా గతం, భవిష్యత్ గురించి బాధపడుతూనే కాలం వెళ్లదీస్తాం. ప్రస్తుతంలో బతికితేనే మీరు ఆనందంగా జీవిస్తారు. లేదంటే అనేక ఇబ్బందులు మిమ్మల్ని చుట్టు మూడతాయి. కాలంతో యుద్ధం చేయాల్సి వస్తుంది. గడిచి పోయిన కాలాన్ని తిరిగి తీసుకురాలేం.. భవిష్యత్తులో ఏం జరుగుతుందో నిర్ణయించలేం. అందుకే ప్రస్తుతంలో ఆనందంగా బతికేయాలి. తుమ్మితే పోయే ప్రాణాలు.. ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండాలి.

జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. కదిలే కాలం, పారే నది, నీ ఆయుష్షు.. ఇలా ఏదీ ఎళ్లకాలం ఉండదు. అందుకే ప్రస్తుతంలో మనం ఆనందంతో బతకాలి. మిమ్మల్ని బాధపెట్టినవారి గురించి ఆలోచిస్తూ.. బాధపడటం చేయెుద్దు.. రేపు ఏమవుతుందోనని బెంగ కూడా పెట్టుకోవద్దు. ఎందుకంటే జరిగేదాన్ని ఎవరూ ఆపలేరు. కేవలం ప్రస్తుతంలో మీ ఆలోచనలు మాత్రం దేన్నైనా నిర్ణయిస్తాయి.

నలుగురితో నవ్వుతూ ఈ క్షణం జీవించాలి. ఏదో జరిగిపోయిందని బాధపెట్టుకోకూడదు. భవిష్యత్తులో ఏదో జరుగుతుందని ఆలోచనలో మనశ్శాంతిని చంపుకోకూడదు. ఎందుకంటే మీ జీవితానికి మీరే రాజు.. మీరే మంత్రి. మిగతా వారిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీకోసం మీరు జీవించండి. మీ ఆనందాన్ని వెతుక్కోండి. అప్పుడే జీవితానికి అర్థం. మీకు సంతోషం..