Monday Motivation : బంధంలో సర్దుకుపోవడం మంచిదే.. కానీ ప్రతీసారి అంటే కుదరదు-monday motivation some times adjustments in relationships create suffocation ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Monday Motivation : బంధంలో సర్దుకుపోవడం మంచిదే.. కానీ ప్రతీసారి అంటే కుదరదు

Monday Motivation : బంధంలో సర్దుకుపోవడం మంచిదే.. కానీ ప్రతీసారి అంటే కుదరదు

Anand Sai HT Telugu Published Apr 22, 2024 05:00 AM IST
Anand Sai HT Telugu
Published Apr 22, 2024 05:00 AM IST

Monday Motivation In Telugu : బంధంలో సర్దుకుపోతేనే జీవితం ఆనందంగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు సర్దుకుపోవడం ఎక్కువైతే జీవితం భారంగా అనిపిస్తుంది.

సోమవారం మోటివేషన్
సోమవారం మోటివేషన్ (Unsplash)

అందమైన సంబంధానికి పునాది ప్రేమ, నిబద్ధత, గౌరవం, అనుకూలత. కానీ అనుకూలించాలంటే అది కూడా ఒక లిమిట్ లో ఉండాలి. ఎక్కువగా సర్దుకుపోతే బంధం ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఏ విధమైన సర్దుబాట్లు సంబంధంలో ఉత్కంఠభరితమైన అనుభవాన్ని తీసుకొస్తాయో కచ్చితంగా ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలి.

బంధంలో ఆనందంగా ఉండాలంటే ప్రతీసారి సర్దుకుపోకూడదు. మీ భాగస్వామికి మీరు మీ స్నేహితులతో సమయం గడపడం ఇష్టం లేకుంటే, స్నేహితులతో కాలక్షేపం చేయకూడదనుకుంటే ఎప్పుడూ నాతోనే ఉండాలని కోరుకుంటే, వారి ప్రవర్తన కచ్చితంగా చికాకు కలిగిస్తుంది. మీ స్నేహితులతో సమయం గడపడానికి భయపడే పరిస్థితిలో ఉండటం వల్ల మీ బంధం ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఎందుకంటే కొన్ని భాగస్వామితో పంచుకోని విషయాలను స్నేహితులతో పంచుకుంటాం. అన్ని సంబంధాల కంటే స్నేహం చాలా ప్రత్యేకమైనది. వారానికో నెలకో ఒకసారి స్నేహితులను కలిసినప్పుడు అడ్డుకోవడం సరికాదు. ఈ విషయాన్ని మీ భాగస్వామికి అర్థమయ్యేలా చెప్పాలి.

పని విషయంలో ఆడపిల్లలకు సాధారణంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. పెళ్లి తర్వాత ఉద్యోగం మానేసిన అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. కానీ పనిని త్యాగం చేసినప్పుడు మనసులో ఒక మూలలో ఆ బాధ ఉంటుంది. ఉద్యోగానికి వెళ్లాలనుకునే వారు పెళ్లికి ముందే ఈ విషయంలో గట్టి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఒంటరిగా ఇంటిపని చేయాలని అనిపించదు. అందుకే బయట పని చేసి.. ఇద్దరూ ఇంటిపని పంచుకోవాలి. బయట పనులకు వెళ్లే మహిళకు ఇంట్లో భర్త ఆసరా కాకాపోతే.. ఇంట్లో, పని ఒత్తిడితో కుంగిపోతారు. మీరు పని చేయలేకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయండి.

మగ లేదా ఆడ వారు భాగస్వామిని జాగ్రత్తగా చూసుకోవడం మర్చిపోకూడదు. మనకు నచ్చిన కొన్ని విషయాలు వారికి నచ్చవు.. వాటిని వదులుకోకూడదు. మీకు బాగా నచ్చే విషయాలను వదులుకుని సర్దుకుపోతే.. మీ బంధంలో ఉక్కిరిబిక్కిరి అవుతారు. ఇద్దరూ కలిసి ఆ విషయంపై మాట్లాడుకోండి. అప్పుడు మీరు సంతోషంగా ఉంటారు. ఉదాహరణకు మీరు ఏదైనా వండడానికి ఇష్టపడితే, మీ భాగస్వామి దానిని తినకపోవచ్చు. అందుకే ఒకసారి మాట్లాడితే ఇద్దరికీ సమస్య ఉండదు. కానీ ఈ రకమైన సర్దుబాటు మీ మనస్సు మూలలో ఎక్కడో అసౌకర్యంగా అనిపించవచ్చు. అందుకే దాని వెనక ఉన్న కారణాలను చెప్పాలి.

భాగస్వామితో ఏదైనా విషయాన్ని నేరుగా చెప్పాలి. అటు తిప్పి ఇటు తిప్పి చెప్పకూడదు. ఇలాంటి విషయాలు మీ బంధాన్ని పాడు చేస్తాయి. మనసులో ఏదో దాచుకున్నారని ఉక్కిరిబిక్కిరి అవుతారు. మీ భాగస్వామి తప్పులను సరిదిద్దకపోవడం, తప్పు అని తెలిసినా మీ భాగస్వామి తప్పు చేస్తున్నాడని చెప్పే ధైర్యం లేకపోవటం సరికాదు. భవిష్యత్తులో మీ సంబంధం పూర్తిగా చెడిపోకుండా జాగ్రత్తపడండి.

మీ భాగస్వామికి కొన్ని రకాల ఇష్టాలు ఉంటాయి. అయితే ఆ ఇష్టాలను మీ ఇష్టాలుగా చెప్పకూడదు. వారి ఇష్టాలు మీవి అని మీరు నటించకూడదు. నటన కొన్ని రోజులకు బయటపడుతుంది. మనం ముసుగు వేసుకోకూడదు. మనం ఎలా ఉంటామో అలాగే ఉండాలి. లేకుంటే ఏదో ఒక రోజు ఆ ముసుగు తొలగిపోతుంది, వారు మీతో చాలా విసుగు చెందుతారు. మీరు చెప్పినవన్నీ అబద్ధాలు అనుకుంటారు. అందుకే బంధంలో కొన్ని విషయాల్లో సర్దుకుపోవడం మంచిదే. కానీ కొన్ని విషయాలను నేరుగా ముఖం మీదే చెప్పేయాలి. అప్పుడే ఆనందంగా ఉంటారు.

Whats_app_banner