Monday Motivation: విత్తనం నేర్పే ముఖ్యమైన జీవిత పాఠాలు ఇవే.. ఎప్పుడైనా గమనించారా!
Monday Motivation: మొక్క కోసం నాటిన విత్తనం ఎన్నో జీవిత పాఠాలను నేర్పుతుంది. జీవితంలో ఎలా ముందుకు సాగాలో మౌనంగానే చెబుతుంది. ఎన్నో సూచనలు ఇస్తుంది.
జీవితంలో ఎప్పుడైనా కుంగుబాటులో ఉన్నప్పుడు స్ఫూర్తి దక్కితే బాగుంటుందని అనిపిస్తుంది. ఎవరైనా మార్గనిర్దేశం చేస్తే ఊరటగా ఉంటుందనే భావన ఉంటుంది. అయితే, ప్రకృతిలోని కొన్ని విషయాలే ఒక్కోసారి జీవిత పాఠాలు నేర్పిస్తుంటాయి. అందులో ముఖ్యమైనది మొక్క కోసం భూమిలో నాటే విత్తనం. ఆరంభం నుంచి ఎదుగుదల వరకు ఓ విత్తనం చాలా విషయాలను మౌనంగానే చెబుతుంది. దాన్ని అర్థం చేసుకుంటే జీవితంలో చాలా విషయాలపై క్లారిటీ వస్తుంది. విత్తనం చెప్పే జీవిత పాఠాలు ఏవో ఇక్కడ చూడండి.
ఓపిక అవసరం
విత్తనం నాటిన వెంటనే ఒక్కరోజునే మొక్క మొలవదు. కొన్ని రోజులు పడుతుంది. ఆ తర్వాత భూమిని చీల్చుకుంటే మొలక చిన్నగా వస్తుంది. దీంతో దేని నుంచైనా ఫలితం రావాలంటే ఓపిక అవసరం అని విత్తనం చెబుతుంది. కృషి చేసిన వెంటనే ఫలితం రాదని, ఓపిగ్గా పని చేసుకుంటూ పోతే విజయం తథ్యమని పాఠం చెబుతుంది.
మార్పు తథ్యం
నాటిన విత్తనం.. ఎప్పటికీ విత్తనంలా ఉండిపోదు. మంచి మట్టి, నీరు, సూర్యరశ్మి తగిలితే కొన్ని రోజుల్లోనే మొలకెత్తుతుంది. అలాగే.. జీవితంలో ఏదైనా చేయాలని అనుకుంటే దానికి సంబంధించిన జ్ఞానాన్ని సముపార్జించడం, కృషి చేయడం ముఖ్యం. దీంతో ఎప్పటికీ ఒకేలా ఉండిపోం. కచ్చితంగా మార్పు వస్తుంది. జీవితంలో పైకి ఎదుగుతామని విత్తనం చెబుతుంది.
కష్టసుఖాలు సహజం అంటూ..
విత్తనం మొలకెత్తి పెద్దది అయ్యాక క్రమంగా పెరుగుతుంది. ఈ క్రమంలో దానికి చాలా ఒడిదొడుకులు ఏర్పడతాయి. అనేక రకాల వాతావణాన్ని మొక్క ఎదుర్కొంటుంది. శరదృతువులో ఆకులు రాలిపోయి పీలగా కనిపిస్తుంది. అదే మొక్కకు వసంత రుతువు వచ్చేసరికి మళ్లీ ఆకులు చిగురిస్తాయి. మొక్క కళకళలాడుతుంది. జీవితంలో కష్టాలు ఎదురైనా.. దీటుగా నిలిస్తే మళ్లీ సుఖాలు వస్తాయని విత్తనం ద్వారా వచ్చిన మొక్క చెబుతుంది.
ఎదుగుదల దశల వారిగా..
కొందరు జీవితంలో అమాంతం ఎదగాలని అనుకుంటారు. తొందరగా ఉన్నత స్థానానికి వెళ్లాలని ఆరాటపడి.. సాధ్యం కాక నిరాశకు లోనవుతుంటారు. అయితే, దీనికి కూడా విత్తనం పాఠం చెబుతుంది. విత్తనం మొలకెత్తేందుకు.. మొక్కగా మారేందుకు.. అది చెట్టుగా ఎదిగేందుకు ఎక్కువ సమయమే పడుతుంది. దశల వారిగా ఎదిగితే బలంగా నిలబడవచ్చని చెబుతుంది. జీవితంలోనూ దశల వారిగా ఎదగాలని సూచిస్తుంది. ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకొని.. క్రమంగా ఎదగాలని చెబుతుంది.