Monday Motivation: ఇతరులను ఎప్పుడూ తిట్టుకోవద్దు.. జీవితంలో పాటించాల్సిన సూత్రాలు
Monday Motivation: జీవితంలో ఎదురైన కొన్ని పరిస్థితుల వల్ల కొందరు ఎదుటివారిని తిట్టుకుంటూ ఉంటారు. దీనివల్ల వారికే నష్టం వాటిల్లుతుంది. ఇలా కాకుండా కొన్ని సూత్రాలను పాటిస్తే భవిష్యత్తుకు మేలు జరుగుతుంది.
జీవన ప్రయాణంలో మనకు చాలా మంది పరిచయం అవుతుంటారు. ఇంటి పరిసరాల్లో, కార్యాలయాల్లో, పని ప్రదేశాల్లో, వ్యాపారాల్లో.. ఇలా అనేక చోట్ల వివిధ రకాలైన మనుషులతో కలవాల్సి ఉంటుంది. కొందరి వల్ల మనకు మంచి జరిగితే.. మరికొందరి వల్ల నష్టాలు, చెడు కూడా జరిగే సందర్భాలు కూడా ఉంటాయి. అయితే, ఇలాంటి ప్రతికూల పరిస్థితులు జరిగినా ఇతరులను తిట్టుకోవడం వల్ల ఫలితం ఉండదు. దీనివల్ల మానసిక ప్రశాంతత, స్పష్టతకు కూడా భంగం వాటిల్లుతుంది.
ఆత్మావలోకనం చేసుకోవాలి
అసలు ఎదుటి వ్యక్తి వల్ల తాను ఎందుకు నష్టపోయానో.. మోసపోయానో అనేది స్వయంగా ఆలోచించుకొని విశ్లేషించుకోవాలి. తమను తాను ప్రశ్నించుకుంటూ ఆత్మావలోకనం చేసుకోవాలి. అంతేకాని చెడు చేసిన వ్యక్తిని దూషించుకుంటూ, కక్ష పెంచుకొని కూర్చుంటే ఫలితం ఉండదు. దీనివల్ల ఎదురైన పరిణామానికి మూలకారణం గుర్తించలేరు. భవిష్యత్తుల్లో మళ్లీ అది జరగకుండా ఉండేందుకు పరిష్కారాన్ని వెతకలేరు.
బాధ్యత తీసుకోవాలి
జీవితంలో ఎలాంటి పరిణామాలు ఎదురైనా బాధ్యత తీసుకోవడం నేర్చుకోవాలి. ఎదురుదెబ్బలు తలిగితే వాటిని విశ్లేషించుకోకుండా ఎదుటి వారిపై నెట్టడం, వారిని తిట్టుకోవడం సరైన విధానం కాదు. దీనివల్ల పొరపాట్లను గుర్తించి సరిదిద్దుకోలేరు. నిజంగా ఇతరుల వల్లే తప్పు జరిగినా.. నష్టం వాటిల్లినా కూడా బాధ్యత తీసుకోవాలి. వేరే వ్యక్తికి తాము ఎందుకు ఆ అవకాశం ఇచ్చామని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఏం చేయాలనే ఆలోచనలు బాధ్యత తీసుకోవడం వల్లే వస్తాయి. ఎదుటి వారిని బాధ్యులను చేసి చేతులు దులిపేసుకునే ఆలోచనలు చేయడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదు.
జీవితంలో ఎదురైన ఎదురుదెబ్బలను ఎప్పుడైనా అనుభవాలుగానే తీసుకోవాలి. వాటి నుంచి విషయాలను నేర్చుకోవాలి. చెడు చేసిన వారిని కూడా ఎదురైన ఓ పాఠంగానే భావించాలి. దాని వల్ల నేర్చుకున్న విషయాలను భవిష్యత్తు కోసం పొందుపరుచుకోవాలి. మళ్లీ అలాంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండేందుకు ఇది తోడ్పడుతుంది.