Monday Motivation : నేర్చుకోవడం కష్టంగానే ఉండాలి.. అప్పుడే జీవితం సుఖంగా ఉంటుంది
Monday Motivation : జీవితంలో నేర్చుకోవడం కఠినంగా ఉండాలి. అప్పుడే జీవితం హాయిగా సాగిపోతుంది. నెర్చుకునే సమయాన్ని ఈజీగా తీసుకుంటే లైఫ్ పాడైపోతుంది.
విద్యార్థులు కావొచ్చు, ఉద్యోగులు కావొచ్చు.. నేర్చుకోవడం అంటేనే చిరాకు పడుతారు. ఈ కాలంలో ఓ ట్రెండ్ స్టార్ట్ అయింది. స్మార్ట్ వర్క్ అంటూ చెబుతుంటారు. అయితే స్మార్ట్ వర్క్ చేస్తే మీరు కూడా నాశనం అయిపోతారు. ఎందుకంటే పరిస్థితులను బట్టి స్మార్ట్ వర్క్ చేయాలి. ప్రతీ విషయంలోనూ స్మార్ట్ వర్క్ చేయకూడదు. నేర్చుకోవడం అనేది కష్టంగా ఉండాలి. విద్యార్థి దశలో నేర్చుకోవడం కష్టంగా ఉంటేనే జీవితం విలువ తెలుస్తుంది. ఉద్యోగులైనా.., ఎవరైనా నేర్చుకోవడం అనేది కఠినంగా ఉండాలి. అప్పుడే దాని విలువ తెలుస్తుంది.

మన తాతల కాలంలో ఏదైనా విషయం గురించి అడిగితే నోటి ద్వారానే చెప్పేవారు. కానీ ఈ కాలంలో పరిస్థితులు మారిపోయాయి. ఏది అడిగినా సెల్ ఫోన్లలో చూసి చెబుతున్నారు. తర్వాత ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకు వెళ్లినప్పుడు తెల్లముఖం వేస్తున్నారు. మెదడుకు పని చెప్పాలి. కష్టంగా ఉన్నా నేర్చుకోవాలి. అప్పుడే జీవితం బాగుంటుంది. ఓ దొంగ తన కొడుకుకు నేర్పిన పాఠం గురించి చదవండి.
ఒక వ్యక్తి కష్టమైన పనులను ఎలా సులభంగా చేయగలడు అనేది అతడి ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి.. తన తండ్రిని దొంగతనం చేసేందుకు రహస్యాలు నేర్పమని అడిగాడు. అతని తండ్రి అంగీకరించి దొంగతనానికి ఆ రాత్రి ఒక పెద్ద భవనానికి తీసుకెళ్లాడు. కుటుంబమంతా నిద్రిస్తుండగా దొంగ తన కొడుకును బట్టలు ఉన్న గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ బట్టలు దొంగిలించమని కొడుకుతో చెప్పాడు. కొడుకు తన తండ్రి చెప్పినట్లే దొంగతనం చేస్తున్నాడు. అప్పుడు తండ్రి మెల్లగా గది నుండి బయటకు వచ్చాడు.
అనంతరం ఇంట్లో ఉన్న వారిని నిద్ర లేపేందుకు ఇంటి బయటికి వచ్చి తలుపులు కొట్టి వేగంగా వెళ్లిపోయాడు. కొడుకు కూడా ఏదో ఒకలాగా తప్పించుకుని బయటపడ్డాడు. తర్వాత కొడుకు ఇంటికి వచ్చి తండ్రని ప్రశ్నించాడు. నాన్నా, ఎందుకు అలా తలుపు కొట్టావని అడిగాడు. నేను ఏమీ దొంగిలించలేదని, ఎలా తప్పించుకోవాలో తెలుసుకోవడానికి నా తెలివితేటలను ప్రయోగించటంలోనే గడిపానని చెప్పుకొచ్చాడు.
అతని తండ్రి నవ్వుతూ నువ్వు దొంగతనంలో మొదటి పాఠం నేర్చుకున్నావు అన్నాడు. కష్టంగా ఉన్నప్పుడు తప్పించుకునే మార్గాన్ని ఆలోంచించడమే అసలైన విధానం అని చెప్పుకొచ్చాడు.
మీరు ఎలాంటి పరిస్థితులో ఉన్నా.. కష్టంగా ఉన్నా ఏది నేర్చుకోవాలో దానిపై ఫోకస్ చేయాలి. పరిస్థితులు ఎలా ఉన్నా.. కచ్చితంగా మీ ఆలోచన విధానం బాగుండాలి. అప్పుడే నేర్చుకునేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. భయపడి ఒకే చోట ఆగిపోతే ఏదీ నేర్చుకోలేరు. జీవితానికి దొంగలా దొరికిపోతారు. అప్పుడు జీవితం మీతో ఆడుకుంటుంది. ఇతరులు మీకంటే ముందుగా వెళ్లిపోతారు.