Mixed vegetable Pakoda: వెజిటబుల్ పకోడీ క్రిస్పీగా క్రంచీగా రావాలంటే ఇలా చేయండి
Mixed vegetable Pakoda: పకోడీ పేరు చెబితేనే నోరూరిపోతుంది. సాయంత్రం అయితే చాలు బజ్జీలు పకోడీలు తినాలని నాలుక లాగేస్తుంది. ఇక్కడ మేము వెజిటేబుల్ పకోడీ రెసిపీ ఇచ్చాము. ఇది క్రిస్పీగా, క్రంచీగా ఎలా రావాలో తెలుసుకోండి.
తెలుగువారికి పకోడీలు, బజ్జీలు అంటే ఎంతో ఇష్టం. సాయంత్రం అయితే పకోడీ బండి దగ్గర జనం చేరిపోతారు. టీ తాగుతూ పకోడీ తినే వారి సంఖ్య కూడా ఎక్కువే. నిజానికి బయట తినే పకోడీ కన్నా ఇంట్లో చేసుకునే పకోడీ ఆరోగ్యానికి మంచిది. ఇది క్రిస్పీగా. క్రంచీగా ఎలా చేయాలో తెలుసుకోండి. సాధారణ పకోడీతో పోలిస్తే వెజిటబుల్ పకోడీ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.
వెజిటబుల్ పకోడీ రెసిపీకి కావలసిన పదార్థాలు
శనగ పిండి - అర కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
బియ్యప్పిండి - పావు కప్పు
పచ్చిమిర్చి - మూడు
ఎండుమిర్చి - ఒకటి
పుదీనా తరుగు - రెండు స్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను
నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
గరం మసాలా - అర స్పూను
క్యారెట్ - ఒకటి
క్యాప్సికం - ఒకటి
క్యాబేజీ తరుగు - పావు కప్పు
ఉల్లిపాయ - ఒకటి
పాలకూర తరుగు - నాలుగు స్పూన్లు
వెజిటబుల్ పకోడీ రెసిపీ
1. వెజిటబుల్ పకోడీలో అనేక రకాల కూరగాయలను వినియోగిస్తాము.
2. ఇందుకోసం క్యారెట్, ఉల్లిపాయ, క్యాప్సికం, బీన్స్, ఆకుకూర అన్నింటిని పొడవుగా వచ్చేలా కోసుకోవాలి.
3. ఇప్పుడు ఒక గిన్నెలో అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, పుదీనా నిలువుగా కోసిన పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
4. అందులోనే బియ్యప్పిండిని, జీలకర్రను కూడా వేసి కలపాలి.
5. ఆ తర్వాత శెనగపిండి, పచ్చిమిర్చి కూడా వేసి బాగా కలుపుకోవాలి.
6. ఈ మొత్తం మిశ్రమాన్ని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టాలి.
7. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెను వేయాలి.
8. ఆ నూనె వేడెక్కాక ఈ మిశ్రమాన్ని పకోడీ ఇలా వేసుకోవాలి.
9. ఇవి క్రంచీగా, క్రిస్పీగా అయ్యేవరకు ఉంచాలి.
10. ఆ తర్వాత ఈ పకోడీలను తీసి ఒకటి ఇష్యూ పేపర్ పై వేయాలి.
11. ఈ టిష్యూ పేపర్ పకోడీలకి ఉన్న అదనపు నూనెను పీల్చేస్తుంది.
12. ఈ పకోడీలను పుదీనా చట్నీతో తింటే టేస్టీగా ఉంటాయి.
సాధారణ పకోడీ కన్నా ఈ వెజిటబుల్ పకోడీలో పోషక విలువలు ఎక్కువ. ఎందుకంటే దీనిలో మనం క్యాబేజీ, క్యారెట్, పాలకూర, క్యాప్సికం వంటివన్నీ వాడాము. అందులో ఉండే పోషకాలన్నీ శరీరంలో చేరుతాయి. వీటిలో పోషక విలువలు కూడా ఉంటాయి. అయితే నూనెలో వేయించిన ఆహారాన్ని అధికంగా తినక పోవడమే మంచిది. అప్పుడప్పుడు పకోడీ తినాలనిపిస్తే ఇలా వెజిటబుల్ పకోడీ చేసుకుని తినండి. ఎంతో కొంత పోషకాలు శరీరానికి అందే అవకాశం ఉంది. కానీ తరచూ నూనెలో నానిన పకోడీలను తింటే మంచిది కాదు.