పుదీనా కొబ్బరి కాంబినేషన్ పచ్చడి ట్రై చేశారా? ఇదిగోండి మీ కోసమే ఈ సింపుల్ రెసిపీ-mint coconut zing have a taste the twist youve been missing ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  పుదీనా కొబ్బరి కాంబినేషన్ పచ్చడి ట్రై చేశారా? ఇదిగోండి మీ కోసమే ఈ సింపుల్ రెసిపీ

పుదీనా కొబ్బరి కాంబినేషన్ పచ్చడి ట్రై చేశారా? ఇదిగోండి మీ కోసమే ఈ సింపుల్ రెసిపీ

Ramya Sri Marka HT Telugu

పుదీనా చట్నీ చేసి ఉంటారు. కొబ్బరి చట్నీ చేసి ఉంటారు. కానీ, కొత్తగా పుదీనా, కొబ్బరి కాంబినేషన్‌తో చేసే పుదీనా కొబ్బరి చట్నీ ట్రై చేద్దామా..? ఒక్కసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది ఈ పుదీనా కొబ్బరి పచ్చడి.

పుదీనా కొబ్బరి పచ్చడి తయారీ విధానం

ఎప్పుడైనా ఒక కొత్త రుచిని ప్రయత్నించాలని అనిపించిందా? మీ నాలుకకు సరికొత్త అనుభూతిని అందించే ప్రత్యేకమైన పచ్చడి కోసం మీరు వెదుకుతుంటే అది ఈ పుదీనా కొబ్బరి పచ్చడే! వినడానికి కొంచెం కొత్తగా అనిపించినా, ఈ కాంబినేషన్ అద్భుతమైన రుచిని అందిస్తుంది. పుదీనాలో ఉండే తాజా సువాసన, కొబ్బరిలో ఉండే తియ్యని రుచి కలిసి మీ భోజనానికి ఒక ప్రత్యేకమైన మెరుపును తీసుకొస్తాయి. రోటీ, దోస, ఇడ్లీ లేదా వేడి అన్నంతో కలిపి తిన్నారంటే ఈ పచ్చడి రుచి మరిచిపోలేరు. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ పచ్చడితో తింటే ఆ రుచి అద్భుతం. తిన్నవాళ్లెవరైనా ఆహా అనాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం? ఈసారి మీ రుచిని కొత్త దారిలో నడిపించండి!

కావాల్సిన పదార్థాలు:

  • చింతపండు - రెండు రెబ్బలు
  • పుదీనా - రెండు గుప్పిళ్లు
  • ఎండు మిరపకాయల - గుప్పెడు (20 కాయలు)
  • వంటనూనె - 2 టేబుల్ స్పూన్లు
  • మెంతులు - పావు స్పూన్
  • పసుపు - చిటికెడు
  • ఉప్పు - రుచికి తగినంత
  • పచ్చిశనగపప్పు - ఒక టేబుల్ స్పూన్
  • కరివేపాకు - పది ఆకులు
  • ఇంగువ - చిటికెడు
  • ఆవాలు - ఒక టీ స్పూన్
  • కొబ్బరి చిప్ప - 1

తయారుచేసే విధానం:

  1. ముందుగా చింతపండు తీసుకుని వేడినీళ్లలో కడుక్కుని పక్కకుపెట్టుకోండి.
  2. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో నూనె పోయండి.
  3. ఆ తర్వాత అందులో మెంతులు వేసి బాగా వేగనివ్వండి.
  4. అవి వేగిన తర్వాత అందులో కొన్ని ఆవాలు వేసి వేడి చేయండి.
  5. ఆవాలు చిటపటలాడుతున్న సమయంలో మినపప్పు వేసుకోవాలి.
  6. ఇప్పుడు పుదీనాకు, ఎండుమిరప కాయలు వేసుకుని వేయించుకోండి.
  7. పుదీనా ఆకు దోరగా వేగిన తర్వాత ఇంగువ, వేసి బాగా కలియబెట్టండి.
  8. ఇప్పుడు అందులో చిన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు వేయండి.
  9. ఆ తర్వాత పుదీనా ఆకులు, కొబ్బరి ముక్కలు బాగా వేగేంత వరకూ కలుపుతూ ఉండండి.
  10. ఇప్పుడు పుదీనా ఓ మాదిరిగా మగ్గినట్లుగా అనిపిస్తే చాలు, మంట ఆర్పేయండి.
  11. అందులో రుచికి తగినంత ఉప్పు వేసి స్టవ్ మీద నుంచి దించేసి చల్లారనివ్వండి.
  12. చల్లారిన ఆ మిశ్రమాన్ని మిక్సీ జార్ లో వేసుకోండి.
  13. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న చింతపండును అందులో వేసి నీళ్లు లేకుండా గ్రైండ్ చేయండి.
  14. ఒకవేళ గ్రైండ్ కాకపోతే, కొన్ని మరిగించిన వేడి నీళ్లు పోసుకోవడం మంచిది.
  15. రెడీ అయిపోయిన పుదీనా కొబ్బరి చట్నీని కావాలనుకుంటే తాలింపు పెట్టుకోవచ్చు.
  16. అందుకోసం నూనెను కడాయిలో పోసి వేడి చేయండి.
  17. మరుగుతున్న నూనెలో పచ్చిశనగపప్పు, రెండు మిరపకాయలు, కరివేపాకు వేసి వేయించండి.
  18. అలా తయారైన తాలింపును స్టవ్ ఆఫ్ చేసి మిక్సీలో మెత్తగా నూరుకున్న కొబ్బరి పచ్చడిపై వేయండి.
  19. అంతే మీరెంతో మెచ్చే పుదీనా - కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయినట్లే.

పుదీనా - కొబ్బరి పచ్చడి ఉపయోగాలు:

పుదీనా జీర్ణక్రియకు తోడ్పడుతుంది. కొబ్బరిలోని పోషకాలు తక్షణ శక్తిని అందిస్తాయి. ఈ పచ్చడి ప్రత్యేకమైన రుచితో పాటు ఆకలిని పెంచుతుంది. భోజనానికి కొత్తదనాన్ని కల్పిస్తుంది.

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.