Migraine In Summer: వేసవిలో మైగ్రేన్ సమస్య పెరగడానికి కారణాలివే? నివారణ చిట్కాలను తెలుసుకోండి!-migraine in summer what are the reasons for the increase in migraine problems in summer learn prevention tips ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Migraine In Summer: వేసవిలో మైగ్రేన్ సమస్య పెరగడానికి కారణాలివే? నివారణ చిట్కాలను తెలుసుకోండి!

Migraine In Summer: వేసవిలో మైగ్రేన్ సమస్య పెరగడానికి కారణాలివే? నివారణ చిట్కాలను తెలుసుకోండి!

Ramya Sri Marka HT Telugu

Migraine In Summer: వేసవిలో మైగ్రేన్‌ సమస్య తరచూ ఇబ్బందిపెడుతుంది. మామూలు రోజుల కంటే, ఎక్కువగా ఈ సమస్యతో సతమతమవుతుంటారు. సమ్మర్‌లో తలనొప్పిని ప్రేరేపించే అంశాలు ఏమిటి? ఏ సమయంలో వైద్యులను సంప్రదించాలో తెలుసుకోండి.

వేసవిలో మైగ్రేన్‌ను పెంచే అంశాలు

వేసవిలో వచ్చే తలనొప్పి, ముఖ్యంగా మైగ్రేన్‌ను అధిగమించడం చాలా కష్టం. ఈ సమస్యతో బాధపడేవారు మీ రోజువారీ కార్యక్రమాలను కూడా పూర్తిగా చేసుకోలేరు. రోజంతా అలసట, నీరసాన్ని కలిగిస్తాయి. వేసవిలో వచ్చే మైగ్రేన్‌ మామూలు రోజుల కంటే ఎక్కువసేపు ఉంటుంది. అంత సులభంగా తగ్గదు. మైగ్రేన్‌ దీర్ఘకాలంపాటు వేధించడానికి కారణాలు ఏంటి, దాని నుండి త్వరగా కోలుకోవడం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం రండి.

వేసవిలో మైగ్రేన్ ఎక్కువ అవడానికి కారణాలు

1. డీహైడ్రేషన్

వేసవి రోజుల్లో డీహైడ్రేషన్ (నిర్జలీకరణం) సర్వసాధారణం. తగినంత నీరు లేనప్పుడు శరీరం సరిగ్గా పనిచేయడంలో ఇబ్బంది పడుతుంది. ఎండవేడికి సాధారణంగానే తలనొప్పిగా ఉంటుంది. అలాంటిది మైగ్రేన్‌ తలనొప్పితో బాధపడేవారికి సమ్మర్లో నొప్పి మరింతగా వస్తుంది. డీహైడ్రేషన్ మైగ్రేన్‌ను మరింత తీవ్రతరం చేసి కోలుకోవడానికి చాలా ఎక్కువ సమయం పట్టేలా చేస్తుంది.

2. సూర్యకాంతికి గురికావడం

ఎక్కువసేపు ఎండలో ఉండటం కూడా మైగ్రేన్‌కు కారణం కావచ్చు. ప్రకాశవంతమైన సూర్యకాంతి, వాతావరణంలో ఉండే వేడి నరాల వ్యవస్థపై ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది తీవ్రమైన తలనొప్పికి దారితీస్తుంది. మైగ్రేన్‌ ఉన్నవారిలో, వారి లక్షణాలను మరింత తీవ్రతరం చేసి అలసటను పెంచుతుంది.

3. ఉష్ణోగ్రతలో తీవ్రమైన మార్పులు

ఉష్ణోగ్రతలో అకస్మాత్తుగా కలిగే మార్పులు కూడా మైగ్రేన్ నొప్పిని పెంచుతాయి. ఉదాహరణకు ఎయిర్ కండిషనింగ్ గది నుండి వేడి వాతావరణంలోకి రాగానే తలనొప్పి మొదలవుతుంది. ఈ మార్పులు మన శరీరాన్ని ఒత్తిడికి గురిచేస్తాయి.

4. సన్‌స్ట్రోక్ లేదా హీట్‌ స్ట్రోక్

వేసవిలో సన్‌స్ట్రోక్ లేదా హీట్‌ స్ట్రోక్ సర్వసాధారణం. ఈ స్ట్రోక్ కారణంగా తలనొప్పి కచ్చితంగా వస్తుంది. శరీరం చాలా వేడికి గురై సరిగ్గా చల్లబడలేకపోతే, అది తలతిరగడం, గందరగోళం, వికారం, తలనొప్పికి కారణం కావచ్చు. ఇది మిమ్మల్ని అలసట, కళ్లు తిరగడం వంటి పరిస్థితులకు దారి తీస్తుంది.

మైగ్రేన్‌కు కారణమయ్యే మరిన్ని అంశాలు

మైగ్రేన్‌ ఉన్నవారిని వేసవి వాతావరణం మరింతగా వేధిస్తుంది. దీనికి పలు కారణాలు ఉన్నాయి.

  • నిద్రలేమి లేదా క్రమపద్దతి లేని నిద్ర
  • సమయానికి సరిగ్గా భోజనం చేయకపోవడం (ముఖ్యంగా భోజనం మిస్ అవ్వడం)
  • ఎక్కువ వెలుతురులో ఉండటం, బిగ్గరగా వినిపించే శబ్దాలకు దగ్గరగా ఉండటం
  • కొన్ని బలమైన వాసనలు లేదా దుర్వాసనలు
  • ప్రాసెస్ చేసిన మాంసం, చీజ్ లేదా చాక్లెట్ వంటి మైగ్రేన్‌లను ప్రేరేపించే ఆహారాలు.

మైగ్రేన్‌ నుండి వేగంగా కోలుకోవడం ఎలా:

వేసవిలో మైగ్రేన్‌ నుండి కోలుకోవడానికి కొన్ని ముఖ్యమైన చిట్కాలను పరిశీలిద్దాం.

1. నీరు త్రాగండి: మైగ్రేన్‌కు కారణమయ్యే డీహైడ్రేషన్‌ను నివారించడానికి రోజంతా తగినంత నీరు త్రాగండి.

2. కెఫైన్, చక్కెర పానీయాలకు దూరంగా ఉండండి: కెఫైన్, చక్కెర పానీయాలు మిమ్మల్ని డీహైడ్రేట్ చేస్తాయి. హైడ్రేటెడ్‌గా ఉండటానికి నీరు లేదా ఎలక్ట్రోలైట్లు ఉన్న పానీయాలను త్రాగండి.

3. అధిక వేడిని నివారించండి: మధ్యాహ్నం తీవ్రమైన వేడిని నివారించడానికి ఉదయం లేదా సాయంత్రం వేళల్లోనే మీ పనిని పూర్తి చేసుకోండి.

4. సన్ హీట్ నుంచి సేఫ్‌గా ఉండండి: ఎండ నుండి మిమ్మల్ని రక్షించుకోవడానికి టోపీ, సన్ గ్లాసెస్, సన్‌స్క్రీన్ ధరించండి. బయటకు వెళ్ళినప్పుడు ఎక్కువసేపు నీడలో ఉండేందుకు ప్రయత్నించండి.

5. ఘాటు వాసనల నుంచి జాగ్రత్త వహించండి: సన్‌స్క్రీన్, పెర్ఫ్యూమ్ లేదా ఇన్సెక్ట్ స్ప్రేల వాసన మైగ్రేన్‌కు కారణం కావచ్చు. సాధ్యమైనప్పుడల్లా వాసన లేని ఉత్పత్తులను ఉపయోగించడానికి ప్రయత్నించండి.

6. విశ్రాంతికి సమయం కేటాయించండి: మీ ఖాళీ సమయాన్ని ధ్యానం, ప్రార్థన, వ్యాయామం లేదా కేవలం విశ్రాంతి కోసం ఉపయోగించండి. మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం వల్ల మైగ్రేన్‌ను అదుపులో ఉంచుకోవచ్చు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాలయను క్రోడీకరించి మాత్రమే ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Ramya Sri Marka

eMail
రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం