ప్రసవం తరువాత శారీరకంగా, మానసికంగా అలసిపోతున్నారా? అయితే ఈ 5 యోగాసనాలు మీ కోసమే-mentally and physically exhausted after childbirth 5 postnatal yoga asanas ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  ప్రసవం తరువాత శారీరకంగా, మానసికంగా అలసిపోతున్నారా? అయితే ఈ 5 యోగాసనాలు మీ కోసమే

ప్రసవం తరువాత శారీరకంగా, మానసికంగా అలసిపోతున్నారా? అయితే ఈ 5 యోగాసనాలు మీ కోసమే

HT Telugu Desk HT Telugu

ప్రసవానంతర యోగా (Postnatal Yoga) సాధన చేయడం వల్ల మనసు ప్రశాంతంగా, శరీరం శక్తివంతంగా మారుతుంది. అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అన్షిక కశ్యప్ కొత్త తల్లులకు ప్రసవానంతర యోగా ఎలా సహాయపడుతుందో HT లైఫ్‌స్టైల్‌తో చెప్పారు.

యోగాసనాలతో ప్రసవానంతరం మానసికంగా, శారీరకంగా త్వరగా కోలుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు (Shutterstock)

ప్రసవం తర్వాత కోలుకోవడానికి, మనసును కుదుటపరుచుకోవడానికి యోగా బాగా పనిచేస్తుంది. బిడ్డకు జన్మనివ్వడం అంటే మానసికంగా, శారీరకంగా పెద్ద మార్పు. తొమ్మిది నెలల గర్భం, ప్రసవ సమయంలో శరీరం చాలా ఒడుదొడుకులను ఎదుర్కొంటుంది. అప్పుడే అమ్మ అయిన తర్వాత వచ్చే మార్పులకు మనసు కూడా సిద్ధం కావాలి. ఇవన్నీ ఒక్కోసారి చాలా ఒత్తిడిని కలిగించవచ్చు. ఇలాంటి టైంలో ప్రసవానంతర యోగా (Postnatal Yoga) సాధన చేయడం వల్ల మనసు ప్రశాంతంగా, శరీరం శక్తివంతంగా మారుతుంది.

కేజే సోమయ్య మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లోని అబ్‌స్టెట్రిక్స్ గైనకాలజీ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అన్షిక కశ్యప్ తల్లులకు ప్రసవానంతర యోగా ఎలా సహాయపడుతుందో HT లైఫ్‌స్టైల్‌తో చెప్పారు.

"డెలివరీ తర్వాత తల్లులు తరచుగా అలసట, హార్మోన్ల మార్పులు వంటివి అనుభవిస్తారు. ఈ పరిస్థితుల మధ్య ప్రసవానంతర యోగా కాసేపు ఆగి, ఊపిరి పీల్చుకుని, నెమ్మదిగా, సున్నితంగా కోలుకోవడానికి ఒక అవకాశం ఇస్తుంది. దీన్ని పోస్ట్‌పార్టమ్ యోగా అని కూడా అంటారు. ఈ సాధనలో కదలికలు, శ్వాస వ్యాయామాలు, చక్కటి విశ్రాంతి ఉంటాయి. గర్భధారణ, ప్రసవం వల్ల బలహీనపడిన కోర్ స్థిరత్వం, పెల్విక్ బలం, భావోద్వేగ సమతుల్యతను తిరిగి పొందడానికి ఇది చాలా సాయపడుతుంది" అని డాక్టర్ వివరించారు.

ప్రసవానంతర యోగా మానసిక ఆరోగ్యానికే కాకుండా శారీరక ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. "శారీరకంగా చూస్తే, ప్రసవానంతర యోగా కోర్, పెల్విక్ ఫ్లోర్ కండరాలను బలపరుస్తుంది. ఇవి సాధారణంగా గర్భధారణ, ప్రసవం సమయంలో బలహీనపడతాయి. బిడ్డకు పాలివ్వడం, ఎత్తుకోవడం వల్ల వచ్చే నడుము, భుజాల నొప్పిని కూడా తేలికపాటి ఆసనాలు తగ్గిస్తాయి. శ్వాస వ్యాయామాలు పారాసింపథెటిక్ నెర్వస్ సిస్టమ్‌ను ఉత్తేజపరిచి, లోతైన విశ్రాంతిని, భావోద్వేగ సమతుల్యతను ఇస్తాయి" అని డాక్టర్ కశ్యప్ అన్నారు.

డాక్టర్ అన్షిక కశ్యప్ చెప్పిన 5 సులభమైన ప్రసవానంతర యోగా ఆసనాలు ఇక్కడ ఉన్నాయి. వీటిని మీ డాక్టర్ పర్మిషన్‌తో ఇంట్లోనే సేఫ్‌గా చేసుకోవచ్చు.

1. మార్జర్యాసన-బిటిలాసన (Cat-Cow Pose)

ఎలా చేయాలి: మోకాళ్లపై చేతులు పెట్టి, శ్వాస తీసుకునేటప్పుడు వెన్నెముకను వంచి, బయటికి వదిలేటప్పుడు దాన్ని గుండ్రంగా చేయండి.

లాభాలు: ఇది వెన్నెముక బిగుతును తగ్గిస్తుంది. బాడీ పోశ్చర్ మెరుగుపరుస్తుంది. కోర్‌ను సున్నితంగా కదిలిస్తుంది.

2. విపరీత కరణి (Legs-Up-the-Wall)

ఎలా చేయాలి: మీ వెన్నుపై పడుకుని, కాళ్లను గోడకు ఆనించి పైకి చాచండి.

లాభాలు: ఇది కాళ్ల వాపును తగ్గిస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. నాడీ వ్యవస్థను ప్రశాంతంగా ఉంచుతుంది.

3. సేతు బంధాసన (Bridge Pose)

ఎలా చేయాలి: మీ వెన్నుపై పడుకుని, మోకాళ్లను వంచి, పాదాలను తుంటి వెడల్పులో ఉంచండి. మీ తుంటిని పైకి లేపడానికి పాదాలను నేలకి గట్టిగా నొక్కండి.

లాభాలు: ఇది మీ గ్లూట్స్, నడుము, పెల్విక్ ఫ్లోర్‌ను టోన్ చేస్తుంది.

4. బాలాసన (Child's Pose)

ఎలా చేయాలి: మీ మడమలపై కూర్చుని, ముందుకు వంగి, చేతులను చాచండి.

లాభాలు: ఇది నడుములోని ఒత్తిడిని తగ్గిస్తుంది. బాగా శ్వాస తీసుకోవడానికి సాయపడుతుంది. మనసును ప్రశాంతపరుస్తుంది.

5. అనులోమ విలోమ ప్రాణాయామం (Alternate Nostril Breathing)

ఎలా చేయాలి: ఒక ముక్కు రంధ్రం ద్వారా గాలి పీల్చుకుని, మరొక దాని ద్వారా వదలండి. ఇలా రెండు వైపులా మారుస్తూ చేయాలి.

లాభాలు: ఇది మూడ్‌ను బ్యాలెన్స్ చేస్తుంది. ఏకాగ్రతను పెంచుతుంది. ఆందోళనను తగ్గిస్తుంది.

(పాఠకులకు గమనిక: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసమే. ఇది డాక్టర్ సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా ఆరోగ్య సమస్యల గురించి మీకు ఏవైనా సందేహాలు ఉంటే, తప్పకుండా మీ డాక్టర్‌ను సంప్రదించండి.)

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.