Men After 30: మగాళ్లు.. 30 ఏళ్ల తర్వాత ఈ 5 విషయాలను అసలు నిర్లక్ష్యం చేయొద్దు!
Men After 30: 30 సంవత్సరాల వయసు తర్వాత పురుషులు కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. బిజీలో పడి విస్మరిస్తే ఆరోగ్య సమస్యలు తలెత్తే రిస్క్ ఉంటుంది. ఆ వివరాలివే..
30 ఏళ్ల వయసు పడిన తర్వాత అధిక శాతం మంది పురుషులకు బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగం, కుటుంబం, పిల్లలు ఇలా పూర్తిగా బిజీ అయిపోతారు. తీరిక లేకుండా కాలం గడిచిపోతూ ఉంటుంది. ఈ క్రమంలో ఆ వయసు తర్వాత చాలా మంది తమ శరీరం గురించి పెద్దగా పట్టించుకోరు. పెద్దగా జాగ్రత్తలు తీసుకోరు. అయితే, 30 ఏళ్ల వయసు తర్వాత పురుషుల తప్పకుండా కొన్ని విషయాలపై దృష్టి పెట్టాలి. అలా అయితేనే ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తే రిస్క్ తగ్గుతుంది. అలా 30 ఏళ్ల తర్వాత పురుషులు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏవో ఇక్కడ తెలుసుకోండి.
పొట్ట రాకుండా..
చాలా మంది పురుషుల్లో 30 ఏళ్ల తర్వాత వచ్చే సమస్య ఊబకాయం. ఇది చాలా సమస్యలకు దారి తీస్తుంది. బరువు పెరిగి ఊబకాయం వస్తే డయాబెటిస్ రిస్క్ పెరుగుతుంది. కొలెస్ట్రాల్ అధికమై గుండెకు ముప్పు ఏర్పడుతుంది. అందుకే పొట్ట పెరగకుండా తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎంత బిజీగా ఉన్నా ఉదయాన్నే వ్యాయామం చేయాలి. ఓ సరైన డైట్ పాటించాలి. ప్రోటీన్, ఫైబర్ ఉండే ఆహారాలు తినాలి. కాయధాన్యాలు, నట్స్, విత్తనాలు, కూరగాయలు, పండ్లు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. మొత్తంగా బరువు పెరిగి పొట్టరాకుండా 30 ఏళ్లు దాటిన పురుషులు దృష్టి సారించాలి.
ఎముకలు, కండరాల దృఢత్వంపై..
వయసు పెరిగే కొద్ది ఎముకల దృఢత్వం, కండలు తగ్గిపోతూ ఉంటాయి. ముఖ్యంగా 30 ఏళ్ల వయసు తర్వాత చాలా మంది బిజీగా ఉండి ఎక్సర్‌సైజ్‍లు మానేయడం, శారీరక శ్రమ తగ్గించేయటంతో ఇలా జరుగుతూ ఉంటుంది. మరికొందరు పోషకాలు సరిగా తీసుకోకపోవడం కూడా కారణంగా ఉంటుంది. 30 ఏళ్లు దాటిన తర్వాత కండలు బాగా ఉండాలంటే వెయిట్ లిఫ్టింగ్, రెసిస్టెంట్ వ్యాయామాలతో పాటు వివిధ రకాల ఎక్సర్‌సైజ్‍లు చేయాలి. ప్రతీ రోజు సాధారణ వ్యాయమాలు చేసినా.. వారంలో కనీసం మూడు రోజులైన ఈ ఎక్సర్‌సైజ్‍లు చేయాలి. వీటి వల్ల ఎముకల దృఢత్వం కూడా మెరుగ్గా ఉంటుంది. ప్రొటీన్లు, విటమిన్ డీ, కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి.
గుండెపై ప్రత్యేక శ్రద్ధ
30 ఏళ్ల వయసు దాటిన తర్వాత పురుషులు గుండె ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఎందుకంటే ఆ తర్వాతే గుండె వ్యాధుల రిస్క్ పెరుగుతుంది. బ్లడ్ ప్రెజర్, కొలెస్ట్రాల్ పెరగడం లాంటి సమస్యలు గుండెను దెబ్బతీస్తాయి. అందుకే ముందుగా అవి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పోషకాలు ఉండే ఆహారంతో పాటు వ్యాయామాలు చేయాలి. తరచూ బీపీ, కొలెస్ట్రాల్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏదైనా సమస్య ఉంటే వెంటనే స్పందించి.. దాన్ని పరిష్కరించుకునే దిశగా కృషి చేయాలి. ఆరోగ్యం విషయంలో అసలు నిర్లక్ష్యం చేయకూడదు.
మానసిక ఆరోగ్యం
బాధ్యతలు పెరగడంతో 30 ఏళ్ల తర్వాత చాలా మంది పురుషులు ఒత్తిడికి గురవుతుంటారు. కొందరికి ఆందోళన ఉంటుంది. అయితే, ఈ వయసు తర్వాత మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం. అన్ని విధాల ఆరోగ్యంగా ఉండేందుకు ఇది కీలకం. అందుకే ధ్యానం, యోగా, బ్రీత్ ఎక్సర్‌సైజ్‍ల్లాంటివి ప్రతీ రోజు చేయాలి. ఒత్తిడి లేకుండా జీవనం సాగించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
రెగ్యులర్‌గా ఆరోగ్య పరీక్షలు
30 ఏళ్లు దాటిన పురుషులు రెగ్యులర్‌గా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకునేందుకు ఇవి ఉపయోగపడతాయి. బ్లడ్ ప్రెజర్, కొలెస్ట్రాల్ లెవెల్స్, గుండె ఇలా అవసరమైన హెల్త్ చెకప్స్ చేయించుకోవాలి.