Medical Tests for Over 30: మీ వయసు 30 దాటిందా? రేపే ఈ వైద్య పరీక్షలు చేయించుకోండి-medical tests for over 30 know 9 essential tests to take tomorrow ,లైఫ్‌స్టైల్ న్యూస్
Telugu News  /  Lifestyle  /  Medical Tests For Over 30 Know 9 Essential Tests To Take Tomorrow

Medical Tests for Over 30: మీ వయసు 30 దాటిందా? రేపే ఈ వైద్య పరీక్షలు చేయించుకోండి

HT Telugu Desk HT Telugu
Oct 28, 2023 04:30 PM IST

Medical Tests for Over 30: కొన్ని రకాల ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల లోపు ఉన్నవారు కచ్చితంగా వారి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసుకోవచ్చు.

Blood Tests: వయస్సు 30 దాటితే తప్పక చేయించాల్సిన వైద్య పరీక్షలు
Blood Tests: వయస్సు 30 దాటితే తప్పక చేయించాల్సిన వైద్య పరీక్షలు (pixabay)

ఒకప్పుడు యాభై ఏళ్లు దాటితేనే ఆరోగ్య సమస్యలు వచ్చేవి. ఇప్పుడు 30 ఏళ్లకే మొదలైపోతున్నాయి. ఇక గుండె పోటు వంటివి ఎప్పుడు వస్తాయో అంచనా వేయడం కష్టమే. టీనేజ్‌లో గుండెపోటు బారిన పడి మరణించిన వారి సంఖ్య కూడా పెరుగుతోంది. కాబట్టి ముందు నుంచే ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 30 ఏళ్ల వయసు వచ్చేసరికి ఇంటి బాధ్యతలు, బరువులు భుజాలపై పడుతున్నాయి. దీనివల్ల తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. పని ఒత్తిడి, ఆర్థికపరమైన ఇబ్బందులు, కుటుంబ బాధ్యతల వల్ల తమ ఆరోగ్యం గురించి పట్టించుకునే వారి సంఖ్య తక్కువగా ఉంది. చికిత్స కంటే నివారణే ముఖ్యమని అంటారు. అలాగే ప్రమాదాన్ని ముందే పసిగట్టాలంటే కొన్ని రకాల వైద్య పరీక్షలు చేయించుకోవాలి.

ట్రెండింగ్ వార్తలు

ప్రస్తుత కాలంలో గుండె జబ్బులు, హైబీపీ, ఊబకాయం, మధుమేహం వంటివన్నీ కూడా ముప్పయ్యేళ్లలోనే కనిపిస్తున్నాయి. ఆహారపు అలవాట్లు మారడం, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఇలాంటి వ్యాధులు చిన్న వయసులోనే ప్రభావం చూపిస్తున్నాయి. 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల లోపు ఉన్నవారు కచ్చితంగా కొన్ని రకాల పరీక్షలు చేయించుకోవడం ద్వారా వారి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసుకోవచ్చు.

ఈ వైద్య పరీక్షలు తప్పక చేయాల్సిందే

1.బీపీ పరీక్ష

నెలకు ఒకసారైనా రక్తపోటు (బ్లడ్ ప్రెషర్ - బీపీ) ఎంతుందో చెక్ చేయించుకుంటూ ఉండాలి. అధిక రక్తపోటు గుండె జబ్బులకు కారణమవుతుంది. రక్తపోటు అధికంగా ఉన్నట్లయితే వెంటనే గుండె వైద్య నిపుణులను కలవడం చాలా మంచిది.

2. సీబీసీ పరీక్ష

సీబీసీ అని పిలిచే కంప్లీట్ బ్లడ్ కౌంట్ పరీక్షను చేయించుకోవాలి. ఇది రక్తంలోని కణాల సంఖ్యను తెలియజేస్తుంది. రక్తహీనత, ఇన్ఫెక్షన్లు వంటివి ఉన్నాయా లేవో చెబుతుంది. అలాగే కొన్ని రకాల క్యాన్సర్లను కూడా గుర్తిస్తుంది. ఎర్ర రక్తకణాలో హిమోగ్లోబిన్ శాతం ఎంత ఉందో చెబుతుంది. దీనివల్ల కణాలకు ఆక్సిజన్ సరఫరా సరిగ్గా అవుతుందో లేదో తెలుసుకోవచ్చు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ పరీక్ష చేయించుకుంటే మంచిది.

3. హెచ్‌బీఏ1సీ (Hba1C)

హెచ్‌బీఏ1సీ ఇది డయాబెటిస్ పరీక్ష. ప్రతి మూడు నెలలకు ఒకసారి చేయించుకుంటే మంచిది. రాత్రిపూట ఆహారం తీసుకున్నాక 12 గంటల పాటు ఉపవాసం ఉండాలి. ఉదయం లేచాక ఈ పరీక్ష చేయించుకోవాలి. గడిచిన మూడు నెలల్లో మీ షుగర్ రీడింగ్ ఎంతుందో తెలుస్తుంది. సాధారణ షుగర్ టెస్ట్ (ఫాస్టింగ్) బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకుంటే మంచిది. పరిగడుపున బ్లడ్ షుగర్ లెవెల్ 100 తక్కువగా ఉంటే సాధారణం. 100 నుంచి 126 మధ్య ఉంటే ప్రీడయాబెటిక్. అంటే మధుమేహంలో ముందస్తు దశ అని అర్థం చేసుకోవాలి. 126 కంటే ఎక్కువ ఉంటే డయాబెటిస్ ఉన్నట్టే లెక్క. అలాగే బ్రేక్ ఫాస్ట్ తరువాత అయితే రక్తంలో గ్లూకోజుస్థాయి 140 లోపు ఉండాలి. తేడా ఉంటే ఒకసారి మీ ఫిజీషియన్ ను గానీ, డయాబెటిస్ స్పెషలిస్ట్ అయిన ఎండొక్రైనాలజిస్ట్‌ను గానీ సంప్రదించడం మంచిది.

4. లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష

లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ వల్ల గుండె ఎలా పనిచేస్తుందో తెలుసుకోవచ్చు. అలాగే కొవ్వు స్థాయిలు కూడా తెలుస్తాయి. మంచి కొలెస్టరాల్, చెడు కొలెస్ట్రాల్, ట్రై గ్లిజరైడ్స్ ఎలా ఉన్నాయో తెలుస్తుంది. సంవత్సరానికి ఒక్కసారైనా ఈ పరీక్ష చేయించుకోవడం చాలా ఉత్తమం. ఇక అధిక బరువుతో బాధపడుతున్న వారు, మధుమేహం ఉన్న వారు మాత్రం ఖచ్చితంగా ఈ పరీక్ష చేయించుకోవాలి. ఒత్తిడికి లోనవుతున్నవారు, ఆయాసపడుతున్నవారు కూడా ఈ పరీక్ష చేయించుకోవాలి.

5. లివర్ ఫంక్షన్ టెస్ట్ (LFT)

లివర్ ఫంక్షన్ టెస్ట్ అనేది కాలేయం సరిగా పనిచేస్తుందో లేదో తెలిపే పరీక్ష. దీని ద్వారా హెపటైటిస్ సి, హెపటైటిస్ బి వంటి ఆరోగ్య సమస్యల గురించి ముందే తెలుసుకోవచ్చు. ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉన్న వారు, అధికంగా నాన్ వెజ్ తినే వారూ తప్పక చేయించుకోవాలి. ఆల్కహాల్ లేకపోయినా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ బారిన పడే ముప్పుంటుందని గుర్తించాలి.

6. ఈసీజీ పరీక్ష

ఈసీజీ (ఎలక్ట్రోకార్డియోగ్రామ్) పరీక్ష ఆరు నెలలకోసారి చేయించుకోవాలి. గుండె కొట్టుకునే వేగంలో మార్పులు ఉంటే ఈసీజీ ద్వారా తెలుసుకొనే అవకాశం ఉంది. ఇందులో అసాధారణతలు కనిపిస్తే వైద్యులు గుండెకు సంబంధించి తదుపరి పరీక్షలు సిఫారసు చేస్తారు. 2డీ ఎకో వంటి పరీక్షలు చేయించుకోమని చెబుతారు.

7. యూరిన్ టెస్ట్

మూత్ర పరీక్ష చేయించుకుంటే యూరిన్ ఇన్ఫెక్షన్లు ఉంటే తెలిసిపోతాయి. యూరిన్లో ఎంత ప్రోటీన్, షుగర్, బ్లడ్ లెవెల్స్ ఉన్నాయో తెలుసుకోవాలి. సిగరెట్లు అధికంగా తాగే వారిలో మూత్రనాళ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. యూరిన్ టెస్ట్ ద్వారా ఈ విషయాన్ని ముందుగానే తెలుసుకోవచ్చు.

8. కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ (KFT)

కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేయించుకుంటే కిడ్నీల పనితీరును అంచనా వేయొచ్చు. కిడ్నీ ఫంక్షన్ టెస్ట్‌లో సీరం క్రియాటిన్ అనే పరీక్ష చేస్తారు. ఈ పరీక్ష ద్వారా కిడ్నీలు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో తెలుసుకోవచ్చు. ఈ సీరం క్రియాటిన్ స్థాయిలు అధికంగా ఉంటే కిడ్నీల్లో సమస్యలు ఉన్నట్టు అర్థం చేసుకోవాలి.

9. థైరాయిడ్

చాలామంది 30 నుంచి 40 ఏళ్లలో థైరాయిడ్ వ్యాధి బారిన త్వరగా పడుతూ ఉంటారు. శరీరం బరువు త్వరగా పెరగడం లేదా త్వరగా తగ్గడం జరుగుతూ ఉంటుంది. రక్త పరీక్ష ద్వారా థైరాయిడ్ సమస్య ఉందో లేదో తెలుసుకోవచ్చు. థైరాయిడ్ సమస్యలు ఉంటే పురుషులు, మహిళల్లో సంతానోత్పత్తి సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే ముప్పుంది.

WhatsApp channel