Saturday Motivation: అర్థరహితమైన మాటలకన్నా అర్థవంతమైన నిశ్శబ్దం చాలా గొప్పది, మీకు ఎంతో ప్రశాంతతను ఇస్తుంది
Saturday Motivation: అధికంగా మాట్లాడి సమస్యలు తెచ్చుకునే కన్నా మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండడం మేలు. ఒక నెలపాటు నిశ్శబ్దంగా ఉండి చూడండి. దాని విలువ మీకే తెలుస్తుంది.
అనువు గాని చోట అధికుల మనరాదు... అని చిన్నప్పటి నుంచి చదువుకునే ఉంటారు. అంటే మనది కాని స్థానంలో ఎక్కువగా మాట్లాడకూడదు అని అర్థం. ఆధునిక కాలంలో అనువైన చోట కూడా ఎక్కువగా మాట్లాడకూడదు, వీలైనంతవరకు నిశ్శబ్దంగా ఉండడం అనేది జీవితానికి ఎంతో ప్రశాంతతను ఇస్తుంది.
అతిగా మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆ ప్రయోజనాలు తెలిస్తే మీరు ఈరోజు నుంచే తక్కువగా మాట్లాడడం మొదలు పెడతారు.
ఎక్కువ సమయం పాటు నిశ్శబ్దంగా ఉండడం వల్ల మీకు తెలియకుండానే మీలో ఒత్తిడి తగ్గిపోతుంది. మీ శరీరం విశ్రాంతి తీసుకుంటుంది. మీ మెదడు అతిగా ఆలోచించడం మానేస్తుంది. టెన్షన్ ఒక్కసారిగా తీరిపోయినట్టు అనిపిస్తుంది. అందుకే ఎంతోమంది రణగొణ ధ్వనుల్లేని ప్రదేశాలలో వాకింగ్‌కు వెళ్లేందుకు ప్రయత్నిస్తారు.
రోజులో ఎక్కువ సమయం పాటు నిశ్శబ్దంగా ఉండటం వల్ల మీ మనస్సు ప్రతి సమస్యను క్లియర్ చేసుకుంటుంది. పరధ్యానాన్ని మానేస్తుంది. ఏకాగ్రతను పెంచుకుంటుంది. మీ మెదడుకు కొద్దిగా సెలవు ఇచ్చి మనసు పని చేయడం మొదలవుతుంది. మీరు మరింత శక్తివంతంగా, స్పష్టంగా నిర్ణయాలు తీసుకోగలరు.
నిశ్శబ్దంగా ఉండే సమయంలో మీలో ఆలోచనలు ఉత్తమంగా రావడం మొదలవుతాయి. సృజనాత్మకత పెరుగుతుంది. మీ భావోద్వేగాల నియంత్రణకు కూడా నిశ్శబ్ద సమయం ఎంతో ఉపయోగపడుతుంది. నిశ్శబ్దంగా ఉన్న సమయంలో మీ జీవితం మీ కళ్ళ ముందు కదిలినట్టు అనిపిస్తుంది. మనస్సు తేలికగా ఉంటుంది. మెదడు నిద్రలోకి జారుకుని ప్రశాంతంగా ఉంటుంది. ఈ నిశ్శబ్దక్షణాలు మీరు రీఛార్జ్ చేసుకోవడానికి, మీతో మీరు మళ్ళీ కనెక్ట్ కావడానికి ఉపయోగపడతాయి. ప్రతిరోజూ రిఫ్రెష్ అయినట్టు అనిపిస్తుంది. మీ జీవితాన్నే మార్చే శక్తి కాసేపు మీరు పాటించే నిశ్శబ్ధ క్షణాలకు ఉంది.
తక్కువగా మాట్లాడడమే నిశ్శబ్దంగా ఉండడం అనుకోకండి. మీ ఇంట్లోని ఒక స్థలాన్ని నిశ్శబ్ద స్థలంగా కేటాయించుకోండి. గదిలోని కిటికీ దగ్గర కుర్చీ వేసుకుని కూర్చుండి. చలికాలం కాబట్టి ఒక దుప్పటి కప్పుకోండి. చేతిలో మీకు ఇష్టమైన పుస్తకాన్ని పట్టుకోండి. ఎలాంటి ఆలోచనలను మెదడులోకి, మనసులోకి రానివ్వకండి. మీరు ఎవరితోనూ మాట్లాడకండి. మీతో ఎవరికీ మాట్లాడే అవకాశం ఇవ్వకండి. ప్రశాంతంగా కూర్చుని ఆ పుస్తకాన్ని చదవండి. లేదా కిటికీలోంచి ఆకాశంలోకి చూస్తూ ఆనందించండి. నిశ్శబ్దంగా ఉండడం అంటే ఒంటరిగా ఉండడం కూడా. రోజులో కాసేపు మీతో మీరు గడపాల్సిన సమయం అత్యవసరం.