Pincode meaning: మీ పిన్‌కోడ్ 5 తో ఎందుకు మొదలైంది? ఈ ఆరంకెల సంఖ్యకు అర్థమిదే-meaning of each digit in pincode number know what does it signifies ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Pincode Meaning: మీ పిన్‌కోడ్ 5 తో ఎందుకు మొదలైంది? ఈ ఆరంకెల సంఖ్యకు అర్థమిదే

Pincode meaning: మీ పిన్‌కోడ్ 5 తో ఎందుకు మొదలైంది? ఈ ఆరంకెల సంఖ్యకు అర్థమిదే

Koutik Pranaya Sree HT Telugu
Aug 23, 2024 12:30 PM IST

Pincode meaning: పిన్‌కోడ్ లేని అడ్రస్ పనికిరాదు. దానికి విలువ లేదు. ఈ ఆరంకెల పిన్‌కోడ్‌లో ఒక్కో అంకెకి ఒక్కో అర్థం ఉంది. ఆ అంకెల గురించి ప్రతిదీ వివరంగా తెల్సుకోండి. ఏ ప్రాతిపదికన వాటిని వర్గీకరించారో సులువుగా అర్థం చేసుకోండి.

పిన్‌కోడ్ అర్థం
పిన్‌కోడ్ అర్థం (pixabay)

ఏ దేశంలోనైనా, ఏ రాష్ట్ర మూలల్లోనైనా మీరు ఏ చిన్న నూలు పోగు ఆర్డర్ పెట్టినా మీదాకా అది చేరాలంటే పిన్ కోడ్ కావాలి. ఎన్నో కోట్ల ఆర్డర్లలో నుంచి ఒక వస్తువు మీదాకా తప్పులు దొర్లకుండా వస్తోంది అంటే దానికి కారణం పిన్‌కోడ్. ఉత్తరాలు రాసేవాళ్లకే ఇదివరకు పిన్‌కోడ్లు తెలిసేవి. ఆన్‌లైన్ షాపింగ్ పుణ్యమాని ప్రతి ఒక్కరికీ ఇవి గుర్తుంటున్నాయిప్పుడు. 

అసలు మీరు మీ అడ్రస్‌లో రాసే మిగతా వివరాలన్నింటివి విలువ 10 శాతం అయితే పిన్‌కోడ్ విలువ భాగానికి. ఈ ఆరంకెల సంఖ్య పోస్టల్, డెలివరీ సర్వీసులను ఎలా సులభతరం చేస్తుందో చూద్దాం. పిన్‌కోడ్‌లో ఉండే ఒక్కో అంకె విలువ తెల్సుకుందాం.

పిన్ (PIN)

పిన్ అంటే పోస్టల్ ఇండెక్స్ నంబర్. దాన్నే పిన్ కోడ్ అని అంటున్నాం. భారతీయ పోస్టల్ కోడ్ విధానంలో ఈ ఆరంకెల సంఖ్యకు ఎంతో ప్రాధాన్యత ఉంది. 1972, ఆగస్టు 15 న పిన్ కోడ్ విధానం మొదలైంది. 2022 నాటికి పిన్‌కోడ్ వ్యవస్థకు యాభై వసంతాలు పూర్తయ్యాయి. 

ఆరంకెలు ఏం చెబుతాయి?

ఒక పిన్ కోడ్ 123456 అనుకుందాం. దీన్ని బట్టి పిన్‌కోడ్ లో ఉండే ఒక్కో అంకె గురించి తెల్సుకుందాం.

పిన్‌కోడ్ లో మొదటి సంఖ్య 1 జోన్ సూచిస్తుంది. 2 సబ్ జోన్, 123 కలిపితే జిల్లా కోడ్, చివరి 456 జిల్లాలో పోస్ట్ ఆఫీసు కోడ్ సూచిస్తుంది.

మొదటి అంకె:

పిన్‌కోడ్ లో మొదటి అంకె జోన్ సూచిస్తుంది. మన దేశంలో మొత్తం 9 జోన్లున్నాయి. 8 రీజనల్ జోన్లయితే ఒకటేమో ఫంక్షనల్ జోన్. ఇది బారతీయ ఆర్మీకి సంబంధించింది. 1 నుంచి 9 అంకెలు.. పిన్‌కోడ్ లోని మొదటి సంఖ్య అయిన జోన్ సూచిస్తాయి. అంటే మనం ఉండే రాష్ట్రం ఏ జోన్ లోకి వస్తుందో దాని ఆధారంగా పిన్‌కోడ్ మొదటి అంకె ఉంటుంది. 

1,2 నార్త్ జోన్

3,4 వెస్ట్ జోన్

5,6 సౌత్ జోన్

7,8 ఈస్ట్

9 ఆర్మీ ఫంక్షనల్ జోన్

మన రెండు తెలుగు రాష్ట్రాలు సౌత్ జోన్ లోకే వస్తాయి. మన జోన్ అంకె 5. కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని పిన్‌కోడ్స్ అన్నీ 5తో మొదలవుతాయి. 

రెండో అంకె:

రాష్ట్రాలను ఉపవర్గీకరించి పిన్‌కోడ్ లోని రెండో నంబరును కేటాయించారు. అదే సబ్ జోన్ నంబర్. అలా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు ఆ సంఖ్య 50-53 దాకా కేటాయించారు.  

మూడో అంకె:

మొదటి రెండంకెలతో జోన్, రాష్ట్రం తెలిసిపోతుంది. ఈ రెండంకెలతో మూడో అంకె కలిస్తే జిల్లా తెలుస్తుందన్న మాట. 501,512,523…ఇలా మూడంకెల సంఖ్య బట్టి రాష్టం, జిల్లా చెప్పేయొచ్చు. ఉదాహరణకు 508 ఉంటే నల్గొండ, 504 ఉంటే ఆదిలాబాద్, 500 ఉంటే హైదరాబాద్ కోడ్లను సూచిస్తాయన్నమాట. 5 సౌత్ జోన్, 50 తెలంగాణ, 500.. మూడంకెలు కలిపి జిల్లా తెలుపుతాయి. 

చివరి మూడంకెలు:

పిన్‌కోడ్‌లో చివరి మూడంకెలు పోస్టాఫీస్ కోడ్‌కు సంబంధించినవి. నాలుగో అంకె ఆ జిల్లాల్లో పోస్టాఫీస్ ప్రాంతం లేదా సర్వీస్ కోడ్ సూచిస్తుంది. నాలుగో అంకె సున్నా ఉంటే అది జిల్లా కేంద్రాన్ని సూచిస్తుంది. ప్రాధాన్యత వారీగా జిల్లాలోని ప్రాంతాలకు ఈ నంబర్లు కేటాయిస్తారు. ఆ ప్రాంతాల్లోని పోస్టాఫీసులను చివరి రెండంకెలు తెలుపుతాయి. 

 

 

 

టాపిక్