Meal Timings : సమయానికి భోజనం చెయ్యట్లేదా? అయితే జాగ్రత్త-meal timings are very important to your health here is the reasons ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Meal Timings Are Very Important To Your Health Here Is The Reasons

Meal Timings : సమయానికి భోజనం చెయ్యట్లేదా? అయితే జాగ్రత్త

Geddam Vijaya Madhuri HT Telugu
Oct 13, 2022 02:18 PM IST

Eat on Time : ఆరోగ్యంగా ఉండాలంటే.. మంచి ఫుడ్ తీసుకోవడం, వ్యాయామం చేయడం ఎంత ముఖ్యమో.. సమయానికి భోజనం చేయడం కూడా అంతే ముఖ్యం. మీరు ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా.. వ్యాయామం చేసినా.. సరైన సమయానికి తినకపోతే.. మీకు ఆరోగ్య సమస్యలు తప్పవు అంటున్నారు నిపుణులు.

సరైన సమయానికి భోజనం చేయండి..
సరైన సమయానికి భోజనం చేయండి..

Eat on Time : మనలో చాలామంది సరైన సమయానికి ఫుడ్ తీసుకోరు. అసలు సమస్యలు ప్రారంభమయ్యేవి ఇక్కడి నుంచే. ఒకవేళ సమయానికి ఫుడ్ తీసుకోమని చెప్పినా.. ఏవో సాకులు చెప్తూ ఉంటారు. కానీ ఇలా టైమ్​కి ఫుడ్ తీసుకోకపోవడం వల్లనే అనవసరమైన రోగాలు వస్తాయంటున్నారు ఆహార నిపుణులు. ఎంత మంచి ఆహారం తీసుకున్నా.. కరెక్ట్ టైమ్​కి తినకపోతే.. అది వేస్టే అంటున్నారు.

అందుకే మీరు ఆరోగ్యంగా ఉండాలంటే.. ముందుగా చేయాల్సింది సమయానికి తినడం. మీరు తినే ఆహారంతో పాటు మీరు భోజనం చేసే సమయం కూడా చాలా ముఖ్యమని గుర్తించాలి. ఫుడ్ టైమ్​కి తినకపోతే కలిగే నష్టాలు ఏమిటో.. ఎందుకు సమయానికి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మీ శరీర చక్రాన్ని నియంత్రిస్తుంది

సరైన పోషకాలు, మంచి నిద్ర చక్రం, క్రమశిక్షణతో కూడిన భోజన సమయాలు మన నియంత్రణలో ఉంటే.. మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఈ అలవాట్ల ద్వారా శరీరం ఓ టైమ్​ టేబుల్​కి అలవాటు పడుతుంది. దీనివల్ల శరీరం ఎటువంటి డిస్టర్బ్ కాకుండా.. దాని పని అది చేస్తూ.. మీ పని మీరు చేసుకునేలా చేస్తుంది. లేదంటే అనవసరమైన రోగాలు వస్తాయి.

మెరుగైన జీవక్రియ

మీరు తీసుకునే ఆహారం.. తినే సమయం కూడా మీ జీవక్రియను నిర్ణయిస్తుంది. ఉదయం నిద్ర లేచినప్పుడు.. మన జీవక్రియ అత్యధికంగా ఉంటుంది. అందుకే ఉదయం నిద్ర లేచిన రెండు గంటలలోపు అల్పాహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమయంలో మీరు మీ శరీరానికి ఫుడ్ ఇవ్వకపోతే.. అది మీ శరీర జీవక్రియ రేటును కొనసాగించదు. దీనివల్ల రోజులు గడిచేకొద్దీ.. మీ జీవక్రియ మందగిస్తుంది.

టాక్సిన్లను బయటకు పంపిస్తుంది..

నిర్విషీకరణ ప్రక్రియ కాలేయం ద్వారా జరుగుతుంది. తినే ఆహారంలో.. అవసరం లేనివాటిని బయటకు పంపేందుకు ఇది ఒక ప్రధాన చర్య. మీరు రాత్రి 10 గంటలకు లేదా ఆ తర్వాత భోజనం చేశారనుకో.. అది మీ నిద్ర సమయాన్ని డిస్టర్బ్ చేస్తుంది. అంతే కాకుండా.. అది జీర్ణమవడం కోసం.. మీ శరీరంపై ఒత్తిడి తెస్తుంది. అంతేకాకుండా నిద్రపోతున్నప్పుడే కాలేయం నిర్విషీకరణ ప్రక్రియను చేస్తుంది. కాబట్టి సరైన నిద్ర లేకపోతే.. ఈ ప్రక్రియ సరిగ్గా జరగదు. దీనివల్ల మలబద్దకం వచ్చే అవకాశముంది.

అల్పాహారం, లంచ్, డిన్నర్ మధ్య గ్యాప్ ఎంత ఉండాలంటే..

భోజనం సరిగ్గా జీర్ణం కావడానికి 3-4 గంటలు పడుతుంది. అందువల్ల, రెండు భోజనాల మధ్య గ్యాప్ 4 గంటల కంటే ఎక్కువ ఉండకూడదు. ఇంతకంటే ఎక్కువ గ్యాప్ ఎసిడిటీకి దారి తీస్తుంది. భోజనం మధ్య మీరు తప్పనిసరిగా స్నాక్స్, పండ్లు తినాలి. మీరు మీ అల్పాహారం, భోజనం, రాత్రి భోజనం మధ్య కనీసం 2 స్నాక్స్ తీసుకోవాలి.

అల్పాహారం తీసుకోవడానికి ఇదే మంచి సమయం

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. లేచిన రెండు గంటలలోపు అల్పాహారం తీసుకోవాలి. అలా తీసుకోకపోతే.. మీ జీవక్రియ మందగిస్తుంది. కాబట్టి మీరు లేచిన తర్వాత ఎంత త్వరగా అల్పాహారం తీసుకుంటే.. అది మీ జీవక్రియకు, మొత్తం ఆరోగ్యానికి అంత మంచిది.

లంచ్ తినడానికి ఇదే మంచి సమయం

మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్య మన జీర్ణశక్తి చాలా బలంగా ఉంటుంది. ఈ సమయంలో శరీరం అత్యంత పోషకమైన భోజనాన్ని జీర్ణం చేస్తుంది. అంతేకాకుండా అన్ని పోషకాలను సరిగ్గా గ్రహించగలదు. కాబట్టి ఈ సమయంలో భోజనం తినేలా ప్లాన్ చేసుకోండి.

డిన్నర్​కి ఇదే బెస్ట్ టైమ్

లంచ్, డిన్నర్ సమయానికి మధ్య 4 గంటల గ్యాప్ తీసుకోండి. రాత్రి 8 గంటలలోపు మీ డిన్నర్‌ను ముగించేయాలి. మీ నిద్రకు, డిన్నర్​కు మధ్య 2 గంటల గ్యాప్ ఉండాలి. ఈ గ్యాప్ మంచి జీర్ణక్రియకు, మంచి నిద్రకు సహాయం చేస్తుంది.

సరైన సమయానికి భోజనం చేయకపోవడం వల్ల.. మీ జీర్ణక్రియ దెబ్బతింటుంది. పైగా ఇది జంక్ ఫుడ్ తినే కోరికను పెంచుతుంది. అంతేకాకుండా ఇది ఊబకాయం వంటి సమస్యలకు దారితీస్తుంది. మగ, ఆడ వారిలో కూడా గుండె సమస్యలు వచ్చే అవకాశముంది. ఆడవారిలో పిసిఒఎస్, పిసిఒడి, పీరియడ్స్ సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. కాబట్టి టైమ్​కి తినండి. మనం కష్టపడేది.. తిండి, మనుగడ కోసమే కాబట్టి.. సమయానికి భోజనం చేయండి. హెల్తీగా లైఫ్​ని లీడ్ చేయండి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్