Good friday: గుడ్ ఫ్రైడేకి ముందు రోజు రాత్రి ఏం జరిగింది? ప్రభు రాత్రి భోజనం అంటే ఏంటి?-maundy thursday significance what is the meaning of prabhu ratri bhojanam ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Maundy Thursday Significance, What Is The Meaning Of Prabhu Ratri Bhojanam

Good friday: గుడ్ ఫ్రైడేకి ముందు రోజు రాత్రి ఏం జరిగింది? ప్రభు రాత్రి భోజనం అంటే ఏంటి?

Gunti Soundarya HT Telugu
Mar 28, 2024 03:24 PM IST

Good friday: గుడ్ ఫ్రైడేకి ముందు రోజు రాత్రి యేసు క్రీస్తు తన పన్నెండు మంది శిష్యులకు విందు ఏర్పాటు చేస్తారు. ఆ విందు కార్యక్రమాన్ని ప్రభురాత్రి భోజనం అంటారు.

ప్రభు రాత్రి భోజనం అంటే ఏంటి?
ప్రభు రాత్రి భోజనం అంటే ఏంటి? (pixabay)

Good friday: బైబిల్ ప్రకారం యేసుక్రీస్తు వారిని రోమో సైనికులు శుక్రవారం రోజు శిలువ వేస్తారు. దానికి ముందు రోజు గురువారం యేసుక్రీస్తు తన శిష్యులైన 12 మందికి చివరిసారిగా వారికి విందు ఏర్పాటు చేస్తారు. ఆ రోజుని పవిత్ర గురువారం లేదా మౌండీ గురువారం అని పిలుస్తారు. మౌండి అనేది లాటిన్ పదం. దీని అర్థం ఆజ్ఞ.

నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగానే మీరు ఇతరులను ప్రేమించండి అని యేసుక్రీస్తు వారు తన శిష్యులకు బోధించారు. ప్రేమ, త్యాగం, విమోచన వంటి వాటిని వివరిస్తూ విందు ఏర్పాటు చేస్తారు. దీనినే ప్రభువు బల్ల సంస్కారం లేదా ప్రభు రాత్రి భోజనం లేదా సంస్కారపు విందు అని అంటారు.

గుడ్ ఫ్రైడే ముందు రోజు రాత్రి అందరూ చర్చికి వెళ్లి ప్రార్థనలు చేస్తారు. యేసుక్రీస్తు వారు తన చివరి ఘడియలలో చేసిన బోధనలు గుర్తు చేసుకుంటారు. ఆ రోజు ప్రత్యేక ఆచారాలు పాటిస్తారు. యేసు తన అనుచరులకు ఒకరినొకరు ప్రేమించాలని బోధిస్తాడు. ప్రభు రాత్రి భోజనం చేయడానికి ముందుగా యేసుక్రీస్తు తన 12 మంది శిష్యుల పాదాలను నీటితో శుద్ధి చేస్తారు. ఇదే ఆచారాన్ని అన్ని చర్చిల్లో పాటిస్తున్నారు.

ప్రభు రాత్రి భోజనం అంటే ఏంటి?

ఆరాధన కార్యక్రమం అయిన తర్వాత క్రైస్తవ మత పెద్దలు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. బాప్తిసం తీసుకున్న వారికి మాత్రమే ప్రభు రాత్రి భోజనంలో పాల్గొనే అర్హత ఉంటుంది. మత పెద్దలు వారి పాదాలు నీటితో శుద్ది చేస్తారు. తర్వాత రొట్టె ద్రాక్షా రసాన్ని ఇస్తారు.

రొట్టె యేసు శరీరాన్ని, ద్రాక్షా రసం ఆయన రక్తాన్ని సూచిస్తుంది. శిలువ వేయడానికి ముందు రోజు రాత్రి యేసుక్రీస్తు తన శిష్యులతో ఈ విందులో పాల్గొన్నారు. ద్రాక్షరసం ఎత్తుకొని దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది మీ కొరకు విడువబడిన నా శరీరం, ఇది అనేకుల కొరకు చిందించిన నా రక్తం అని చెప్పి ప్రార్థన చేస్తారు. అనంతరం వాటిని తన శిష్యులకు ఇచ్చారు.

బాప్తిసం తీసుకున్న వారు పాప మార్గంలో జీవించకూడదు. క్రమం తప్పకుండా చర్చికి వెళ్లి యేసుక్రీస్తు బోధనలు వినాలి. ఆయన చూపించిన మార్గంలో నడవాలి. పాప విషయాలకు దూరంగా ఉండాలి. ప్రభు రాత్రి భోజనం క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల యేసుక్రీస్తు మన కొరకు చేసిన త్యాగాన్ని ప్రజలందరి కొరకు తనను తాను బలి అర్పడగా అర్పించుకున్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాము. సంస్కారపు విందులో పాల్గొనే క్రైస్తవులు ఆరోజు ఉపవాసం పాటిస్తారు.

ప్రభురాత్రి భోజనం తీసుకుని తమ కోసం యేసయ్య పడిన కష్టాలను తలుచుకుంటారు. కీర్తనలు పాడుతూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. పాపము లేకుండా జీవించమని చెప్తూ ఈ సంస్కారపు విందు కార్యక్రమం నిర్వహిస్తారు. ఇది తీసుకున్నప్పుడల్లా మీరు నన్ను జ్ఞాపకము చేసుకొనుడి అని ప్రభువు తన శిష్యులకు చెప్పారు. మరుసటి రోజు తనని శిలువ శిక్ష వేస్తారని యేసు క్రీస్తు వారికి ముందుగానే తెలుసు.

ఇది జరిగిన తర్వాత పన్నెండు మంది శిష్యులలో ఒకడైన ఇస్కారియోతు రోమా సైనికుల దగ్గరకు వెళ్ళి యేసు క్రీస్తు గురించి చెప్తాడు. తెల్లవారు జామున గెత్సమనే తోటలో ప్రార్థన చేసుకుంటున్న యేసు వద్దకు సైనికులు వచ్చి ఆయన్ని తీసుకుని వెళతారు. ఆరోజు శుక్రవారం. ప్రజలను పాపాల నుంచి రక్షించడం కోసం తనని తాను బలిగా అర్పించుకున్న రోజు గుడ్ ఫ్రైడే. ఇది జరిగిన తర్వాత రోమా రాజు తాను చేసిన తప్పు తెలుసుకుంటాడు. దేవుని బిడ్డను శిక్షించానని పశ్చాత్తాపపడతాడు.

టాపిక్