Masala Semiya: బ్రేక్ ఫాస్ట్‌లో మసాలా సేమియా వండి చూడండి, ప్రతి ఒక్కరూ లాగించేస్తారు-masala semiya recipe in telugu know how to make this breakfast ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Masala Semiya: బ్రేక్ ఫాస్ట్‌లో మసాలా సేమియా వండి చూడండి, ప్రతి ఒక్కరూ లాగించేస్తారు

Masala Semiya: బ్రేక్ ఫాస్ట్‌లో మసాలా సేమియా వండి చూడండి, ప్రతి ఒక్కరూ లాగించేస్తారు

Haritha Chappa HT Telugu
Apr 06, 2024 06:00 AM IST

Masala Semiya: తీయటి సేమియా తెలుసు, ఉప్మా సేమియా కూడా తెలుసు. ఒకసారి మసాలా సేమియా చేసి చూడండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది.

మసాలా సేమియా రెసిపీ
మసాలా సేమియా రెసిపీ (youtube)

Masala Semiya: బ్రేక్ ఫాస్ట్‌లో కొత్త కొత్త వంటకాలు రుచి చూడాలనుకునే వారికి ఈ మసాలా సేమియా మంచి ఆప్షన్. దీన్ని చేయడం చాలా సులువు. కేవలం అరగంటలోనే మసాలా సేమియా రెడీ అయిపోతుంది. పిల్లలకు కూడా ఇది నచ్చుతుంది. కాస్త స్పైసీగా చేసుకుంటే పెద్దలకు కూడా నచ్చడం ఖాయం. దీన్ని చేయడానికి చాలా తక్కువ సమయమే పడుతుంది.. కాబట్టి అప్పటికప్పుడు చేసుకోవచ్చు. మసాలా సేమియా రెసిపీ ఎలాగో ఇప్పుడు చూద్దాం.

మసాలా సేమియా రెసిపీకి కావలసిన పదార్థాలు

సేమియా - రెండు కప్పులు

అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను

టమోటో - ఒకటి

పచ్చిమిర్చి - మూడు

పచ్చి బఠానీలు - అర కప్పు

నూనె - తగినంత

ఉప్పు - రుచికి సరిపడా

ఉల్లిపాయ - ఒకటి

మసాలా సేమియా రెసిపీ

1. ఒక గిన్నెలో సేమియాను వేసి... ఆ సేమియా నిండేలా నీటిని కూడా వేసి స్టవ్ మీద పెట్టి ఉడికించాలి.

2. సేమియా మెత్తగా ఉడికాక వాటిని వడకట్టి తీసి పక్కన పెట్టుకోవాలి.

3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

4. నూనె వేడెక్కాక సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేయాలి.

5. ఆ ఉల్లిపాయలు రంగు మారేదాకా వేయించాలి.

6. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు తీసి వేయించుకోవాలి.

7. తర్వాత సన్నగా తరిగిన టమోటాలను వేసి బాగా మగ్గించాలి. మూత పెడితే టమాటోలు ఇగురులాగా మగ్గుతాయి.

8. టమోటాలు మగ్గాక పచ్చి బఠానీలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి.

9. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. బఠానీలు ఉడకడానికి కాస్త సమయం పడుతుంది.

10. పది నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి. ఆ తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న సేమియాను వేసి కలుపుకోవాలి.

11. ఇది పొడిపొడిగా వచ్చేలా కలుపుకోవాలి. అంతే మసాలా సేమియా రెడీ అయినట్టే.

12. దీన్ని నేరుగా తిన్నా టేస్టీగా ఉంటుంది. లేదా ఏదైనా చట్నీతో తిన్నా బాగుంటుంది.

13. స్పైసీగా కావాలనుకునే వారు పచ్చిమిర్చిని ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది.

14. పిల్లలు కారాన్ని తినలేరు కాబట్టి వారికి ఒక రెండు పచ్చిమిర్చి వేస్తే చాలు.

15. దీనిపైన నెయ్యి వేసిన అదిరిపోతుంది. జీడిపప్పులు కూడా జత చేసుకోవచ్చు.

త్వరగా అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ కావాలనుకుంటే ఈ మసాలా సేమియాను ట్రై చేయండి. ఉప్మా బోరు కొట్టిన వాళ్ళు ఇలాంటి సేమియాలను తినడం ఉత్తమం. లంచ్ వండడానికి సమయం లేనప్పుడు ఈ సేమియాను లంచ్ బాక్స్ రెసిపీ గా కూడా మార్చుకోవచ్చు. సాయంత్రం పూట ఆకలి తీర్చే ఆహారంగా కూడా ఈ మసాలా సేమియా ఉపయోగపడుతుంది.

Whats_app_banner