Gokarna Tour: మంగుళూరు టూ గోకర్ణ వయా ఉడిపి, కొల్లూరు, మురుదేశ్వర్.. మా కోస్టల్ కర్ణాటక యాత్ర సాగిందిలా
Gokarna Tour: కోస్టల్ కర్ణాటక యాత్రలో భాగంగా మంగుళూరు నుంచి గోకర్ణ వరకు, వయా ఉడిపి, కొల్లూరు, మురుదేశ్వర్, ధర్మస్థల మీదుగా సాగిన ఆధ్యాత్మిక యాత్రను ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ సూర్యనారాయణ హిందుస్తాన్ టైమ్స్‌తో తన మాటల్లో పంచుకున్నారు.
అరేబియా సమద్రతీరంలోని కర్ణాటక ప్రాంతం ఎన్నో ఆలయాలకు ప్రసిద్ధి. కోస్టల్ కర్ణాటక మొత్తం కవర్ చేస్తూ అక్కడ ఉన్నక్షేత్రాలను దర్శించుకోవాలన్నది దాదాపు ఒక దశాబ్దం నుంచి మా మదిలో మెదులుతున్న కల. రెండు సార్లు ప్లాన్ వేసి, ఫ్లైట్ టిక్కెట్ల తో సహా అంతా బుక్ అయిన తర్వాత కూడా కొన్ని అడ్డంకులు ఎదురై ఆగిపోవాల్సి వచ్చింది. అయినా పట్టువిడవకుండా ప్రయత్నించాం. మా కల నెరవేరింది. వారం రోజుల పాటు సాగిన సుదీర్ఘమైన మా యాత్రను మంగుళూరు మంగళ దేవితో మొదలుపెట్టి... గోకర్ణలోని మహాబలేశ్వరుడి స్పర్శ దర్శనంతో ముగించాం.
మా యాత్ర సాగిందిలా..
విశాఖపట్నం నుంచి విమానంలో మంగుళూరు చేరుకున్నాం. అక్కడ మంగళదేవి అమ్మవారిని దర్శించుకున్నాం. నగరదేవత అయిన అమ్మవారి పేరు మీదే ఆ ఊరికి ఆ పేరు వచ్చింది. సువిశాలమైన ఆలయ ప్రాంగణం అంత్యంత ప్రశాంతంగా ఉంది. అమ్మవారి నిండైన రూపం చూడటానికి రెండు కళ్లు చాలవు అన్నట్టుగా ఉంది. మంగుళూరు వెళ్తే తప్పనిసరిగా అమ్మను దర్శించుకోవాల్సిందే.
ఆ తర్వాత అక్కడ నుంచి ధర్మస్థల మంజునాథుడిని దర్శించుకోవడానికి బయలుదేరాం. మంగుళూరు బస్టాండ్ నుంచి ప్రతి 40 నిమిషాలకు ధర్మస్థలకి ఒక బస్సు ఉంది. మేం బయలుదేరేటప్పటికి మధ్యాహ్నం 12 దాటిపోయింది. ధర్మస్థల చేరుకునేటప్పటికి మధ్యాహ్నం 2 అయింది. ధర్మస్థలలో మధ్యాహ్న దర్శనం 2 గంటలకు పూర్తయిపోతుంది. తిరిగి 5 గంటలకే ఆలయం తెరుస్తారు.
దాంతో అక్కడికి దగ్గరలో ఉన్న రామతీర్ధానికి వెళ్లాం. అది అద్భుతమైన ఆలయం, నిర్మాణ శైలి ముందు నుంచి కర్ణాటక శైలిలో కనిపించినా, వెనుక నుంచి చూస్తే మాత్రం పూరీ ఆలయాన్ని తలపిస్తుంది. ఆలయం లోపల నవదుర్గలు, నవగ్రహాల విగ్రహాలను ప్రతిష్టించారు.
అక్కడ దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత మంజునాథ ఆలయానికి వెళ్లాం. ఆ రోజు అదివారం కావడంతో విపరీతమైన రద్దీ ఉంది. ఆలయ నిర్మాణ శైలి అంతా కూడా కేరళ ఆలయాలను పోలి ఉంది. మంజునాథుడి రూపం అత్యద్భుతంగా ఉంది, పక్కనే అమ్మవారి ఆలయం కూడా ఉంది. ఆరున్నరకు తిరిగి మేం మంగుళూరుకు బయలుదేరిపోయాం. మంగుళూరు చేరే సరికి రాత్రి 8.30 అయింది. ఆ సమయానికే మంగుళూరు సగరం మొత్తం సర్దుమణిగిపోయినట్టుగా అనిపించింది.
ఉడిపిలో కృష్ణయ్య దర్శనం, బీచ్ సందర్శన
మర్నాడు ఉదయం మేం క్యాబ్ బుక్ చేసుకుని ఉడిపికి బయలుదేరాం. ఉడిపి చేరుకునేటప్పటికి 11 గంటలు అయింది, అప్పుడు మేం మాల్పే బీచ్ కి చేరుకుని అక్కడ నుంచి సెయింట్ మేరిస్ ఐలాండ్ కి వెళ్లాం. తీరం నుంచి సముద్రంలో 7 కిలోమీటర్ల లోపలికి ఈ దీవి ఉంటుంది. ఆ దీవి 6 కోట్ల సంత్సరాల క్రితం అగ్నిశిలలతో ఏర్పడిందని చెబుతారు. అక్కడి జలాలు చాలా స్వచ్ఛంగా ఉంటాయి. అత్యంత అహ్లాదకరమైన ఈ దీవిలో ఎంతసేపు గడిపినా సమయం ఇట్టే గడిచిపోయినట్టుగా అనిపిస్తుంది. ఆ తర్వాత మాల్పే బీచ్ లో పారాసైలింగ్ కూడా చేశాం. అదొక అనిర్వచనీయమైన అనుభూతి అనే చెప్పాలి.
సాయంత్రం మేం ఉడిపి శ్రీకృష్ణుడి దర్శనానికి బయలుదేరాం. మేం వెళ్లిన సమయానికి స్వామి రథయాత్రకు అంతా సిద్ధం చేస్తున్నారు. రాత్రి ఏడు గంటలకు యాత్ర మొదలైంది. కన్నుల పండుగలా సాగే కన్నయ్య రథయాత్రలో పాల్గొనే భాగ్యం మాకు దక్కింది. ఆ తర్వాత చిన్ని కృష్ణయ్యను దర్శనం చేసుకున్నాం. కాళింగమర్దన అవతారంలో బాలకృష్ణుడు మాకు దర్శనమిచ్చాడు. అది అత్యద్భుతమైన అనుభూతి. ఆ తర్వాత స్వామి సన్నిధిలోనే అన్నప్రసాదాన్ని స్వీకరించాం.
శృంగేరి సందర్శన
తర్వాత రోజు మా ప్రయాణం శృంగేరి కి. ఘాట్ రోడ్ లో ప్రయాణం కన్నుల పండుగే అయింది. దేశం మొత్తం మీద అత్యంత శక్తివంతమైన పీఠాల్లో శృంగేరీ పీఠం ఒకటి. ఆది శంకరాచార్యులు స్థాపించిన శృంగేరీ పీఠంలో అమ్మ శారదాంబ కొలువై ఉంది. బంగారు కాంతులతో దేదీప్యమానంగా వెలిపోయే అమ్మ రూపం చూసి తరించాల్సిందే తప్ప, మాటల్లో వర్ణించలేం.
ఆపక్కనే అద్భుతమైన నిర్మాణశైలిలో చంద్రమౌళీశ్వర ఆలయం ఉంది. అదే ప్రాంగణంలో సుబ్రహ్మణేశ్వర ఆలయం ఉంది. ఆలయం నుంచి తుంగ నది మీదగా వేసిన వంతెను దాటితే నృసింహవనం వస్తుంది. అది పీఠాధిపతులు, ఇతర స్వామీజీలు నివాసం ఉండే చోటు. ఆ ప్రాంతం కూడా అత్యద్భుతంగా ఉంది. గతంలో పీఠాధిపతులుగా చేసి వాళ్ల విగ్రహాలు అక్కడ దర్శనమిస్తాయి. తుంగనదిలో చేపలు చాలా చక్కగా కనిపిస్తాయి. అవి అమ్మవారి ప్రతిరూపాలుగా భావించి భక్తులు వాటి ఆహారం అందిస్తుంటారు.
కొల్లూరు మూకాంబికా ఆలయ దర్శనం
మరుసటి రోజు మేం ఉడిపి నుంచి మురుదేశ్వర్ కి బయలుదేరాం. దారిలో అనగుడి గణపతి ఆలయాన్ని సందర్శించాం. అత్యద్భుతంగా ఉంది ఆలయం. వెండి కాంతులతో మెరిసిపోయే వినాయకుడిని చూడటానికి రెండు కళ్లు సరిపోవనిపించింది. అలయంలోని టేకు మండపం కనువిందు చేస్తుంది.
అనగుడి విఘ్ననాయకుడి దర్శనం తర్వాత కొల్లూరు మూకాంబికా అలయానికి బయలుదేరాం. అదిశంకరాచార్యులు తనకు దర్శనమిచ్చిన అమ్మవారిని తనతో పాటు కేరళకు రావాలని కోరారట. అయితే అమ్మ అందుకు ఒక షరతు విధించింది, తాను వెనుకే వస్తానని, కానీ శంకరాచార్యులు వెనక్కి తిరిగి చూడకూడదని, అలా చూస్తే తాను ఆ ప్రాంతంలోనే స్థిరంగా ఉండిపోతానని చెప్పారట.
ఆ మాట ప్రకారమే ముందు శంకరాచార్యులు నడుస్తుంటే, అమ్మ ఆయన్ని అనుసరించింది, ఈ ప్రాంతానికి చేరుకునేటప్పటికి అమ్మ కాలి అందెల చప్పుడు ఆగిపోయిందంట, శంకరాచార్యులు వెనక్కి తిరిగి చూశారంట, దీంతో అమ్మకు ఇచ్చిన మాట తప్పినట్టైంది, అమ్మ తనను అక్కడే ప్రతిష్ఠించమని శంకరాచార్యులకు చెప్పింది.
ఆయన శ్రీచక్రంతో పాటుగా అమ్మ పంచలోహ విగ్రహం అక్కడ ప్రతిష్టించారు. పురాణాల ప్రకారం అయితే మూకాసురుడు అనే రాక్షసుడిని పార్వతిదేవి సంహరించి, ఇక్కడ మూకాంబిగా వెలిసిందని చెబుతారు. పార్వతి ధైర్యాన్ని మెచ్చుకుని శివుడు, ఇక్కడ తన కాలిమడమతో శ్రీచక్రం ప్రతిష్టించారని చెబుతారు.
ఆలయంలో పంచముఖ గణపతి విగ్రహం కూడా అద్భుతంగా ఉంది. అమ్మవారితో పాటుగా ఇక్కడ శివలింగం కొలువై ఉంది. ఆలయంలో కాలభైరవ విగ్రహం కూడా ఉంది, కర్ణాటక, కేరళ ప్రజలు మూకాంబికను శక్తిస్వరూపిణిగా భావించి పూజలు చేస్తారు. మేం వెళ్లిన రోజున సమయంలో పెద్ద ఎత్తున చండీ హోమాలు చేస్తున్నారు. ఉదయం 11 గంటల సమయంలో ఆలయ ప్రాంగణంలోల అమ్మవారి ఊరిగేంపు కన్నులపండుగగా సాగింది. ఈ ఆలయాన్ని ఒక్కసారైనా చూసి తరించాల్సిందే.
మురుదేశ్వర్ లో మహా శివుడి దర్శనం
కొల్లూరు మూకాంబికాదేవి దర్శనం పూర్తయిన తర్వాత మేం మురుదేశ్వర్ కి బయలుదేరాం. అక్కడికి చేరుకునేటప్పటికి 1 గంట అయింది. సముద్రతీరంలో 20 అంతస్తులు ఎత్తైన రాజగోపురం... ఆ వెనుకే 123 అడుగుల ఎత్తైన మహశివుడి విగ్రహం... ఆ అపురూప దృశ్యాలు నిజంగానే నయనానందకరమే.
ఈ ఆలయానికి చాలా గొప్ప పౌరాణిక విశిష్టత ఉంది. రావణాసురుడు ఆత్మలింగం కోసం తపస్సు చేసి దానిని లంకకు తీసుకొచ్చే క్రమంలో మార్గమధ్యలో సంధ్యావందనం చేయడం కోసం బ్రహ్మణ బాలుడి రూపంలో ఉన్న గణపతికి ఇచ్చి పట్టుకొమ్మని చెబుతాడు.
ఆ బాలుడి రూపంలో ఉన్న గణపతి తాను ఎక్కువసేపు మోయలేనని, తనకు బరువుగా అనిపిస్తే మూడు సార్లు పిలుస్తానని, ఈ లోపు రాకపోతే కిందపెట్టేస్తానని చెబుతాడు. రావణుడు సంధ్యావందనం చేస్తుండగా ఆ బాలుడు మూడుసార్లు పిలుస్తాడు, రావణుడు పరిగెత్తుకుని వచ్చేసరికి లింగాన్ని కింద పెట్టేస్తాడు. ఆ ప్రాంతమే గోకర్ణం.
అయితే రావణాసుడు అక్కడ పాతుకుపోయిన ఆత్మలింగాన్ని బయటకు తీసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తాడు, ఆ క్రమంలో ఐదు చిన్న చిన్న భాగాలు వేరు వేరు ప్రాంతాల్లో పడ్డాయి, అలా పడ్డ వాటిలో మురుదేశ్వర్ ఒకటి.
రాజగోపురం పైకి వెళ్లి అక్కడ నుంచి వ్యూ మొత్తం చూసేందుకు లిఫ్ట్ సౌకర్యం ఉంది. ఆ పై నుంచి మురుదేశ్వర్ తీరప్రాంతం అందాలు చూస్తే అద్భుతమే. గోపురానికి ఎదురుగా కొలువైన త్రినేత్రుడు, సూర్యకిరణాలు పడి స్వర్ణకాంతులతో వెలిగిపోతూంటాడు.
గోపురం మీద నుంచి పరమశివుడిని దర్శించుకోవడం నిజంగా కమనీయమే. ఆ తర్వాత కిందికి వచ్చి అసలైన ఆత్మలింగం నుంచి విడువడి మురుదేశ్వర్ లో కొలువైన శంకరుడిని దర్శించుకున్నాం.
అక్కడే ఆత్మలింగం కథను తెలియజేసే మ్యూజియం కూడా ఉంది. మురుదేశ్వర్ ఆలయ ప్రాంగణం నుంచి సూర్యాస్తమయం చూసే భాగ్యం మాకు కలిగింది. నారింజ రంగులో వెలిగిపోతున్న భానుడి కిరణాలు పడి అరేబియా సముద్రం పసిడి ముద్దగా మెరిసిపోయే అద్భతమైన దృశ్యాన్ని మా మదిలో పదిలంగా భద్రంగా దాచుకున్నాం.
గోకర్ణ యాత్ర
మరుసటి రోజు ఉదయం మేం మా యాత్రలో అత్యంత ముఖ్యమైన గోకర్ణం బయలుదేరాం. మార్గమధ్యలో ఇడగుంజి గణపతిని దర్శించుకున్నాం. ఆయన చాలా శక్తిమంతమైన దేవుడని ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు నమ్ముతారు. అది కూడా చాలా పురాతనమైన ఆలయం. తప్పనిసరిగా చూడాల్సిన ఆలయం.
హనోవర్ బ్యాక్ వాటర్స్ లో బోటింగ్ చేసి, శరావతి మాంగ్రూవ్ ఫారెస్ట్ లో ఉడెన్ బ్రిడ్జ్ మీద కాసేపు తిరుగాడి మధ్యాహ్నానికి గోకర్ణం చేరుకున్నాం. గోకర్ణలో ఆలయం సాయంత్రం ఐదు గంటలకు తెరుస్తారని చెప్పారు. మేం ప్రదోషకాల దర్శనం చేసుకోవాలనుకున్నాం.
ఇక్కడి ఆత్మలింగం స్పర్శ దర్శనం, సర్వ పాప వినాశనం. వారం మధ్యలో అయినా సరే స్వామి దర్శనానికి జనం పోటెత్తారు. ముందుగా సముద్రంలో కాళ్లు, చేతులు కడిగి గణపతి ఆలయాన్ని సందర్శించుకోవాలి. పురాణ గాధల ప్రకారం గణపతి, ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తారు. దాంతో కోపగించుకున్న రావణుడు గణపతి తల మీద మొట్టికాయ వేస్తాడు. ఆ శొట్ట కూడా గణపతి విగ్రహం మీద కనిపిస్తుందంట.
ప్రపంచం మొత్తం మీద ఏకైక ఆత్మలింగం గోకర్ణంలో మహాబలేశర్వుడి రూపంలో వెలసింది. ఆ మహాబలేశ్వరుడిని చేతులతో తాకి, అక్కడి పవిత్రజలాలతో కళ్లు తుడుచుకునే గొప్ప అవకాశం దక్కాలంటే నిజంగానే ఆ దేవదేవుడి కరుణ ఉండాల్సిందే. కోరిన వరాలిచ్చే ఆ శంకరుడు మా మీద దయచూపి మాకు ఆ అవకాశం ఇచ్చాడు. స్వామి ఆలయానికి వెనుక వైపు తామ్రగౌరి రూపంలో అమ్మవారు వెలిశారు. ఆ అమ్మను కూడా దర్శించుకున్నాం. ఆ రాత్రి స్వామి అన్న ప్రసాదాన్ని స్వీకరించి తరించాం.
విద్యార్థుల ఆలయ సందర్శన
కర్ణాటకలో మేం గమనించిన ప్రత్యేక విషయం ఏమిటంటే, డిసెంబర్ నెలలో స్కూల్ పిల్లల్ని ఫీల్డ్ ట్రిప్ పేరుతో దేవాలయాలకు తీసుకొస్తున్నారు. ప్రైవేట్, గవర్నమెంట్ అన్న తేడా లేకుండా అన్ని స్కూల్స్ వాళ్లు కూడా ఒక నాలుగైదు దేవాలయాలతో ఒక ట్రిప్ ప్లాన్ చేసి తీసుకొస్తున్నారు.
కర్ణాటకలోని మేం గమనించిన మరొక గొప్ప విషయం ప్రతి ఆలయంలో మధాహ్నం, రాత్రి కూడా అన్నప్రసాద వితరణ జరుగుతోంది. ఎంత మంది వచ్చినా లేదనకుండా అన్నదానం చేస్తున్నారు. స్కూల్ పిల్లలకు మధ్యాహ్నం, రాత్రి భోజనాలుగా ఆలయాల్లోని అన్నప్రసాదాలే పెట్టిస్తున్నారు ఉపాధ్యాయులు.
అలాగే అలయాలకు సంబంధించిన సత్రాలు, మఠాల్లో పిల్లలకు బస ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది నిజంగానే చాలా అద్భుతం అనిపించింది. మేం ఉడిపి, గోకర్ణ రెండు చోట్లా కూడా వందల మంది పిల్లలతో కలిసే అన్నప్రసాదం స్వీకరించాం. అది నిజంగానే ఒక గొప్ప అనుభూతి.
గోకర్ణలో ఎన్నో అందమైన బీచ్ లు కూడా ఉన్నాయి, వాటిలో కొన్ని చూసుకుని, ఆ మహాబలేశ్వరుడిని మనసులో తలుచుకుని పునఃదర్శన ప్రాప్తిరస్తు అనుకుంటూ తిరుగు ప్రయాణం అయ్యాం. అలా మా కోస్టల్ కర్ణాటక టూర్ పూర్తయింది.
- సూర్య నారాయణ, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్
సంబంధిత కథనం