Health Checkups: 30లు, 40లు, 50ల్లో ఉన్న వారు ఎలాంటి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలంటే..-mandatory health checkups to do in different ages ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Health Checkups: 30లు, 40లు, 50ల్లో ఉన్న వారు ఎలాంటి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలంటే..

Health Checkups: 30లు, 40లు, 50ల్లో ఉన్న వారు ఎలాంటి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలంటే..

Health Checkups: వయసును బట్టి చేయించుకోవాల్సిన ఆరోగ్య పరీక్షలు కొన్ని ఉంటాయి. వాటిని సరైన సమయంలో, క్రమం తప్పకుండా చేయించుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చు. అవేంటో చూసేయండి.

తప్పకుండా చేయించుకోవాల్సిన ఆరోగ్య పరీక్షలు (pexels)

కౌమారం, నవ యవ్వనంలో ఉన్నప్పుడు మనం ఎంతో శక్తివంతంగా ఉంటాం. చక్కగా ఆటలు ఆడతాం. కొండలెక్కుతాం. ప్రయాణాలు చేస్తాం. బిరియానీలు, కూల్‌ డ్రింకులు, జంక్ ఫుడ్ అనే తేడా లేకుండా దేన్నిబడితే దాన్ని తినేస్తాం. అయినా మనకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. మనలో జీవక్రియ సవ్యంగా కొనసాగుతుండటమే అందుకు కారణం. అందుకే మనం అప్పుడు ఎలాంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలూ లేకుండా దృఢంగా ఉంటాం. అయితే వయసు పెరిగే కొద్దీ మనలో మెల్లి మెల్లిగా ఆరోగ్య సమస్యలు రావడం మొదలవుతుంది. ముఖ్యంగా మనలో కాల్షియం తగ్గడం మొదలవుతుంది. కాళ్లు, మోకాళ్లు, నడుము, మెడ లాంటివి క్రమ క్రమంగా నొప్పులు రావడం ప్రారంభం అవుతుంది. ఒత్తిడితో కూడిన జీవన విధానం ఉన్నట్లయితే థైరాయిడ్, బీపీ, నిద్రలేమి లాంటి సమస్యలు ఒక్కొక్కటిగా ఎదురవుతుంటాయి. మరి 30లు, 40లు, 50లు దాటిన స్త్రీ, పురుషులు ఎలాంటి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

30లు దాటిన వారు :

ముప్ఫై సంవత్సరాలు దాటిన మహిళలు తప్పకుండా మూడేళ్లకోసారైనా పాప్‌స్మియర్‌ టెస్ట్‌ చేయించుకోవాలి. సర్వైకల్‌ క్యాన్సర్‌కి సంబంధించిన పరీక్ష అది. అలాగే 30 సంవత్సరాలు దాటిన తర్వాత స్త్రీ పురుషులు ఇద్దరూ ప్రతి ఆరునెలలకోసారి మధుమేహం, బీపీ, కొలస్ట్రాల్‌ పరీక్షలను చేయించుకోవాలి. ఎక్కువ బరువు ఉండి, ఊబకాయంతో ఉంటేగనుక ఈ పరీక్షలను అస్సలు మిస్‌ చేయవద్దు. ఒకవేళ అధిక బరువు సమస్య ఉన్నా డైటీషియన్‌ని సంప్రదించి దాన్ని నియంత్రణలో ఉంచుకునేందుకు ప్రయత్నించండి.

40లు దాటిన వారు :

అమెరికన్‌ క్యాన్సర్‌ సొసైటీ చెబుతున్నదాని ప్రకారం.. 40 ఏళ్ల తర్వాత పురుషులు పురీషనాళం, స్త్రీలు గర్భాశయాలకు సంబంధించిన క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ ప్రతి రెండేళ్లకోసారి చేయించుకోవాలి. మహిళలు బ్రెస్ట్‌ క్యాన్సర్‌ నిర్ధారణ కోసం మ్యామోగ్రాం పరీక్షలను ప్రతి రెండేళ్లకోసారి చేయించుకోవాలి. అదే 45 ఏళ్ల దాటిన మహిళలు ఈ పరీక్షను ప్రతి ఏడాదికి ఒకసారి చేయించుకోవాలి. అలాగే మహిళలూ, పురుషులూ ఏడాదికోసారి కంటి పరీక్షలు, ఫుల్‌ బాడీ చెకప్స్ చేయించుకోవడం మంచిది. కుటుంబంలో బీపీ, చక్కెర వ్యాధులు ఉన్న చరిత్ర ఉంటేగనుక ఈ పరీక్షలు ప్రతి ఆరు నెలలకు ఒకసారి చేయించుకోవాలి.

50లు దాటిన వారు :

50లు దాటిన తర్వాత స్త్రీలు మెనోపాజ్‌ దశలో ఉంటారు. దీంతో వీరికి బోలు ఎముకల సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి కాల్షియం, విటమిన్‌ డీ పరీక్షలు చేయించుకోవాలి. అలాగే 50లు 80ల మధ్య ఉన్న స్త్రీ పురుషులు ఏటా లంగ్‌ క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ చేయించుకోవాలి. ధూమపానం అలవాటు ఉన్న వారైతే ఈ పరీక్షలు కచ్చితంగా చేయించుకుంటూ ఉండాలి. కుటుంబంలో ఎవరికైనా ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ ఉన్న చరిత్ర ఉంటే పురుషులు ఏటా ఈ పరీక్ష చేయించుకోవాలి. బీపీ, షుగర్‌, కొలెస్ట్రాల్‌లను ప్రతి ఆరు నెలలకూ చేయించుకోవాలి.