ఒకే వ్యక్తికి ఒకేసారి కొవిడ్, మంకీపాక్స్, హెచ్​ఐవి పాజిటివ్.. ఏమైందంటే..-man tested positive for covid and hiv and monkey pox at once in italy ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Man Tested Positive For Covid And Hiv And Monkey Pox At Once In Italy

ఒకే వ్యక్తికి ఒకేసారి కొవిడ్, మంకీపాక్స్, హెచ్​ఐవి పాజిటివ్.. ఏమైందంటే..

Geddam Vijaya Madhuri HT Telugu
Aug 26, 2022 10:26 AM IST

First Ever Case : వైద్య చరిత్రలో కని విని ఎరుగుని సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తికి వైద్యులు కొవిడ్, మంకీపాక్స్, హెచ్​ఐవి టెస్ట్​లు చేయగా.. రిజల్ట్స్ చూసి అందరూ షాక్​ అయ్యారు. ఎందుకంటే అన్నింట్లోనూ పాజిటివ్ వచ్చింది కాబట్టి. ఓ వ్యక్తికి ఒకేసారి అన్ని పాజిటివ్ రావడం ఇదే తొలిసారని శాస్త్రవేత్తలు నివేదించారు.

ఒకే వ్యక్తికి అన్ని వైరస్లు ఒకేసారి సోకాయి
ఒకే వ్యక్తికి అన్ని వైరస్లు ఒకేసారి సోకాయి

First Ever Case : ఇటలీకి చెందిన ఓ వ్యక్తికి కొవిడ్ - 19, మంకీపాక్స్, హెచ్​ఐవి -1 కి ఒకేసారి పరీక్షలు చేయగా.. అన్నింట్లోనూ పాజిటివ్​ వచ్చాయని.. ఇలా అన్ని పాజిటివ్​ వచ్చిన మొదటి కేసు ఇదేనని శాస్త్రవేత్తలు నివేదించారు. అసలు ఆ వ్యక్తి ఏమి చేశాడు.. ఎందుకు అన్ని ఒకేసారి అతనికి సోకాయి అనే విషయాలపై ఆరా తీస్తే.. ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి.

అనడానికి వ్యంగ్యంగా ఉండొచ్చు కానీ.. ఓ వ్యక్తి టూర్​కి వెళ్లి హెచ్​ఐవీ, కొవిడ్, మంకీపాక్స్​ని రిటర్న్​లో తెచ్చుకున్నాడు. అసలేమైందంటే.. ఇటలీకి చెందిన వ్యక్తి.. ఈ సంవత్సరం జూన్​లో స్పెయిన్ పర్యటనకు వెళ్లాడు. టూర్​కి వెళ్లిన అతను జూన్ 16 నుంచి 20 వరకు స్పెయిన్‌లో ఐదు రోజులు గడిపాడు. ఆ సమయంలో అసురక్షిత లైంగిక సంబంధంలో పాల్గొన్నాడు. అక్కడ నుంచి తిరిగి వచ్చిన తొమ్మిది రోజుల తర్వాత అలసట, జ్వరం, గొంతు నొప్పి వంటి లక్షణాలతో ఇబ్బంది పడ్డాడు.

జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షన్‌లో ప్రచురించిన కేస్ స్టడీ నివేదిక ప్రకారం.. జూలై 2న ఆ వ్యక్తికి కొవిడ్-19 పాజిటివ్​గా నిర్ధారణైంది. అదే రోజు మధ్యాహ్నం అతని ఎడమ చేతిపై దద్దుర్లు రావడం ప్రారంభించాయి. మరుసటి రోజు అతని మొండెం, దిగువ అవయవాలు, ముఖం, గ్లూట్స్‌పై దద్దుర్లు వచ్చాయని నివేదిక పేర్కొంది.

జూలై 5 నాటికి వెసికిల్స్ మరింత వ్యాప్తి చెందాయని. చర్మంపై చిన్న గడ్డలుగా మారాయని వెల్లడించింది. ఆ సమయంలో వ్యక్తిని ఇటలీలోని కాటానియాలోని శాన్ మార్కో యూనివర్శిటీ హాస్పిటల్‌లోని అత్యవసర విభాగానికి తరలించారు. అనంతరం ఇన్ఫెక్షియస్ డిసీజెస్ విభాగానికి బదిలీ చేశారు. మంకీపాక్స్ కూడా అతనికి సోకిందని నివేదికలు వచ్చాయి.

రోగికి బహుళ STI పరీక్షలు నిర్వహించగా.. అతను HIV-1 పాజిటివ్ అని తేలింది. "అతని CD4 గణనను బట్టి.. సంక్రమణ సాపేక్షంగా ఇటీవలిదేనని తేలిందని" వైద్యులు తెలిపారు. కొవిడ్ -19, మంకీపాక్స్ కోలుకున్న తరువాత.. రోగిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపినట్లు నివేదిక వెల్లడించింది.

పాపం ఆ వ్యక్తి గురించి ఎంత బాధపడినా తక్కువే. ఏదో ఎంజాయ్ చేద్దామని టూర్​కి వెళ్లి.. జీవితంలో ఎంజాయ్​ అనే పదానికి బాయ్​ చెప్పే స్టేజ్​కి వచ్చాడు. ఇలా టూర్​కి వెళ్లాలనుకునే వాళ్లు జాగ్రత్తలు తీసుకుని ఎంజాయ్ చేయండి. అంతేకానీ ఏరికోరి సమస్యలను కొనితెచ్చుకోకండి అంటున్నారు నిపుణులు.

WhatsApp channel

సంబంధిత కథనం