ప్రేమబంధంలో కొన్నిసార్లు ఆచరణాత్మక ఆలోచనలు, కొన్నిసార్లు భావోద్వేగమైన స్పందనలు గెలుస్తుంటాయి. అయితే, ఇటీవల రెడిట్‌లో ఒక వ్యక్తి పెట్టిన పోస్ట్ భార్యాభర్తల మధ్య ఇలాంటి ఒక సంఘర్షణను బయటపెట్టి, నెటిజన్లను రెండుగా చీల్చింది. తన భార్యను ఎయిర్‌పోర్టుకు వెళ్లి తీసుకెళ్లనందుకు తాను తప్పు చేశానా అని ఆ భర్త అడగ్గా, చాలామంది యూజర్లు భావోద్వేగాలకు, చిన్నచిన్న పనులకు ఇచ్చే ప్రాధాన్యతను నొక్కి చెప్పారు.
జూన్ 14న రెడిట్‌లోని AmItheA***ole (AITA) కమ్యూనిటీ పేజీలో ఒక యూజర్ తన అనుభవాన్ని పంచుకున్నారు. ఇక్కడ ప్రజలు తమ తప్పు ఒప్పులను ఇతరుల అభిప్రాయాలకు వదిలేస్తారు. సదరు రెడిట్ యూజర్ తాను, తన భార్య ఒక నగరానికి ప్రయాణిస్తున్నామని, అయితే పని నిమిత్తం తాను ఒక వారం ముందుగానే వచ్చి ఎయిర్‌బిఎన్‌బిలో ఉంటున్నానని చెప్పాడు. తన భార్య తర్వాత వచ్చినప్పుడు, ఇద్దరూ కలిసి ఒక హోటల్‌కు మారాల్సి ఉంది.
అయితే తన భార్యను ఎయిర్‌పోర్టుకు వెళ్లి తీసుకెళ్లడానికి ఉబెర్ తీసుకోవడం లాజిక్ కాదని భావించి, ఆమెను నేరుగా హోటల్‌కు రమ్మని చెప్పాడు. "ఆమెకు కూడా ఈ నగరం బాగా తెలుసు. మేమిద్దరం రెండు సంవత్సరాల క్రితం ఇక్కడే ఏడాది పాటు ఉన్నాం. కాబట్టి ఆమెకు ఎయిర్‌పోర్టు, ఎలా ప్రయాణించాలో అన్నీ బాగా తెలుసు. ఇది లాజికల్‌గా కరెక్ట్ అని నేను అనుకున్నాను. కానీ నేను అలా చెప్పినప్పుడు ఆమె చాలా అప్‌సెట్ అయ్యింది. ఆమెను ఎయిర్‌పోర్టు నుంచి తీసుకెళ్లకపోవడం తప్పేనా?" అని ఆ భర్త రెడిట్ కమ్యూనిటీని అడిగాడు.
తర్వాత ఆ వ్యక్తి, తాను గతంలోనూ చాలాసార్లు బిజినెస్ ట్రిప్స్‌కు వెళ్ళానని, అప్పుడు తన భార్య ఎప్పుడూ ఎయిర్‌పోర్టుకు వచ్చి తనను తీసుకెళ్లలేదని, దానికి తాను అస్సలు బాధపడలేదని కూడా వివరించాడు. అందుకే, ఆమెకు కూడా ఇది పెద్ద విషయం కాదని భావించి, ఆమె వచ్చే సమయానికి ఒక బిజినెస్ మీటింగ్ పెట్టుకున్నానని చెప్పాడు.
ఈ పోస్ట్‌పై రెడిట్ యూజర్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. చాలామంది భర్త అభిప్రాయంతో విభేదిస్తూ, అతను ఈ పరిస్థితిని కేవలం ఆచరణాత్మక దృక్పథంతో చూడకూడదని నొక్కి చెప్పారు.
ఒక యూజర్ "ఇక్కడ ఎవరూ పూర్తిగా తప్పు కాదు. మీరు ప్రాక్టికల్ లాజిక్స్ గురించి ఆలోచిస్తున్నారు. ఆమె మాత్రం వీలైనంత త్వరగా తన పార్ట్‌నర్‌ని చూడాలని, మీరు కూడా ఆమెను చూడటానికి ఆతృతగా ఉన్నారని అనుకుంటోంది." అని వ్యాఖ్యానించారు.
"ఎవరిదీ తప్పు కాదు.. కానీ కొన్నిసార్లు మీ జీవిత భాగస్వామిని సంతోషంగా ఉంచాలంటే మీరు మామూలు కంటే మెరుగ్గా ఉండాలి" అని మరొకరు కామెంట్ చేశారు.
"ఎవరూ తప్పు కాదు. కానీ మీ పార్ట్‌నర్ లేదా మీ ప్రియమైన వారిని ఎయిర్‌పోర్టులో కలవడం ఒక మంచి సంకేతం. అది మీరు వారిని చూడటానికి ఎంత ఉత్సాహంగా ఉన్నారో చూపిస్తుంది. మీరు ప్రాక్టికల్ వ్యక్తిలా ఉన్నారు. మీ భార్య మాత్రం మరింత రొమాంటిక్, సున్నితమైన వ్యక్తిలా ఉన్నారు." అని ఇంకొకరు కామెంట్ రాశారు.
మరొక యూజర్, "మీకు అనవసరం అనిపించినా.. మీ భార్య భావాలు ఆ అదనపు ప్రయాణానికి విలువైనవి" అని రాశారు.
అయితే, కొంతమంది రెడిట్ యూజర్లు భర్తకు మద్దతు పలికారు. ఒక యూజర్, "నేను వారం రోజులు దూరంగా ఉన్న భార్యను కలవడానికి టాక్సీ తీసుకోవాల్సి వస్తే, పైగా ఆమె గతంలో నివసించిన ప్రదేశానికి వస్తుంటే.. అందులో రొమాంటిక్‌గా ఏమీ లేదు. భార్యదే అర్థం లేని కోరిక అని నాకు అనిపిస్తుంది" అని రాశారు. మరొకరు, "అతను ఒక వారం ముందు వచ్చాడు. ఈ స్థాయిలో భావోద్వేగాలను భర్తీ చేయడం నాకు నచ్చదు. ఆ భార్య ఇంకా ఎదగాలి అని నేను అనుకుంటున్నాను" అని కామెంట్ చేశారు.
ప్రేమ సంబంధంలో రొమాంటిక్ సంకేతాలు చాలా ముఖ్యం. అయితే ఆచరణాత్మక ఆలోచనలు, భావోద్వేగాల మధ్య జరిగే ఈ పోరాటం తరచుగా ఏదో ఒక భాగస్వామి నిర్లక్ష్యానికి గురికావడానికి దారితీస్తుంది. భర్త తీసుకున్న నిర్ణయం లాజికల్‌గా సరైనదే కావచ్చు.. కానీ అతని భార్య, చాలామంది రెడిట్ యూజర్లు మాత్రం ఒక చిన్న పనిలో ఉండే భావోద్వేగ విలువను అతను పట్టించుకోలేదని భావించారు. ఈ వివాదంలో ఏ ఒక్కరినీ పూర్తిగా తప్పు పట్టలేం. ఇది కేవలం భిన్నమైన అంచనాల మధ్య జరిగే సంఘర్షణ.