Protein Intake: ప్రోటీన్ తీసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తే బరువు తగ్గడానికి బదులు పెరుగుతారు!
Protein Intake: ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటూ బరువును నియంత్రణలో ఉంచుకోవాలంటే ప్రొటీన్లతో కూడిన పదార్థాలను తినాలి. బరువు తగ్గడానికి ప్రోటీన్ తీసుకునేటప్పుడు చాలా మంది ఈ 5 తప్పులు చేస్తారు. దీనివల్ల బరువు తగ్గడానికి బదులుగా పెరుగుతారు, పోషకాల లోపం వంటి సమస్యలను ఎదుర్కొంటారు.
శరీరానికి ప్రొటీన్ చాలా అవసరం. ఇది కండరాలు, అవయవాలు, కణాలు నిర్మించడానికి, జబ్బుల నుంచి కోలుకోవడానికి, రోగనిరోధక వ్యవస్థ బలోపేతం చేయడానికి, ఎంజైమ్స్, హార్మోన్లు తయారుచేసేలా, చర్మం, జుట్టు, నఖాలు పెరగడానికి, శక్తి ఇస్తుంది. ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలనుకునే వారికి ప్రొటీన్ కీలకపాత్ర పోషిస్తుంది. అయితే బరువు తగ్గడానికి ప్రొటీన్ చాలా అవసరమనే అభిప్రాయంతో చాలా మంది దీన్ని తీసుకునేటప్పుడు తరచుగా కొన్ని తప్పులు చేస్తున్నారు. ఇవి బరువు తగ్గించడానికి సహాయం చేయడానికి బదులుగా బరువు పెరిగేందుకు దోహదపడుతున్నాయి. వెయిట్ లాస్ అవాలనుకునే వారు ప్రొటీన్ల విషయంలో చేయకూడాని ఆ పొరపాట్లేంటో తెలుసుకుందాం.

బరువు తగ్గడంలో ప్రొటీన్ పాత్ర:
1. ఆకలి తగ్గిస్తుంది: ప్రొటీన్ ఎక్కువగా తృప్తిని ఇచ్చేది, అంటే ఎక్కువ సమయం పాటు ఆకలితో బాధపడకుండా ఉండవచ్చు. దాంతో మీరు తినే మొత్తాన్ని తగ్గించుకోవచ్చు.
2. కండరాలను కాపాడుతుంది: బరువు తగ్గేటప్పుడు కొవ్వుతో పాటు కండరాలు కూడా కరిగి పోయే అవకాశాలుంటాయి. కానీ సరిపడా ప్రొటీన్ తీసుకోవడం వల్ల ఇలా జరగదు. ప్రొటీన్లు కండరాల ఆరోగ్యాన్ని కాపాడతాయి.
3. ఎక్కువ క్యాలరీలను ఖర్చు చేస్తుంది: ప్రొటీన్‌ను జీర్ణించడానికి శరీరానికి ఎక్కువ శక్తి అవసరం. ఇలాంటి సమయంలో ప్రొటీన్లను జీర్ణించుకోవడానికి శరీరం ఎక్కువ క్యాలరీలను ఖర్చు చేస్తుంది. ఫలితంగా బరువు పెరగరు.
4. కొవ్వు తగ్గించడంలో సహాయం చేస్తుంది: ఎక్కువ ప్రొటీన్ తీసుకోవడం, రెసిస్టెన్స్ వ్యాయామంతో కలిపి, కొవ్వు పోగొట్టడాన్ని ప్రోత్సహిస్తుంది. కండరాలను నిర్మించడంలో లేదా సంరక్షించడంలో సహాయపడుతుంది, ఫలితంగా మీ శరీరం మరింత సన్నగా కనిపిస్తుంది.
ప్రోటీన్ తీసుకునేవారు తరచూ చేస్తున్న పొరపాట్లు:
అవసరానికి మించి ప్రోటీన్ తీసుకోవడం
ప్రొటీన్ తీసుకుంటున్నప్పుడు శరీరక శ్రమ చాలా అవసరం. బరువు తగ్గాలనుకునే చాలా మంది చేస్తున్న పొరపాట్లలో ముఖ్యమైనది అవసరానికి మించి ప్రోటీన్ తీసుకోవడం. ఇది శరీరంలో అదనపు కేలరీలుగా మారి, కొవ్వుగా నిల్వ అవుతుంది. అందుకే మీ శారీరక శ్రమ, ఆరోగ్య లక్ష్యాలను బట్టి ప్రోటీన్ తీసుకోంటేనే అది మీ బరువును తగ్గిస్తుంది.
ప్రోటీన్ నాణ్యతపై దృష్టి పెట్టండి
ప్రాసెస్ చేసిన ప్రోటీన్లు లేదా సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉండే ప్రోటీన్లు నాణ్యత తక్కువవి. వీటివల్ల బరువు తగ్గడానికి బదులుగా పెరుగుతారు. వీటి బదులు చికెన్, చేపలు, పప్పులు, టోఫు వంటి లీన్ ప్రోటీన్ తీసుకోవాలి. ఇవి శరీరానికి ప్రోటీన్‌తో పాటు ఇతర పోషకాలను కూడా అందిస్తాయి.
ప్రోటీన్ తీసుకునే సమయం
బరువు తగ్గాలనుకునే వారికి ప్రోటీన్ తీసుకునే సమయం కూడా చాలా ముఖ్యం. ఒకేసారి ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే అంత ప్రభావవంతంగా ఉండదు. బదులుగా రోజంతా కొద్ది కొద్దిగా తీసుకోవాలి. దీనివల్ల కడుపు నిండుగా ఉండటమే కాకుండా కండరాలకు ప్రోటీన్ అందుతుంది. కండరాలు బలంగా తయారవుతాయి. శరీర బరువు నియంత్రణలో ఉంటుంది.
ఇతర పోషకాలను విస్మరించడం
శరీరానికి ప్రోటీన్ మాత్రమే కాదు, ఇతర పోషకాలు కూడా అవసరం. అందుకే ప్రోటీన్‌తో పాటు ఇతర పోషకాలను కూడా తీసుకోవాలి. ప్రోటీన్‌ను సమతుల్య ఆహారంలో భాగంగా చేసుకోవాలి. ఇలా అయితే మీ శరీర బరువు నియంత్రణలో ఉంటుంది.
పానీయాల వల్ల అదనపు కేలరీలు
ప్రోటీన్ పానీయాలు, సప్లిమెంట్లు తీసుకోవడం సులభం కానీ వీటివల్ల శరీరానికి అదనపు కేలరీలు అందుతాయి. దీనివల్ల బరువు పెరుగుతారు. అందుకే ఇంట్లో తయారుచేసిన, సహజ ఉత్పత్తులను ప్రోటీన్ వనరులుగా ఉపయోగించాలి.