సోయాతో చేసే మీల్ మేకర్ చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. మీరు పావుగంటలో దీంతో స్నాక్ తయారు చేసుకోవచ్చు. మిల్ మేకర్ తో చేసే మంచూరియా తయారవడానికి ఎక్కువ సమయం పట్టదు.
కాబట్టి సాయంత్రంపూట ఇంటికి అతిధులు వచ్చినప్పుడు లేదా మీకు ఏదైనా తినాలన్న కోరిక పుట్టినప్పుడు ఇలా మీల్ మేకర్ మంచూరియా చేసుకునేందుకు ప్రయత్నించండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పొట్ట నిండిన ఫీలింగ్ ను ఇస్తుంది.
మీల్ మేకర్లు - రెండు కప్పులు
ఉప్పు - రుచికి సరిపడా
నీళ్లు - సరిపడినన్ని
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను
షెజ్వాన్ సాస్ - ఒక స్పూను
సోయాసాస్ - ఒక స్పూను
మైదా పిండి - రెండు స్పూన్లు
కార్న్ ఫ్లోర్ - మూడు స్పూన్లు
అల్లం తరుగు - అర స్పూను
వెల్లుల్లి తరుగు - అర స్పూను
పచ్చిమిర్చి - నాలుగు
ఉల్లికాడల తరుగు - రెండు స్పూన్లు
మిరియాల పొడి - అర స్పూను
టమోటో సాస్ - రెండు స్పూన్లు
వెనిగర్ - ఒక స్పూను
1. మీల్ మేకర్లను ఒక గిన్నెలో వేసి నీళ్లు వేసి చిటికెడు ఉప్పు వేసి స్టవ్ మీద పెట్టి ఉడికించాలి. ఇవి త్వరగానే ఉడికిపోతాయి.
2. ఇప్పుడు వాటిని వడకట్టి పక్కన పెట్టుకోవాలి. చేత్తోనే పిండి నీళ్లు లేకుండా చూసుకోవాలి.
3. ఇప్పుడు ఒక గిన్నెలో ఆ ఉడకబెట్టిన మిల్ మేకర్ ను వేసి అర స్పూన్ ఉప్పు, ఒక స్పూను షెజ్వాన్ సాస్, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్,టు రెండు స్పూన్ల మైదా పిండి, మూడు స్పూన్ల కార్న్ ఫ్లోర్, ఒక స్పూను సోయా సాస్ వేసి బాగా కలపాలి.
4. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి వీటిని డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె వేయాలి.
5. ఆ నూనె వేడెక్కాక ఈ మిల్ మేకర్లను వేసి ఫ్రై చేసుకుని తీసి పక్కన పెట్టుకోవాలి.
6. ఇప్పుడు మరొక కళాయిని స్టవ్ మీద పెట్టి రెండు స్పూన్ల నూనె వేయాలి.
7. అందులో అల్లం తరుగు వెల్లుల్లి తరుగు వేసి వేయించాలి.
8. ఆ తర్వాత పచ్చిమిర్చి తరుగును, ఉల్లికాడలు తరుగును కూడా వేసి బాగా వేయించుకోవాలి.
9. ఇవి వేగాక అర స్పూను మిరియాల పొడి, ఒక స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
10. తర్వాత ఒక స్పూను షెజ్వాన్ సాస్, రెండు స్పూన్ల టమాటో కెచప్, ఒక స్పూను సోయాసాస్, ఒక స్పూన్ వెనిగర్ వేసి బాగా కలపాలి.
11. ఇప్పుడు చిన్న కప్పులో ఒక స్పూను కార్న్ ఫ్లోర్ వేసి పావు కప్పు నీళ్లను వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని కళాయిలో వేయాలి.
12. ఇది మరుగుతున్నప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న మీల్ మేకర్లను ఇందులో వేసి బాగా కలుపుకోవాలి.
13. ఈ మొత్తం మిశ్రమం దగ్గరగా మంచూరియా లాగా అయ్యేవరకు చిన్న మంట మీద వేయించాలి.
14. తర్వాత పైన కొత్తిమీర తరుగు జల్లి స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతే మీల్ మేకర్ మంచూరియా రెడీ అయినట్టే.
ఇది తింటున్న కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. ముఖ్యంగా పిల్లలకు ఇది బాగా నచ్చుతుంది. ఒకసారి దీన్ని మీరు చేసి చూడండి. కచ్చితంగా మీ పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు.