వేసవి కాలంలో బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తే త్వరగా ఫలితాలు వస్తాయి. కాబట్టి ఎలాంటి ఆహారం తినడం ద్వారా బరువు తగ్గించుకోవాలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. బరువు తగ్గే ప్రయాణంలో మీకు ఓట్స్ మీల్ ఎంతో సహాయపడుతుంది. ఇది ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. ఓట్స్ మీల్ ప్రతిరోజు తినడం ద్వారా వేసవిలో త్వరగా బరువు తగ్గవచ్చు.
ఓట్స్ మీల్‌తో చేసే పానీయాలలో పాలు, చక్కెర వాడే వారి సంఖ్య చాలా ఎక్కువ. ఈ రెండూ వాడడం వల్ల మీరు బరువు త్వరగా తగ్గరు. కాబట్టి ఎలా తింటే బరువు తగ్గుతారో ఇక్కడ ఇచ్చాము. ఫాలో అయిపోండి.
ఓట్స్ మీల్ తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి. జీర్ణ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం ఓట్స్ లో బీటా గ్లూకాన్ అనే ఒక ముఖ్యమైన ఫైబర్ ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడుతుంది.
అలాగే యాంటీ డయాబెటిక్ ప్రభావాలు కూడా అధికంగానే ఉంటాయి. అలాగే దీనిలో ఫినోలిక్ ఆమ్లాలు, స్టెరాల్స్, టోకోల్స్ వంటి బయో యాక్టివ్ సమ్మేళనాలు కూడా అధికమే. ఓట్స్ తింటే మీ పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది. మంచి బ్యాక్టీరియాను కాపాడేందుకు ఓట్స్ ఉపయోగపడతాయి. అలాగే కొన్ని రకాల క్యాన్సర్లను అడ్డుకునే శక్తి కూడా ఓట్స్ కి ఉంది. కాబట్టి పాలు, చక్కెర లేకుండా ఓట్స్ మీల్ పానీయం ప్రతిరోజూ తాగేందుకు ప్రయత్నించండి.
ఓట్స్ మీల్ పానీయం చేసేందుకు ముందుగా మూడు స్పూన్ల ఓట్స్ మీల్ తీసుకొని ఒక గిన్నెలో వేసి పావుగంట పాటు నానబెట్టండి. మరొకపక్క ఒక కప్పు నీరు, ఒక టీ స్పూను కాఫీ పొడి, ఒక టీ స్పూను కోకో పౌడర్, ఎనిమిది జీడిపప్పులు, రెండు ఖర్జూరాలు ఒక స్పూను పీనట్ బటర్ ఒక స్పూను చియా గింజలు వేసి బాగా మెత్తగా రుబ్బుకోండి. ఇప్పుడు నానబెట్టిన ఓట్స్ ను చేత్తోనే పిండి ఒక గిన్నెలో వేయండి. అందులోనే అరటిపండును కూడా వేసి చేతితోనే మెత్తగా మెదుపుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ లో ఉన్న మిశ్రమాన్ని ఈ ఓట్స్ మిల్ మిశ్రమంలో కలిపేయండి. బాగా కలిపాక ఫ్రిజ్లో పెట్టి కొంచెం చల్లబడ్డాక తినండి. ఇది చలువ చేయడంతో పాటు శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అన్ని పోషకాలను శరీరానికి అందిస్తుంది. అలాగే ఆకలి ఎక్కువ వేయకుండా ఎక్కువసేపు మిమ్మల్ని అదుపులో ఉంచుతుంది.
ఇలాగే మరొక రెసిపీని కూడా ఓట్స్ మీల్ ప్రయత్నించవచ్చు. మీరు టేబుల్ స్పూన్ల ఓట్స్ తీసుకొని నానబెట్టండి. ఆ తర్వాత శుభ్రంగా కడిగి ఓట్స్ ను చేత్తోనే పిండి పక్కన పెట్టుకోండి. ఒక గిన్నెలో ఆ నానబెట్టిన ఓట్స్ ను వేయండి. అందులోనే జీడిపప్పు తరుగును, ఒక స్పూన్ అవిసె గింజలను అలాగే చియా గింజలను నానబెట్టి వేయండి. అలాగే ఆపిల్ ముక్కలు, నల్ల ద్రాక్ష ముక్కలను, దానిమ్మ గింజలను వేయాలి. అందులో ముప్పావు కప్పు మంచి నీటిని వేసి బాగా కలిపి స్మూతీ లాగా చేసి ఒక గంట పాటు నాననివ్వండి. ఆ తర్వాత దాన్ని తినేందుకు ప్రయత్నించండి. ఇది ఎంతో రుచిగా అద్భుతంగా ఉంటుంది.
అలాగే మిక్సీ జార్ లో నానబెట్టిన మూడు స్పూన్ల ఓట్స్, ఐదు స్ట్రాబెర్రీలు, నానబెట్టిన మూడు బాదం గింజలు, చియా గింజలు, దాల్చిన చెక్క పొడి, అరకప్పు నీరు వేసి బాగా రుబ్బి ఒక గ్లాసులో వేసుకోవాలి. దానిలో పాలు, చక్కెర వంటివి వేసుకోకుండా తాగేయాలి. ఇది కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బరువు తగ్గడానికి మీకు సహాయపడుతుంది.