New Year Resolution: గుండె ఆరోగ్యం కోసం కొత్త ఏడాదిలో ఈ అయిదు నిర్ణయాలు తీసుకోండి, ఎక్కువ కాలం జీవిస్తారు
కొత్త సంవత్సరం వచ్చేసింది. ఈ సంవత్సరం నేను అలా ఉంటాను, నేను ఇలానే ఉంటాను,నేను చేస్తాను,నేను జిమ్ కు వెళతాను, ఇలా ఎన్నో తీర్మానాలు చేశారు. అదే సమయంలో, మీరు మీ ఆరోగ్యం మరియుహృదయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. గుండె ఆరోగ్యం కోసం మనం ఏమి చేయాలి?దీని గురించి మరింత సమాచారం ఇక్కడ ఉంది.
ఆధునిక కాలంలో గుండె సమస్యలు అధికంగా వస్తున్నాయి. ముఖ్యంగా వయసులో సంబంధం లేకుండా గుండె పోటు బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య పెరిగిపోయింది. కాబట్టి ప్రతి ఒక్కరూ గుండె కోసం ప్రత్యేక శ్రద్ద అవసరం. కొత్త ఏడాదిలో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకుంటామనే సంకల్పాన్ని తీసుకోవాలి. 2024 లో, ఎక్కువ మంది యువత హృదయ సంబంధ వ్యాధులతో అకాల మరణం బారిన పడ్డారు. గుండె ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. గుండెను జాగ్రత్తగా చూసుకోవడం కోసం కొన్ని పనులు చేయకూడదు. ఇక్కడ ఇచ్చిన కొన్ని అలవాట్లను మీరు వదిలేయాలి. ఆరోగ్యకరమైన హృదయం కోసం కొన్ని అలవాట్లను అలవర్చుకోవాలి.
గుండె ఆరోగ్యం కోసం అలవాట్లు
సమతుల్య ఆహారం: మనం తినే ఆహారం సమతుల్యంగా ఉండేలా చేసుకోవాలి. అందుకోసం తాజా పండ్లు, కూరగాయలను మన ఆహారంలో చేర్చుకోవాలి. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి. కొత్త సంవత్సరం మొదటి రోజే ఈ నిర్ణయం తీసుకోవాలి. చెడు ఆహారాపు అలవాట్లను వదిలేయాలన్న తీర్మానాన్ని తీసుకోండి. ఏడాదంతా ఆరోగ్యంగా ఉంటారు.
స్థూలకాయం నియంత్రణ: గుండె ఆరోగ్యం కోసం శరీర బరువును పెరగకుండా అదుపులో ఉంచుకోవాలి. వైద్యుల అభిప్రాయం ప్రకారం, ఆరోగ్యకరమైన వ్యక్తి బాడీ మాస్ ఇండెక్స్, అంటే బిఎమ్ఐ 18.5 మరియు 24.9 మధ్య ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే వారికి గుండె జబ్బులు రావచ్చు. అధిక బరువు, ఊబకాయం అనేక సమస్యలకు దారితీస్తుంది.
బీపీ, కొలెస్ట్రాల్: అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ గుండెజబ్బులకు దారితీస్తుంది. అధిక రక్తపోటు ఉంటే గుండెపై అధిక భారం పడుతుంది. గుండెపై ఒత్తిడి పెరిగితే అది గుండెపోటుకు దారితీస్తుంది. అందువల్ల ఎప్పటికప్పుడు బీపీ, కొలెస్ట్రాల్ చెక్ చేసుకోవడం మంచిది.
వ్యాయామానికి సమయం: నేటి జీవనశైలిలో పని ఒత్తిడి మధ్య వ్యాయామం, నడక, జిమ్ లకు సమయం కేటాయించలేకపోతున్నారు.అయితే శరీరం, గుండె ఆరోగ్యానికి రోజుకు కనీసం 30 నిమిషాల వ్యాయామం చాలా అవసరం. యోగా, సైక్లింగ్, ధ్యానం, స్విమ్మింగ్ వంటి వివిధ మార్గాల్లో వ్యాయామం చేయడం ద్వారా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
క్రమం తప్పకుండా హెల్త్ చెకప్స్ : చాలా మంది ఆరోగ్యం ఇబ్బందుల్లో పడినప్పుడు మాత్రమే హెల్త్ చెకప్స్ చేయించుకుంటూ ఉంటారు.అయితే అలా చేయకుండా రెగ్యులర్ గా హెల్త్ చెకప్స్, బ్లడ్ ప్రెజర్ టెస్ట్ లు చేయించుకుని డాక్టర్ మెడికల్ రిపోర్ట్ చూపించి వారి సలహాలు తీసుకోండి. ఇలా చేయడం వల్ల పరిస్థితి చేయిజారక ముందే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.