వేసవిలో చలువ చేసేలా రాగి అంబలిని ఇలా చేయండి, శరీరంలో వేడి తగ్గుతుంది-make ragi ambali like this to keep you cool in summer it will reduce the heat in the body ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  వేసవిలో చలువ చేసేలా రాగి అంబలిని ఇలా చేయండి, శరీరంలో వేడి తగ్గుతుంది

వేసవిలో చలువ చేసేలా రాగి అంబలిని ఇలా చేయండి, శరీరంలో వేడి తగ్గుతుంది

Haritha Chappa HT Telugu

రాగి అంబలి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే వేసవిలో రాగి అంబలిని ఎలా పడితే అలా చేసుకొని తింటే శరీరానికి వేడి కలగవచ్చు. కాబట్టి ఎలా చేయాలో తెలుసుకోండి.

వేసవిలో చలువ చేసే రాగి అంబలి (Visami food/Youtube)

రాగి అంబలి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. డయాబెటిస్, అధిక రక్తపోటు ఉన్నవారు రాగి అంబలిని ప్రతిరోజూ తాగాలి. అలాగే బరువు తగ్గాలనుకున్న వారు కూడా రాగి అంబలి తాగడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అయితే రాగి అంబలి చేయడం చాలా సులువు అని అనుకుంటారు. నీళ్లల్లో పోసి ఉడికించడమే అనుకుంటారు. వేసవిలో రాగి అంబలిని చేసే పద్ధతి తెలుసుకోవాలి. దీనివల్ల శరీరానికి చలువ చేస్తుంది. వేసవిలో రాగి అంబలి ఎలా తింటే శరీరానికి చలువో తెలుసుకోండి.

రాగి అంబలి రెసిపీకి కావలసిన పదార్థాలు

రాగి పిండి - నాలుగు స్పూన్లు

ఉల్లిపాయ - ఒకటి

పెరుగు - అరకప్పు

నీళ్లు - రెండు కప్పులు

కొత్తిమీర తరుగు - ఒక స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

రాగి అంబలి రెసిపీ

1.స్టవ్ మీద కళాయి పెట్టి చిన్న మంటను పెట్టండి. ఆ కళాయిలో రాగి పిండిని వేసి పొడిపొడిగా వేయించండి. తర్వాత తీసి పక్కన పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేయండి.

2. ఇప్పుడు ఈ రాగి పిండిని ఒక గిన్నెలో వేసి అరకప్పు నీటిని వేసి బాగా కలపండి. ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి.

3. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి ఒకటిన్నర కప్పు నీటిని వేసి మరిగించండి.

4. ఇప్పుడు ఆ నీటిలో ముందుగా కలుపుకున్న రాగి నీటిని వేసి మెల్లగా కలుపుతూ ఉండండి. రాగి పిండి ముద్దలు కట్టకుండా రావాలంటే చిన్న మంట మీద దీన్ని ఉడికించాలి.

5. పైగా స్పూనుతో కలుపుతూనే ఉండాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి.

6. ఇప్పుడు రాగి పిండిని చల్లారని రాగిజావను చల్లారనివ్వండి. అది చల్లారాక పెరుగును బాగా గిలకొట్టి అందులో కలుపుకోండి.

7. అలాగే రుచికి సరిపడా చిటికెడు ఉప్పును వేసుకోండి.

8. పైన ఉల్లిపాయ తరుగును, కొత్తిమీర తరుగును వేసి బాగా కలిపి ఐదు నిమిషాలు పక్కన పెట్టండి.

9. తర్వాత ఆ రాగి జావను తినేందుకు ప్రయత్నించండి. ఈ రాగి అంబలి తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.

10. ఇది శరీరానికి చలవ చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం వేసవిలో ఇలా రాగి అంబలిని చేసుకుని తింటే టేస్టీగా ఉంటుంది. పైగా ఎంతో ఆరోగ్యం కూడా.

రాగి అంబలి తాగడం వల్ల మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. రాగి పిండిలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి జీర్ణక్రియ సవ్యంగా జరుగుతుంది. మలబద్ధకం కూడా రాకుండా ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారు రాగి అంబలి తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచుకోవచ్చు. ప్రతిరోజు రాగి అంబలి తాగితే డయాబెటిస్ కూడా అదుపులో ఉంటుంది.

రాగి పిండిలో క్యాల్షియం, ఫాస్ఫరస్ ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఇవి ఎముక సంబంధిత సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి. శరీరానికి కావాల్సిన శక్తిని రాగి పిండి అందిస్తుంది. ఎవరైతే బరువు తగ్గాలనుకుంటున్నారో వారు ప్రతిరోజు ఒక గ్లాసుడు రాగిజావ తాగేందుకు ప్రయత్నించండి. ఇందులో ఉండే ఫైబర్ తక్కువ కేలరీలు బరువు తగ్గడానికి సహాయం చేస్తాయి. రాగి అంబలి వేసవిలో తాగడం వల్ల శరీరంలోని వేడి చాలా వరకు తగ్గిపోతుంది. జుట్టు బాగా పెరగడానికి కూడా రాగి అంబలి సహకరిస్తుంది. ఎందుకంటే రాగి పిండిలో ఐరన్, జింక్ అధికంగా ఉంటాయి. కాబట్టి జుట్టు రాలే సమస్య కూడా చాలా వరకు తగ్గిపోతుంది.

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం