Diwali Sweets: దీపావళి కోసం పావు గంటలో స్వీట్‌ను రెడీ చేయాలనుకుంటున్నారా? పాలపొడి బర్ఫీని చేసేయండి-make milk powder barfi for diwali here is the recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Diwali Sweets: దీపావళి కోసం పావు గంటలో స్వీట్‌ను రెడీ చేయాలనుకుంటున్నారా? పాలపొడి బర్ఫీని చేసేయండి

Diwali Sweets: దీపావళి కోసం పావు గంటలో స్వీట్‌ను రెడీ చేయాలనుకుంటున్నారా? పాలపొడి బర్ఫీని చేసేయండి

Haritha Chappa HT Telugu

Diwali Sweets: దీపావళి రోజు పాలపొడితో సింపుల్ గా చేసే స్వీట్ పావుగంటలో అయిపోతుంది. ఇది మీకు ఎంతో సమయాన్ని మిగిలేలా చేస్తుంది. ఈ పాలపొడి స్వీట్ రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

పాలపొడి స్వీట్ రెసిపీలు

దీపావళి రోజు చేసే లక్ష్మీ పూజలో కచ్చితంగా ఇంట్లో చేసిన స్వీట్స్ ఉండాల్సిందే. స్వీట్ చేయాలంటే ఎక్కువ సమయం పడుతుందని మహిళలు భయపడతారు. ఇక్కడ మేము కేవలం పావుగంటలో అయిపోయే స్వీట్ రెసిపీ ఇచ్చాము. పాలపొడితో చేసే ఈ బర్ఫీని మీరు చాలా త్వరగా చేసేయొచ్చు. దీని రెసిపీ తెలుసుకుంటే మీకే అర్థమవుతుంది.. దీన్ని చేయడం ఎంతో సులువన్నది. మేము ఇక్కడ పాలపొడితో చేసే స్వీట్ రెసిపీ ఇచ్చాము. దీన్ని ఫాలో అయిపోండి.

పాలపొడి స్వీట్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

పాలపొడి - రెండు కప్పులు

పంచదార - ఒక కప్పు

జీడిపప్పు తరుగు - ఒక స్పూను

బాదం తరుగు - ఒక స్పూను

పిస్తా తరుగు - ఒక స్పూను

కిస్మిస్ తరుగు - ఒక స్పూను

యాలకులు పొడి - పావు స్పూను

నెయ్యి - రెండు స్పూన్లు

గార్నిషింగ్ కోసం పిస్తా, బాదం, జీడిపప్పులు - గుప్పెడు

పాలపొడి స్వీట్ రెసిపీ

1. స్టవ్ మీద ఒక కళాయిని పెట్టి కప్పు నీళ్లను, పంచదారను వేయాలి.

2. అది తీగపాకం వచ్చేవరకు వేడి చేయాలి. తీగపాకం వచ్చాక మంటను తగ్గించాలి.

3. ఇప్పుడు పాలపొడిని అందులో వేస్తూ గరిటతో కలుపుతూనే ఉండాలి. లేకుంటే అది ఉండలు కట్టేసి అవకాశం ఉంది.

4. ఈ పాలపొడి కూడా దగ్గరగా అవుతున్న సమయంలో బాదం, పిస్తా, కిస్మిస్, జీడిపప్పు తరుగును వేసి కలుపుకోవాలి.

5. అలాగే యాలకుల పొడిని కూడా వేయాలి. ఈ మొత్తం మిశ్రమం దగ్గరగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేయాలి.

6. ఒక ప్లేటుకు నెయ్యిని రాసి ఈ పాలపొడి మిశ్రమాన్ని ప్లేట్ అంతా పరుచుకునేలా వేయాలి.

7. పైన పిస్తా, బాదం, జీడిపప్పు పలుకులను చల్లుకోవాలి.

8. తర్వాత దీన్ని చల్లారనిచ్చి రిఫ్రిజిరేటర్ లో పెట్టాలి.

9. ఒక రెండు గంటల తర్వాత దీన్ని బయటికి తీసి ముక్కలుగా చేసుకోవాలి.

10. అంతే పాలపొడి బర్ఫీ రెడీ అయినట్టే.

11. ఫ్రిడ్జ్ లో పెట్టడానికి సమయం లేకపోతే నేరుగా దాన్ని ముక్కలు చేసి పూజలో ప్రసాదంగా నివేదించవచ్చు.

12. దీన్ని చేయడం చాలా సులువు. మీరు ఒకసారి చేసి చూడండి మీకే తెలుస్తుంది. ఇది ఎంత వేగంగా అయిపోతుందో.

ఇందులో మనం పాలపొడిని వాడాము. పాల పొడిలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. కాబట్టి ఈ స్వీట్ తినడం వల్ల కూడా ఆరోగ్యానికి మేలే జరుగుతుంది. పంచదారను వాడడం ఇష్టం లేనివారు, బెల్లాన్ని కూడా వాడుకోవచ్చు. బెల్లం వాడడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. పంచదారను వాడితే రంగు తెలుపుగా వస్తుంది. బెల్లాన్ని వాడితే బర్ఫీ రంగు మారే అవకాశం ఉంది. కాబట్టి ఏది వాడాలన్నది మీరే నిర్ణయించుకోండి. ఇందులో మనం నట్స్ కూడా ఎక్కువగా వినియోగించాము. వాటిని తినడం వల్ల కూడా ఆరోగ్యానికి కావలసిన పోషకాలు ఎన్నో అందుతాయి. ఇంకెందుకు ఆలస్యం దీపావళికి ఈ రెసిపీని సిద్ధం చేసేయండి.