వేసవి పండుగ. పండ్ల రారాజు, ఇంట్లో ఏం చేసినా అందులో మామిడి లేదా మామిడి రుచి ఉంటుంది. మామిడి ఐస్ క్రీం, మ్యాంగో కుల్ఫీ, మ్యాంగో ఖీర్, మ్యాంగో కస్టర్డ్ లేదా మ్యాంగో క్రీమ్ వంటివి మామిడి పండ్లతో తయారు చేసుకోవచ్చు. మామిడి బర్ఫీ లేదా ఆమ్ పాక్ లేదా మ్యాంగో పాక్ ఎలా తయారు చేయాలో మీకు తెలుసా? ఇది మధ్యప్రదేశ్, గుజరాత్ మరియు మహారాష్ట్రల ఆహారం. పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ దీనిని ఇష్టపడతారు. ఇది ఎలా చేయాలో చూడండి.
మామిడిపండ్లు- అర కిలో
పంచదార - అర కిలో
నెయ్యి - రెండు స్పూన్లు
యాలకుల పొడి - అర టీ స్పూను
యెల్లో ఫుడ్ కలర్ - చిటికెడు
1. ముందుగా తీపిగా ఉండే మామిడి పండ్లను ఎంపిక చేసుకుని లోపలి గుజ్జును తీసి ఒక గిన్నెలో వేయాలి.
2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి రెండు స్పూన్లు నెయ్యి వేయాలి.
3. ఆ నెయ్యిలో మామిడి గుజ్జును వేసి బాగా కలపాలి. అందులో పసుపు రంగు వేసి బాగా కలపాలి. అలాగే యాలకుల పొడి వేసి బాగా కలపాలి.
4. మరో కళాయిలో పంచదార, నీళ్లు కలిపి మరిగించాలి. తీగ పాకం వచ్చే వరకు మరిగించాలి.
5. పంచదార కరిగి చిక్కగా అయ్యాక ఒక చుక్క తీసుకుని రెండు వేళ్ల మధ్య ఉంచి వేళ్లను వేరు చేస్తే తీగలా రావాలి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి.
6. ఇప్పుడు మామిడి మిశ్రమంలో ఈ పంచదార సిరప్ వేయాలి.
7. మామిడి పంచదార మిశ్రమం చిక్కగా అయ్యాక బాగా కలియబెట్టి స్టవ్ ఆఫ్ చేయాలి.
8. ఇప్పుడు ఒక ట్రే లేదా పళ్లెంలో నెయ్యి రాయాలి. అందులో మామిడి మిశ్రమంలో పైన వేయాలి.
9. ఇది చల్లారాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి అంతే.. సూపర్ టేస్టీ మ్యాంగో బర్ఫీ లేదా మ్యాంగో పాక్ తయారైనట్టే. దీన్ని నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటుంది.
ఈ స్వీట్ ను ఫ్రిజ్ లో పెట్టకూడదు. బయటే ఉంచాలి. ఇది సూపర్ టేస్టీ డెజర్ట్ రెసిపీ. ఈ ఆమ్ పాక్ తీపి, పుల్లని రుచిలో అద్భుతంగా ఉంటుంది. మీ ఇంట్లో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ దీన్ని ఇష్టపడతారు.