కోడిగుడ్డు, బ్రెడ్డు... ఈ రెండింటితో చేసే కాంబినేషన్ వంటకాలు ఏవైనా అదిరిపోతాయి. ఇక్కడ మేము ఎగ్ బ్రెడ్ రోల్ రెసిపీ ఇచ్చాము. అయితే ఇది కాస్త భిన్నంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మేలు చేసేలా కూడా ఉంటుంది. దీనిలో కోడిగుడ్లు బ్రెడ్ మాత్రమే కాదు క్యారెట్లు, బీన్స్, బఠానీలు, మొక్కజొన్న, అల్లం, బాదం పప్పులు, పచ్చిమిర్చి, బంగాళదుంప వంటివన్నీ కూడా వేస్తాము. కాబట్టి ఇది పొట్ట నింపే ఆహారంగానే భావించుకోవాలి. ఇంకెందుకు ఆలస్యం ఈ ఎగ్ బ్రెడ్ రోల్ హెల్తీగా ఎలా చేయాలో తెలుసుకోండి.
బ్రెడ్ ముక్కలు - ఆరు
గుడ్లు - రెండు
ఉప్పు - రుచికి సరిపడా
మిరియాల పొడి - అర స్పూను
నూనె - పావు కప్పు
పచ్చిమిర్చి తరుగు - ఒక స్పూను
బాదం తరుగు - రెండు స్పూన్లు
నిమ్మరసం - ఒక స్పూను
అల్లం తరుగు - రెండు స్పూన్లు
ఉల్లిపాయ - ఒకటి
బంగాళదుంప - ఒకటి
క్యారెట్ - ఒకటి
బీన్స్ - రెండు
బఠానీలు - గుప్పెడు
మొక్కజొన్న- గుప్పెడు
1. కుక్కర్లో క్యారెట్ లో బీన్స్, బఠానీలు, మొక్కజొన్న గింజలు, బంగాళదుంప వేసి మెత్తగా ఉడికించుకోవాలి.
2. ఒక గిన్నెలో ఉడికించిన కూరగాయలను వేసి చేతితోనే మెదుపుకోవాలి.
3. ఇప్పుడు అందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, బాదం తరుగు, అల్లం తరుగు, నిమ్మరసం, మిరియాల పొడి, ఉప్పు, పచ్చిమిర్చి తరుగు వేసి బాగా కలుపుకోవాలి.
4. ఇప్పుడు మరొక గిన్నెలో రెండు గుడ్లను కొట్టి బాగా గిలకొట్టాలి.
5. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
6. ఒక బ్రెడ్ ముక్కను తీసుకొని నీటితో తడపండి. అది మెత్తగా అవుతుంది.
7. అప్పుడు ఆ బ్రెడ్ ముక్క మధ్యలో పక్కన పెట్టుకున్నా కూరగాయల మిశ్రమాన్ని కొంత తీసి మధ్యలో పెట్టండి.
8. ఇప్పుడు ఆ బ్రెడ్ ను అన్ని వైపులా మూసి దగ్గరగా తడిచేత్తోనే నొక్కండి.
9. ఆ తర్వాత కోడిగుడ్డు మిశ్రమంలో దాన్ని ముంచి బయటకు తీసి వేడి నూనెలో వేయించండి.
10. అన్ని వైపులా బ్రౌన్ రంగు వచ్చేవరకు వేయిస్తే ఎగ్ బ్రెడ్ రోల్ రెడీ అయినట్టే ఇది చాలా టేస్టీగా ఉంటుంది.
11. దీనిలో అనేక రకాల వెజిటబుల్స్ కూడా ఉన్నాయి.
12. కాబట్టి పొట్ట త్వరగా నిండుతుంది. మేము చెప్పిన పద్ధతిలో ఒకసారి చేసి చూడండి.
13. ఎగ్ బ్రెడ్ రోల్ అద్భుతంగా ఉంటుంది. పిల్లలకు కూడా ఇది బాగా నచ్చుతుంది.
సాధారణ బ్రెడ్ రోల్ తో పోలిస్తే ఇందులో మనం అనేక రకాల పోషకాలు కలిగిన కూరగాయలతో నింపాము. దీన్ని డీప్ ఫ్రై చేయడానికి ఇష్టపడకపోతే ఎయిర్ ఫ్రెయర్ లో చేసుకున్నా తక్కువ నూనెతో రెడీ అయిపోతుంది. పైగా పిల్లలకు క్రంచీగా, క్రిస్పీగా వస్తుంది. కాబట్టి నచ్చుతుంది.