Pizza: గోధుమపిండితో సులువుగా ఇంట్లో ఇలా పిజ్జా పరాటా చేసేయండి, రెసిపీ చాలా సులువు
Pizza: పిల్లలు పిజ్జా తినాలని పట్టుబడితే, ఇంట్లోనే ఆరోగ్యంగా ఇలా చేసేయండి. దీన్ని గోధుమ పిండి, కూరగాయలు, చీజ్ వేసి చేస్తాము. కాబట్టి చాలా రుచిగా ఉంటుంది. చాలా సింపుల్ రెసిపీని నోట్ చేసుకోండి.
నేటి యువతకు, పిల్లలకు పిజ్జాలంటే ఎంతో ఇష్టం. యువత లంచ్‌లో కూడా వీటినే తినేందుకు ఇష్టపడుతూ ఉంటారు. వారు తరచూ పిజ్జా తినాలని పట్టుబడతారు. కానీ మీరు పిల్లలకు బయటి జంక్ ఫుడ్ తినిపించడం ఇష్టం లేకపోతే, ఇంట్లోనే చాలా సులువుగా పిజ్జా పరాటా తయారు చేయండి. దీన్ని తయారు చేయడం చాలా సులభం. ఇది హెల్తీగా తయారుచేస్తాము కాబట్టి పిల్లలకు లంచ్ బాక్స్ రెసిపీగా కూడా పెట్టుకోవచ్చు. పిజ్జా పరాటా ఎలా చేయాలో తెలుసుకోండి.
పిజ్జా పరాటా రెసిపీకి కావాల్సిన పదార్థాలు
గోధుమ పిండి - ఒక కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
చీజ్ తురుము - పావు కప్పు
మ్యాగీ మసాలా - ఒక స్పూను
కారం - పావు స్పూను
దేశీ నెయ్యి లేదా బటర్ - ఒక స్పూను
స్వీట్ కార్న్ - గుప్పెడు
క్యాప్సికమ్ తరుగు - గుప్పెడు
ఉల్లిపాయ తరుగు - గుప్పెడు
నీళ్లు - తగినంత
పిజ్జా పరాటా రెసిపీ
1. ముందుగా గోధుమ పిండిని ఒక గిన్నెలో వేసి రుచికి సరిపడా ఉప్పు, వెన్న లేదా నెయ్యి వేయాలి.
2. అందులో నీళ్లు వేసి చపాతీ పిండిని బాగా కలుపుకోవాలి.
3. ఈ పిండిని పావు గంటసేపు పక్కన పెట్టేసి ఆ తరువాత పిజాలాగా మందంగా ఒత్తుకోవాలి.
4. దానిపై ఫోర్క్ తో గుచ్చి రంధ్రాలు చేయాలి.
5. ఇప్పుడు దీన్ని పెనంపై పెట్టి రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. దీన్ని చిన్నమంట మీద పెట్టి కాల్చితే మంచిది.
6. పెద్ద మంట పెడితే లోపల ఉడకకుండా పైన మాత్రమే కాలుతుంది.
7. చిన్న మంట మీదే ఉంచి కాలిన వైపు పరాటాపై మ్యాగీ మసాలా, నెయ్యి లేదా వెన్న వేయాలి.
8. తరువాత స్వీట్ కార్న్, ఉల్లిపాయలు, క్యాప్సికమ్ పరచాలి.
9. వాటిపై చీజ్ తురుమును మొత్తం చల్లాలి.
10. పైన మూత పెట్టి చిన్న మంటపై అలాగే ఉంచాలి.
11. చీజ్ మొత్తం కరిగి పరాటాపైన ఉన్న కూరగాయలకు అతుక్కుపోతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే టేస్టీ పిజ్జా పరాటా రెడీ అయినట్టే. దీని రుచి అద్భుతంగా ఉంటుంది.
బయట దొరికే పిజ్జాల కన్నా ఇలా ఇంట్లోనే చేసుకుంటే రుచి అదిరిపోతుంది. మేము ఇక్కడ చెప్పిన పద్ధతిలో ఒక్కసారి పిజ్జా చేసి చూడండి. ఇది మీకు కచ్చితంగా నచ్చుతుంది.