Eco friendly Diwali: పర్యావరణహితంగా దీపావళిని ఇలా చేసుకోండి, మీ ఇంటికి అందం, మీకు ఆరోగ్యం-make diwali eco friendly beauty for your home health for you ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Eco Friendly Diwali: పర్యావరణహితంగా దీపావళిని ఇలా చేసుకోండి, మీ ఇంటికి అందం, మీకు ఆరోగ్యం

Eco friendly Diwali: పర్యావరణహితంగా దీపావళిని ఇలా చేసుకోండి, మీ ఇంటికి అందం, మీకు ఆరోగ్యం

Haritha Chappa HT Telugu

Eco friendly Diwali: దీపావళి పండుగ సమయంలో పర్యావరణ కాలుష్యం ఎక్కువగా ఉంటుంది.అందుకే ఎకో ఫ్రెండ్లీ దీపావళికి ప్రాధాన్యత ఇవ్వాలని చెబుతారు. మీరు కూడా దీపావళిని ఎకో ఫ్రెండ్లీగా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే ఈ క్రింది ఐడియాస్ ప్రయత్నించండి.

ఎకో ఫ్రెండ్లీ దీపావళి ఎలా చేసుకోవాలి? (PC: Canva)

భారతదేశంలో జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో దీపావళి ఒకటి. దీనిని దీపాల పండుగ అని పిలుస్తారు. ఇది చీకటిపై వెలుగు సాధించిన విజయానికి, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. దీపావళినాడు దీపం వెలిగించడమే కాకుండా టపాసులు పేల్చడం కూడా వేడుకల్లో భాగమే.

దీపావళి పండుగ సమయంలో వాయుకాలుష్యం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో వ్యర్థాలు కూడా పర్యావరణ క్షీణతకు కారణమవుతాయి. అందుకే ఈ రోజుల్లో ప్రజలు దీపావళిని ఎకో ఫ్రెండ్లీగా జరుపుకోవాలని ఆలోచించే వారి సంఖ్య ఎక్కువవుతోంది. కాబట్టి దీపావళిని ఎకో ఫ్రెండ్లీగా ఎలా జరుపుకోవాలి అనే ప్రశ్నను అడిగేవారికి ఇక్కడ కొన్ని ఆలోచనలు ఉన్నాయి.

ప్లాస్టిక్ వాడవద్దు

ఇంటి అలంకరణ కోసం ప్లాస్టిక్ లేదా సింథటిక్ పదార్థాలను ఉపయోగించడానికి బదులుగా సహజ, బయోడిగ్రేడబుల్ ఉత్పత్తులను ఉపయోగించేందుకు ప్రయత్నించండి.

మట్టి దీపాలు: సాంప్రదాయ మట్టి దీపాలను కొనుగోలు చేయండి. అవి బయోడిగ్రేడబుల్, అందంగా కనిపిస్తాయి. దీపాలు దీపావళి అలంకరణలో ఒక సాంప్రదాయ భాగం.

సహజసిద్ధమైన పువ్వులు: దీపావళి సమయంలో ఇంటి అలంకరణకు తాజా పువ్వులు, ఆకులను ఉపయోగించండి. బంతిపూలు, గులాబీ, మల్లె వంటి పువ్వులు మీ ఇంటికి అందాన్ని మాత్రమే కాకుండా సహజ పరిమళాన్ని కూడా తెస్తాయి.

రీసైక్లింగ్ లేదా నేచురల్ తోరణాలు: దీపావళి సమయంలో తలుపుకు తోరణాలు అలంకరించడానికి సహజమైన లేదా రీసైకిల్ చేసిన తోరణాలను ఎంచుకోండి. ఇంట్లో పాత క్లాత్ ను తోరణాలుగా తయారుచేయవచ్చు. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ తోరణాలను ఉపయోగించవద్దు. మామిడాకులతో తోరణాలు తయారుచేయవచ్చు.

సోలార్ ల్యాంప్: విద్యుత్ వినియోగాన్ని మరింత తగ్గించడానికి మీ తోట లేదా బాల్కనీలో సోలార్ లైట్ల ఏర్పాటు చేయండి.

ఆర్గానిక్ రంగోలి పౌడర్, పూల రేకుల వాడకం

దీపావళి అలంకరణలో రంగోలికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇంటి ముందు ముగ్గులు వేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. రసాయన ఆధారిత రంగులను ఉపయోగించే బదులు సేంద్రీయ రంగులతో రంగోలి గీయండి.

సహజ రంగులు: పసుపు, కుంకుమ, గోరింటాకు పొడి, బియ్యం పిండిని ఉపయోగించి అందమైన రంగోలిని తయారు చేసుకోవచ్చు.

పూల రంగోలి: చైతన్యవంతమైన, పర్యావరణ హితమైన రంగోలి కోసం బంతిపూలు, గులాబీలు వంటి రంగురంగుల పూల రేకులను ఉపయోగించవచ్చు.

బియ్యపు పిండి నమూనాలు: బియ్యం పిండిని కొంత నీటితో కలిపి సంప్రదాయ రంగోలి డిజైన్లను రూపొందించండి. ఇది పర్యావరణానికి సురక్షితం, ఇది పక్షులు లేదా కీటకాలకు ఆహారంగా కూడా మారుతుంది.

ఎకో ఫ్రెండ్లీ గిఫ్ట్స్

దీపావళి సందర్భంగా కొన్ని చోట్ల బహుమతులు ఇచ్చే సంప్రదాయం ఉంది. ఈ సమయంలో బహుమతులు ఇచ్చేటప్పుడు ఎకో ఫ్రెండ్లీ గిఫ్టులను ఎంచుకోండి.

మొక్కల బహుమతి: ఇండోర్ మొక్కలను దీపావళికి బహుమతిగా ఇవ్వవచ్చు.

హోంమేడ్ సబ్బు, చర్మ సంరక్షణ: రీసైకిల్ చేయదగిన పదార్థాలతో ప్యాక్ చేసిన సేంద్రీయ, చేతి చర్మ సంరక్షణ ఉత్పత్తులను ఎంచుకోండి.

వంటకాలు: స్వీట్లు, కుకీలు లేదా డ్రై ఫ్రూట్స్ వంటి బహుమతులు కూడా ఇవ్వవచ్చు.

ఎకో ఫ్రెండ్లీ క్రాకర్స్ ను ఎంచుకోండి: టపాసులు వాడాల్సి వస్తే తక్కువ పొగ, శబ్దం కలిగించే గ్రీన్ క్రాకర్స్ ను ఎంచుకోండి.

పెద్దగా శబ్దం చేయని టపాసులు: భూ చక్రం, చిచ్చుబుడ్డీ వంటి టపాసులు శబ్దం చేయవు, కానీ దీపావళి ఆనందాన్ని పెంచుతాయి.