Ullipaya Vadiyalu: ఈ 3 పదార్థాలతో కరకరలాడే ఉల్లి వడియాలు ఇంట్లో ఇలా పెట్టేయండి, ఫ్యాన్ కింద కూడా ఆరిపోతాయి-make crispy ullipaya vadiyalu at home with these 3 ingredients know the recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ullipaya Vadiyalu: ఈ 3 పదార్థాలతో కరకరలాడే ఉల్లి వడియాలు ఇంట్లో ఇలా పెట్టేయండి, ఫ్యాన్ కింద కూడా ఆరిపోతాయి

Ullipaya Vadiyalu: ఈ 3 పదార్థాలతో కరకరలాడే ఉల్లి వడియాలు ఇంట్లో ఇలా పెట్టేయండి, ఫ్యాన్ కింద కూడా ఆరిపోతాయి

Haritha Chappa HT Telugu

Ullipaya Vadiyalu: వేసవిలో వడియాలు, అప్పడాలు పెట్టుకునే వారు ఎక్కువే. మేము ఇక్కడ సింపుల్‌గా ఉల్లి వడియాలు రెసిపీ ఇచ్చాము. వీటిని చాలా త్వరగా సులువుగా చేసేయొచ్చు.

ఉల్లిపాయ వడియాలు రెసిపీ (Vinsi Kitchen/Youtube)

వడియాలు, అప్పడాలకు తెలుగు భోజనంలో ప్రత్యేక స్థానం ఉంది. సాంబారు, పప్పు, పెరుగు ఏది తిన్నా పక్కన వడియాలో, అప్పడాలో ఉండాల్సిందే. వేసవిలోనే అందరూ ఏడాదికి సరిపడా వడియాలను, అప్పడాలను పెట్టుకుంటారు. ఇక్కడ మేము మూడే పదార్థాలతో కరకరలాడే ఉల్లిపాయలు ఎలా చేయాలో ఇచ్చాము. దీనికి ఎర్రటి ఎండ కూడా అవసరం లేదు. ఫ్యాన్ కింద కూడా త్వరగానే ఆరిపోతాయి. పైగా ఏడాదంతా నిల్వ ఉంటాయి. ఈ ఉల్లి వడియాలు పిల్లలకు కూడా బాగా నచ్చుతాయి. పప్పు, సాంబార్ తో పక్కన ఉల్లిపామ వడియాలను పెట్టుకుంటే రుచి అద్భుతంగా ఉంటుంది.

ఉల్లి వడియాలు రెసిపీకి కావలసిన పదార్థాలు

ఉల్లిపాయలు - పావు కిలో

వరిపిండి - పావుకిలో

పచ్చిమిర్చి - ఆరు

నీరు - సరిపడినంత

ఉప్పు - రుచికి సరిపడా

ఉల్లిపాయ వడియాలు రెసిపీ

1. ఉల్లిపాయ వడియాలను చేసేందుకు పావుకిలో ఉల్లిపాయలను, పావుకిలో వరి పిండిని పక్కన పెట్టుకోవాలి.

2. ఇప్పుడు ఉల్లిపాయలను సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.

3. స్టవ్ మీద గిన్నె పెట్టి నాలుగు కప్పుల నీటిని వేయాలి.

4. పైన మూత పెట్టి ఆ నీటిని మరిగించాలి.

5. ఈ లోపు మిక్సీ జార్లో పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు, వేసుకొని వాటిని కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి.

6. ఇప్పుడు స్టవ్ మీద మరుగుతున్న నీటిలో కూడా ఒక అర స్పూను ఉప్పును వేయాలి.

7. ఆ మరుగుతున్న నీటిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి బాగా ఉడికించుకోవాలి.

8. ఒక మూడు నిమిషాలు ఉడికిస్తే ఉల్లిపాయలు పచ్చివాసన పోయే లాగా ఉడుకుతాయి.

9. ఇప్పుడు ఆ మిశ్రమంలో ముందుగా చేసి పెట్టుకున్న రుబ్బుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి బాగా కలుపుకోవాలి.

10. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చిన్న మంట మీద పెట్టి వరిపిండిని కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా గరిటతో కలుపుకుంటూ ఉండాలి.

11. అలా ఈ మిశ్రమం బాగా కలిసిపోయి గట్టిగా దగ్గరగా అయ్యేవరకు కలుపుకోవాలి.

12. అలా కలుపుకున్నాక పైన మూత పెట్టి ఆవిరి మీద కాసేపు అలా వదిలేయాలి. స్టవ్ ఆఫ్ చేసేయాలి.

13. తర్వాత మూత తీసి అది గోరువెచ్చగా అయ్యాక చేత్తోనే బాగా మెదుపుకోవాలి.

14. చేతికి కొంచెం నూనె రాసుకుని పిండి మిశ్రమాన్ని తీసి చిన్న చిన్న వడియాల్లాగా పెట్టుకోవాలి. పకోడీలు, పునుకులు ఎలా వేస్తారో అలా.

15. దీన్ని చిన్న చిన్న వడియాల ఆకారంలో పెట్టుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. లేదా ఎర్రటి ఎండలో ఆరబెట్టినా చాలు.

16. ఇవి బాగా ఎండిపోతాయి. వాటిని డబ్బాలో వేసి నిల్వ చేసుకోవాలి. నూనెలో వీటిని వేయించుకొని తింటే కరకరలాడేలా ఉంటాయి. పైగా ఎంతో రుచి కూడా.

ఉల్లి వడియాలు చాలా కొత్తగా ఉంటాయి. ఎప్పుడూ ఒకేలాంటి వడియాలు, అప్పడాలు తినేవారికి ఉల్లి వడియాలు నచ్చుతాయి. ఇవి మీకు స్పైసీగా కావాలనుకుంటే కారం కలుపుకోవచ్చు. లేదా పచ్చిమిర్చి సంఖ్యను పెంచుకున్నా సరిపోతుంది. ఇక్కడ మేము చెప్పిన పద్ధతిలో మీరు ఉల్లి వడియాలు చేసి చూడండి. ఇంటిల్లిపాదికి నచ్చుతాయి. ముఖ్యంగా ఇవి తినేందుకు క్రంచీగా ఉంటాయి కాబట్టి పిల్లలు వీటిని తినేందుకు చాలా ఇష్టపడతారు.

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి https://www.linkedin.com/in/haritha-ch-288a581a8/

సంబంధిత కథనం