Cauliflower Paneer Burji: క్యాలీఫ్లవర్ పన్నీర్ బుర్జి, చపాతీల్లోకి అదిరిపోతుంది
Cauliflower Paneer Burji: పన్నీర్ క్యాలీఫ్లవర్ కలిపి చేసిన బుర్జీ రుచి చూడకపోతే ఒకసారి ప్రయత్నించండి. తయారీ కూడా చాలా సులభం. అదెలాగో పక్కా కొలతలతో తెల్సుకోండి.
పన్నీర్ క్యాలీఫ్లవర్ బుర్జీ కర్రీ కొత్త వంటకం. క్యాలీఫ్లవర్, పన్నీర్ కాంబినేషన్‌లో కూర ప్రయత్నించాలనే ఆలోచనే రాదు. కానీ ఆ రెండూ చూడ్డానికి చాలా దగ్గరగా ఉంటాయి. మసాలాలను బాగా పీల్చుకుంటాయి. తినేటప్పుడు మంచి రుచినిస్తాయి. ఈ రెండింటిని తురుముగా చేసి వంటలో వాడతాం కాబట్టి రెండూ కలిసిపోయి నమిలేటప్పుడు రుచి కొత్తగా అనిపిస్తుంది. పాల రుచితో గోబీ కర్రీ తింటున్నట్లు అనిపిస్తుంది. ఈ కమ్మదనం రావాలంటే కొన్ని టిప్స్ పాటించి కూర వండితే సరి. ఈ కూర తయారీ ఎలాగో, కావాల్సిన పదార్థాలేంటో చూసేయండి.
క్యాలీఫ్లవర్ పన్నీర్ బుర్జీ తయారీకి కావాల్సిన పదార్థాలు:
200 గ్రాముల క్యాలీఫ్లవర్
100 గ్రాముల పన్నీర్
3 చెంచాల వంటనూనె
1 టీస్పూన్ జీలకర్ర
పావు టీస్పూన్ ఆవాలు
1 ఉల్లిపాయ
4 వెల్లుల్లి రెబ్బలు
2 టమాటాలు, బాగా పండినవి
1 చెంచా కారం
1 చెంచా ధనియాల పొడి
1 చెంచా జీలకర్ర పొడి
సగం చెంచా పసుపు
సగం చెంచా గరం మసాలా
తగినంత ఉప్పు
పావు కప్పు కొత్తిమీర తరుగు
క్యాలీఫ్లవర్ పన్నీర్ బుర్జీ తయారీ విధానం:
1. ముందుగా టమాటాలను ముక్కలుగా చేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఈ టమాటా గుజ్జును పక్కన పెట్టుకోవాలి.
2. అలాగే క్యాలీఫ్లవర్‌ను శుభ్రంగా కడిగి వీలైనంత సన్నగా తురుముకోవాలి. ఉల్లిపాయలు సన్నటి ముక్కల్లాగా కోసుకోవాలి.
3. ఇప్పుడు కడాయి పెట్టుకుని నూనె వేసుకోవాలి. వేడెక్కాక జీలకర్ర, ఆవాలు వేసుకుని చిటపటలాడనివ్వాలి.
4. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకుని మీడియం మంటమీద రెండు నిమిషాలు వేయించుకోవాలి.
5. ఉల్లిపాయలు కాస్త రంగు మారగానే మిక్సీ పట్టుకున్న టమాటా గుజ్జు వేసుకుని బాగా కలుపుతూ ఉండాలి. టమాటా గుజ్జు పచ్చిదనం పోయాక కారం, ధనియాలు, జీలకర్ర పొడి, గరం మసాలా,పసుపు వేసుకుని కలుపుకోవాలి. మూత పెట్టుకుని మరో రెండు నిమిషాల పాటూ మసాలాలు వేగనివ్వాలి.
6. ఇప్పుడు తురిమి పెట్టుకున్న క్యాలీఫ్లవర్, ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఒక నిమిషం మూత పెట్టి మగ్గించుకోవాలి.
7. తర్వాత కప్పు నీళ్లు పోసుకోవాలి. మీడియం మంట మీద అయిదు నిమిషాల పాటూ ఉడకనివ్వాలి.
8. క్యాలీఫ్లవర్ ఉడికిపోయాక పన్నీర్ తురుము లేదా చేత్తోనే బాగా మెదుపుకున్న పన్నీర్ తురుము వేసుకోవాలి. కొత్తిమీర కూడా చల్లుకుని ఒక నిమిషం ఉడకనివ్వాలి.
9. అంతే.. వేడివేడిగా గ్రేవీతో ఉండే క్యాలీఫ్లవర్ పన్నీర్ బుర్జీ రెడీ అయినట్లే.
ఈ కూరలతో గ్రేవీని మీ ఇష్టానికి తగ్గట్లు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎక్కువగా టమాటా గుజ్జు వేసుకుని గ్రేవీ ఎక్కువగా వచ్చేలా వండుకోవచ్చు. కాకపోతే కూరకు కాస్త పుల్లదనం పెరుగుతుంది. ఈ కూర చపాతీల్లోకి బాగుంటుంది. అన్నంలోకి కూడా తినేయొచ్చు.
టాపిక్