Strawberry Shake: ఇంట్లోనే సింపుల్‌గా పిల్లలకు స్ట్రాబెర్రీ షేక్ ఇలా చేసేయండి, రుచి అదిరిపోతుంది
Strawberry Shake: స్ట్రాబెర్రీ షేక్ పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ నచ్చుతుంది. మీరు ఇంట్లోనే మిల్క్ షేక్ తయారు చేయాలనుకుంటే రెసిపీ ఇచ్చాము. చిక్కటి స్ట్రాబెర్రీ షేక్ ఎలా తయారు చేయాలో తెలుసుకోండి
ఈ చలికాలంలో అనేక రకాల పండ్లు లభిస్తాయి. వాటిలో ఒకటి స్ట్రాబెర్రీ. ఇది జ్యూసీగా ఉండే టేస్టీ పండు. ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ చిన్న పండులో విటమిన్ సి, విటమిన్ ఎ, కాల్షియం, మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్, ఫాస్పరస్, పొటాషియం, డైటరీ ఫైబర్స్, యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్ సమ్మేళనాలు వంటి పోషకాలు ఉన్నాయి. ఈ పండును నేరుగా తిన్నా లేదా అనేక రకాల వంటకాలు వండుకోవచ్చు. దీనిలో చేసే మిల్క్ షేక్ కూడా రుచిగా ఉంటుంది. చాలా మంది మార్కెట్లో దొరికే చిక్కటి మిల్క్ షేక్స్ తాగడానికి ఇష్టపడతారు. స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ చిక్కగా ఎలా చేయాలో రెసిపీ తెలుసుకోండి.

స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
స్ట్రాబెర్రీలు - పది
పాలు - అర లీటరు
చక్కెర - రెండు స్పూన్లు
స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ రెసిపీ
- స్ట్రాబెర్రీలను నీటిలో వేసి పావుగంట సేపు వదిలేయండి. తరువాత చేత్తోనే కడిగి తీసి పక్కన పెట్టుకోండి. స్ట్రాబెర్రీలను రెండు మూడు సార్లు నీటితో కడగడం మరిచిపోవద్దు.
- స్ట్రాబెర్రీలపై ధూళి, పురుగుమందులు, బ్యాక్టీరియాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి నీటిలో వెనిగర్, బేకింగ్ సోడా వేసి శుభ్రపరచవచ్చు.
- శుభ్రం చేసిన స్ట్రాబెర్రీలను కనీసం 4 గంటలు ఫ్రిజ్లో ఉంచాలి.
- మీరు అల్పాహారం సమయంలో ఈ మిల్క్ షేక్ తాగాలనుకుంటే, మీరు రాత్రంతా స్ట్రాబెర్రీలను ఫ్రీజ్ చేయవచ్చు.
- ఇప్పుడు పాలు, స్ట్రాబెర్రీలు, పంచదారను బ్లెండర్ లో వేయాలి.
- బాగా బ్లెండ్ అయ్యాక ఈ చిక్కటి మిశ్రమాన్ని ఒక గ్లాసులో వేసుకోవాలి.
- దీనిలో ఎలాంటి నీళ్లు వేయకూడదు. టేస్టీ స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ రెడీ అయినట్టే. ఇది చాలా రుచిగా ఉంటుంది.
- చలికాలంలో ఇందులో ఐస్ గడ్డలు వేసుకోవాల్సిన అవసరం లేదు.
- మీకు పంచదార వేయడం ఇష్టం లేకపోతే తేనె లేదా బెల్లం వేయవచ్చు. ఇది ఆరోగ్యానికి ఎంతో రుచిగా ఉంటుంది.
స్ట్రాబెర్రీలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని మిల్క్ షేక్ రూపంలో లేదా నేరుగా పండ్ల రూపంలో తిన్నా మంచిదే. స్ట్రాబెర్రీలతో ఆరోగ్యానికి మేలు చేసే రెసిపీలు చేసుకోవచ్చు. సాయంత్రం పూట స్కూలు నుంచి ఇంటికి వచ్చే పిల్లల కోసం స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ చేసి చూడండి వారికెంతో నచ్చడం ఖాయం.